T Rajaiah vs Kadiyam: దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, నా మీద పోటీ చెయ్: కడియం శ్రీహరికి రాజయ్య సవాల్
Telangana News: లోక్‌సభ ఎన్నికల తరుణంలో వరంగల్ లో భిన్నమైన రాజకీయాలు నడుస్తున్నాయి. కడియం శ్రీహరికి దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి పోటీచేసి తనపై పోటీ చేయాలని టి రాజయ్య చాలెంజ్ చేశారు.
T Rajaiah challenges Kadiyam srihari to resign as MLA to contest againt him- వరంగల్: తెలంగాణ మొత్తం రాజకీయాలు ఒకలా ఉంటే, వరంగల్ లో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. పార్టీ సీటు ఇచ్చినా కాంగ్రెస్ లో చేరిపోయారు కడియం శ్రీహరి, ఆయన కూతురు కడియం కావ్య. సీటు రాలేదని ఆరూరి రమేష్ బీజేపీలో చేరి ఎంపీ సీటు దక్కించుకున్నారు. ఆశించినట్లుగా వరంగల్ ఎంపీ సీటు దక్కకపోయినా.. బీఆర్ఎస్ ను వీడిన కడియం శ్రీహరిని మాజీ మంత్రి తాటికొండ రాజయ్య టార్గెట్ చేశారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయాలంటూ రాజయ్య సవాల్ విసిరారు. సిగ్గు, పౌరుషం ఉంటే కడియం శ్రీహరి పదవికి రాజీనామా చెసి, నాపై పోటీ చెయ్ అంటూ రాజయ్య సవాల్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశ వ్యాప్తంగా వీరి తుది పోరు కోసం ఎదురుచూస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం
హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో శుక్రవారం పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ రాజయ్య, దాస్యం వినయ్ భాస్కర్, చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు. రాజయ్య మాట్లాడుతూ.. తన చిరకాల ప్రత్యర్థి ఎమ్మెల్యే కడియం శ్రీహరిని భూస్థాపితం చేసేంత వరకు వదిలి పెట్టేది లేదన్నారు. మీసం మెలేసి తొడగొట్టారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తన మీద బరిలోకి దిగాలని ఛాలెంజ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీలోకి రీఎంట్రీ ఇచ్చాక రాజయ్య ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఓవైపు తన రాజకీయ ప్రత్యర్థిపై మండిపడుతూనే మరోవైపు కేసీఆర్ పాటకు స్టెప్పులేశారు. పార్టీ కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపారు.
బీఆర్ఎస్ పార్టీకి స్టార్ క్యాంపెనర్ గా రాజయ్య వరంగల్ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. పార్టీకి నమ్మకద్రోహం చేసిన కడియం శ్రీహరికి ఎలాగైనా బుద్ధి చెబుతాం, రాజకీయంగా భూస్థాపితం చేస్తానంటూ మండిపడ్డారు. కడియం శ్రీహరి దళిత ద్రోహి, కల్నాయక్, నమ్మకద్రోహి అంటూ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. తెలుగు వారితో పాటు దేశం మొత్తం తమ మధ్య పోటీ కోసం ఎదురుచూస్తోందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కడియం శ్రీహరి లాంటి చరిత్ర హీనుడు ఉన్నాడని వంద సంవత్సరాలు గుర్తుండే విధంగా బుద్ది చెప్పాలని రాజయ్య విరుచుకుపడ్డారు. ఒక్క కులం కాకుండా పద్మశాలి, బైండ్ల, దళితుడని చెప్పుకొనే దళిత ద్రోహి కడియం శ్రీహరి అని ఆయన అన్నారు. తెలంగాణ మొత్తం వరంగల్ పార్లమెంట్ వైపు చూస్తున్నాడని అన్నారు. టిడిపిలో తెలంగాణ, ఆంధ్ర ను దోచుకున్న ఏకైక మంత్రిగా కడియం ఆయనను ఖల్ నాయక్ తో పోల్చారు రాజయ్య. తెలంగాణ ఉద్యమం కోసం అధికార కాంగ్రెస్ ను వదిలి టీ అర్ ఎస్ లో చేరితే గుంటనక్కలాగా నావెంటబడి, ఏదో జరుగుతుందని కడియం శ్రీహరి టీ అర్ ఎస్ లో చేరారని రాజయ్య విమర్శించారు. టీఆర్ ఎస్ లో చేరగానే రాజయ్య ఎమ్మెల్యే సీటుపై గురిపెట్టారు సక్సెస్ కాలేదు. చివరకు నా ఉప ముఖ్యమంత్రి పదవి పై గురిపెట్టి నా పదవి ఉడగొట్టాడని రాజయ్య అన్నారు. ఎమ్మెల్యే రాకుండా చేశాడు, ఎంపి రాకుండా చేశాడు. చివరకు కూతురు కు ఎంపీ టిక్కెట్ ఇప్పించుకుని అందరి వద్ద పైస ల మూటలు తీసుకొని కే సీ ఆర్ కు, పార్టీకి నమ్మకద్రోహం చేసి వెళ్లారని మండిపడ్డారు.