కేటీఆర్ పోలవరం ప్రాజెక్టు గురించి దశాబ్దాలుగా వింటున్నామని, తనకు 50 ఏళ్లు వచ్చినా ఇంకా పూర్తి కాలేదని అన్నారు. ఇది 2028లో పూర్తి కావచ్చని పేర్కొన్నారు.
KTR On Polavaram Project: దశాబ్దాలు గడిచినా పోలవరం పూర్తి కాలేదు.. కాలంతో పోటీపడి కాళేశ్వరం నిర్మించాం: కేటీఆర్
దశాబ్దాలు గడుస్తున్నా ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదని, కానీ కేసీఆర్ నాయకత్వ పటిమతో తక్కువ కాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

- మాజీ మంత్రి కేటీఆర్ పోలవరం ప్రాజెక్టు ఆలస్యంపై తీవ్ర విమర్శ.
- కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును వేగంగా పూర్తిచేసి అద్భుతాలు సృష్టించారు.
- కాంగ్రెస్ నిర్లక్ష్యంతో నీటిని సముద్రంలోకి వృథా చేస్తున్నారని ఆరోపణ.
- కాళేశ్వరం ప్రాజెక్ట్ రైతుల బతుకులు మార్చి, పంటలు పెంచింది.
Kaleshwaram Project | భూపాలపల్లి: ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టుపై తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము పుట్టకముందు నుంచే పోలవరం ప్రాజెక్టు గురించి వింటున్నామని, కానీ దశాబ్దాలు గడుస్తున్నా అది ఇంకా పూర్తి కాలేదన్నారు. అయితే 2028లో పూర్తి కావొచ్చేమో అన్నారు. ఇందుకు భిన్నంగా తెలంగాణలో కేసీఆర్ కాలంతో పోటీపడి అద్భుతమైన ప్రాజెక్టులను నిర్మించారని కొనియాడారు. కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ నేతల బృందం భూపాలపల్లి జిల్లాలోని కన్నెపల్లి పంప్ హౌస్‌కు చేరుకొని పరిశీలించారు.
పోలవరం ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదు..
అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. ‘మా పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు గురించి దశాబ్దాలుగా వింటున్నాం. నాకు ఈ నెలతో 50 ఏళ్లు నిండుతున్నాయి. నేను పుట్టకముందు నుంచే పోలవరం గురించి చర్చలు జరుగుతున్నాయి. 50, 60 ఏళ్ల క్రితం సినిమాల్లో కూడా దీని ప్రస్తావన ఉండేది. పోలవరం అనేది గోదావరికి అడ్డంగా కట్టి డెల్టాకు నీళ్లు తీసుకెళ్లే ఒక గ్రావిటీ ఆధారిత ప్రాజెక్ట్. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయ్యాక 2004-05లో దీనికి మళ్లీ పునాది రాయి పడింది. ఇప్పటికి 21, 22 ఏళ్లు అవుతున్నా ఆ ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదు.

కేసీఆర్ నాయకత్వ పటిమతో ప్రాజెక్టులు పూర్తి
ఆంధ్రా ప్రాజెక్టులతో పోలిస్తే తెలంగాణలో కేసీఆర్ నాయకత్వం, ఇక్కడి ప్రజలపై ఆయనకున్న కమిట్‌మెంట్ పూర్తిగా భిన్నమైనది. కేసీఆర్ కాలంతో పోటీ పడుతూ, ఎండకాలంలో సైతం నీళ్లు దొరికే అత్యుత్తమమైన పాయింట్‌ను ఎంచుకుని ప్రాజెక్టులను నిర్మించారు. కాళేశ్వరం సాధారణ గ్రావిటీ ప్రాజెక్ట్ కాదని, 80 మీటర్ల నుంచి ఏకంగా 620 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసేలా భారీ ‘బాహుబలి’ మోటార్లను పెట్టి అద్భుతాలు చేశాం. గోదావరి, ప్రాణహిత కలిసిన తర్వాత, కరువు కాలంలోనూ నీరు పుష్కలంగా ఉండే ప్రాంతాన్ని గుర్తించి మరీ ఈ ప్రాజెక్టుకు పునాది వేసి, విజయవంతంగా పూర్తి చేశామని’ కేటీఆర్ స్పష్టం చేశారు.
కన్నెపల్లి పంప్ హౌస్‌ను పరిశీలించిన కేటీఆర్ బృందం
‘కాంగ్రెస్ సర్కార్ ఎన్నో అడ్డంకులు సృష్టించి, తమ పర్యటనను అడ్డుకోవాలని చూసినా... వాటన్నిటినీ అధిగమించి ఇక్కడి చేరుకున్నాం.హైదరాబాద్ నుంచి కన్నెపల్లికి చేరుకునేందుకు సాధారణంగా 4 గంటలు పడుతుందని, కానీ పెంబర్తి, జనగామ, ఘన్‌పూర్, పరకాల, భూపాలపల్లి, కాటారం, మహదేవ్‌పూర్‌లో అడుగడుగునా పోలీసులు తమ్మల్ని అడ్డుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల నుండి ఆదేశాలు ఉన్నాయంటూ పోలీసులు వ్యవహరించిన తీరును తప్పుబడుతూ, తాము ఇక్కడికి రాజకీయ కక్ష తీర్చుకునేందుకు రాలేదని స్పష్టం చేశారు. దశాబ్దాలుగా నీళ్ల కోసం పోరాటాలు కొనసాగాయని, తెలంగాణ భౌగోళికంగా గోదావరి, కృష్ణా నదులు కింద పారుతుంటే భూములు పైనున్నాయి. అందువల్ల లిఫ్ట్ ద్వారా మాత్రమే నీటిని తరలించే బృహత్తర ప్రణాళికను కేసీఆర్ ప్రభుత్వం చేసిందని’ కేటీఆర్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ చేతకానితనంతో వృథాగా సముద్రంలోకి గోదావరి జలాలు
తుమ్మిడిహట్టి ప్రాజెక్టు ఎత్తుపై గతంలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అభ్యంతరాల నేపథ్యంలో, ఎంతటి కరువులోనైనా నీటి లభ్యత ఉండే మేడిగడ్డ వద్ద బ్యారేజీ కట్టాలని అధికారులు సూచించారని కేటీఆర్ తెలిపారు. ఐదు దశాబ్దాలుగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారని, కానీ తాము మూడున్నరేళ్ల కాలంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ అయిన కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించామని చెప్పారు. కాళేశ్వరం అంటే కేవలం ఒక బ్యారేజీ కాదని, అది 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 21 పంపుహౌస్‌లు, 1531 కి.మీ. కాల్వల సమాహారమని వివరించారు.
మేడిగడ్డ బ్యారేజీలో కేవలం 2 పిల్లర్లు కుంగితే, దానికి రూ.400 కోట్లతో రిపేర్ చేయడానికి ఎల్ అండ్ టీ సంస్థ ముందుకు వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. కాళేశ్వరం కూలేశ్వరమైందని కాంగ్రెస్ నాయకులు పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారని, ప్రస్తుతం మేడిగడ్డతో అవసరం లేకుండానే కన్నెపల్లి పంప్ హౌస్ నుండి నీటిని తరలించే అవకాశం ఉన్నా ప్రభుత్వం పంపులు ఆన్ చేయడం లేదని, దీనివల్ల 98 వేల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
కాళేశ్వరంతోనే మారిన రైతుల బతుకులు, పెరిగిన పంటలు
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొత్తగా 40 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించబడిందని, ఎస్‌ఆర్‌ఎస్‌పీలో నీళ్లు లేకుంటే రివర్స్ పంపింగ్ ద్వారా నింపుకోవచ్చని కేటీఆర్ పేర్కొన్నారు. 7 జిల్లాలకు సాగు, తాగునీరు ఇచ్చే ఈ ప్రాజెక్టును కాంగ్రెస్ కాళ్లు నరికేసి పడావు పెట్టడం వల్లే ఇవాళ హైదరాబాద్‌లో తాగునీటి కోసం 15 వేల వాటర్ ట్యాంకర్లు పెరిగాయని విమర్శించారు. కాళేశ్వరం నిర్మాణానికి మొత్తం రూ.94 వేల కోట్లు ఖర్చయితే, కాంగ్రెస్ నాయకులు లక్ష కోట్ల అవినీతి జరిగిందని అబద్ధాలు చెప్తున్నారని, సీఎం రేవంత్‌కు సోయి, ఉత్తమ్‌కు స్పృహ లేదని ఎద్దేవా చేశారు. 2014 కంటే ముందు రికార్డు స్థాయిలో పంటలు ఎందుకు పండలేదో చెప్పాలని డిమాండ్ చేస్తూ, కాళేశ్వరం వచ్చాకే సూర్యాపేట లాంటి జిల్లాలకు నీళ్లొచ్చాయని, పంజాబ్‌ను తలదన్ని వరి ధాన్యంలో తెలంగాణ నెంబర్ వన్ కావడానికి, రైతుల ఆత్మహత్యలు తగ్గడానికి కాళేశ్వరం ప్రాజెక్టే కారణమని కేటీఆర్ స్పష్టం చేశారు.
Frequently Asked Questions
పోలవరం ప్రాజెక్టుపై కేటీఆర్ ఏమన్నారు?
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రత్యేకతలు ఏమిటి?
ఇది సాధారణ గ్రావిటీ ప్రాజెక్టు కాదని, 80 మీటర్ల నుంచి 620 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసేలా భారీ మోటార్లతో నిర్మించబడిందని కేటీఆర్ తెలిపారు. గోదావరి, ప్రాణహిత కలిసిన చోట నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని దీనిని నిర్మించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని కేటీఆర్ ఎందుకు అన్నారు?
మేడిగడ్డ బ్యారేజీ రిపేర్ చేయడానికి L&T సంస్థ ముందుకు వచ్చినా పట్టించుకోలేదని కేటీఆర్ ఆరోపించారు. కన్నెపల్లి పంపులు ఆన్ చేయకపోవడం వల్ల 98 వేల క్యూసెక్కుల నీరు సముద్రంలో కలుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు రైతులపై ఎలాంటి ప్రభావం చూపింది?
ఈ ప్రాజెక్టు ద్వారా 40 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు స్థిరీకరించబడిందని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ వరి ధాన్యంలో నంబర్ వన్ కావడానికి, రైతుల ఆత్మహత్యలు తగ్గడానికి కాళేశ్వరం కారణమని ఆయన అన్నారు.
ట్రెండింగ్ వార్తలు























