(Source: ECI/ABP News/ABP Majha)
Tatikonda Rajaiah: అప్పటిదాకా నేనే సుప్రీం, ఎందుకు అలా వణికిపోతున్నారు - రాజయ్య మళ్లీ హాట్ కామెంట్స్
నేడు ఎమ్మెల్యే రాజయ్య కేశవనగర్‌లో గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా రాజయ్య మాట్లాడారు.
స్టేషన్ ఘన్ పూర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. అసలే తనకు సిట్టింగ్ ఎమ్మెల్యే టికెట్ దక్కలేదని ఆయన కాస్త అసహనంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత తాను అధిష్ఠానం నిర్ణయానికే కట్టుబడి ఉంటానని ప్రకటించారు. తనకు ప్రత్యర్థి అయిన కడియం శ్రీహరితో కేటీఆర్ సమక్షంలో ఇటీవలే చేతులు కలిపి, ఎమ్మెల్యే టికెట్ దక్కిన కడియంకు పూర్తిగా మద్దతు పలుకుతానని కూడా చెప్పారు. తాజాగా రాజయ్య ఓ కార్యక్రమంలో పాల్గొని చర్చనీయాంశ రీతిలో మాట్లాడారు.
నేడు ఎమ్మెల్యే రాజయ్య కేశవనగర్‌లో గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా రాజయ్య మాట్లాడుతూ.. నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు చూస్తుంటే తాను నియోజకవర్గానికి రావాల్సిన అవకాశం లేదని అన్నారు. నియోజకవర్గంలో కష్టమైన పరిస్థితులు నడుస్తున్నాయని అన్నారు. ఇదే సమయంలో స్థానిక నేతలపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. నియోజకవర్గంలో డప్పులు కొట్టాలన్నా, ఫ్లెక్సీలు కట్టాలన్నా భయపడుతున్నారని.. కోలాటమాడాలన్నా భయంతో వణికిపోతున్నారని అన్నారు. ఇలా ఎందుకు ఇంత అభద్రతా భావంతో ఉన్నారో అర్థం కావట్లేదని మాట్లాడారు.
వచ్చే ఏడాది జనవరి 17 దాకా తాను ఎమ్మెల్యేగా ఉంటానని.. అప్పటి దాకా స్టేషన్ ఘనపూర్‌కు తానే లీడర్, సుప్రీం అని మాట్లాడారు. దీంతో టికెట్ దక్కలేదనే ఆయన అసహనం ఆయన వ్యాఖ్యల్లో కనిపించిందని స్థానిక నేతలు చర్చించుకుంటున్నారు.
స్టేషన్ ఘన్‌పూర్‌లో పరస్ఫర ప్రత్యర్థులైన తాటికొండ రాజయ్య, కడియం శ్రీహరిని ఇటీవలే మంత్రి కేటీఆర్ చొరవ చూపి ఇద్దరినీ కలిపిన సంగతి తెలిసిందే. కేటీఆర్ వారితో ప్రగతి భవన్‌లో సమావేశమయ్యారు. రాజయ్యకు కీలక బాధ్యతలు అప్పగిస్తామని చెప్పగా.. రెండు రోజుల క్రితమే కీలక పదవి కూడా అప్పగించారు. తెలంగాణ రైతు సంక్షేమ సంఘాల సమితి చైర్మన్ గా తాటి కొండ రాజయ్య నియమితులు అయ్యారు.