Korean Kanakaraju Review - కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
Korean Kanakaraju Review In Telugu: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ కామెడీ కొరియన్ కనకరాజు. కమెడియన్ సత్య కీలక పాత్ర చేసిన ఈ సినిమా ఎలా ఉందంటే?
మేర్లపాక గాంధీ
వరుణ్ తేజ్, సత్య, రితికా నాయక్, మురళీధర్ గౌడ్, శ్రీనివాస్ అవసరాల, సునీల్ తదితరులు
Varun Tej's Korean Kanakaraju Movie Review In Telugu : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన హారర్ కామెడీ 'కొరియన్ కనకరాజు'. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. రితికా నాయక్ హీరోయిన్. కమెడియన్ సత్య కీలక పాత్ర పోషించారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు నిర్మించిన ఈ సినిమాకు తమన్ సంగీత దర్శకుడు. ఈ సినిమా ఎలా ఉంది?
కథ (Korean Kanakaraju Story): కనకరాజు (వరుణ్ తేజ్)ది ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లాలోని పెనుగొండ. అతని స్నేహితుడు కిష్టప్ప (సత్య)కు ఫోటో స్టూడియో ఉంది. సంపాదించిన డబ్బును బ్యాంకులో వేసుకోవడం... సాయంత్రం స్నేహితుడితో కలిసి బారులో మందు కొట్టడం... డైలీ కనకరాజు చేసే పని. కిష్టప్ప ఫోటో స్టూడియోకు వచ్చిన చైత్ర (రితికా నాయక్)ను చూసి ప్రేమలో పడతాడు. ఆమెకు కొరియా అంటే పిచ్చి. ఎప్పటికైనా కొరియన్ కుర్రాడిని పెళ్లి చేసుకుని కొరియాలో సెటిల్ అవ్వాలనుకునే టైపు. చైత్ర వెంట పడుతూ హ్యాపీగా ఉన్న కనకరాజు జీవితంలో అనుకోని కుదుపు.
ఓ రోజు బారులో ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న చెంగా రెడ్డి (సునీల్) మనుషులతో గొడవ పడుతున్నప్పుడు కనకరాజు శరీరంలోకి కొరియన్ ఆత్మ ప్రవేశిస్తుంది. తానొక వ్యాపారవేత్తను అని, తనను ఎవరు చంపేశారో తెలియదని, కొరియాకు వెళ్లి తన భార్య పిల్లలను చూశాక కనకరాజు శరీరాన్ని వదిలేస్తానని చెబుతుంది. సరేనని కనకరాజుతో పాటు కిష్టప్ప, చైత్ర కూడా కొరియా వెళతాడు. అక్కడికి వెళ్ళాక ఆ ఆత్మ గ్యాంగ్‌స్టర్‌దని తెలుస్తుంది. శరీరంలో ఆత్మ ప్రవేశించిన 21 రోజుల్లో గనుక బయటకు వెళ్ళకపోతే... ఆ శరీరం పూర్తిగా ఆత్మ ఆధీనంలోకి వెళుతుందని కిష్టప్ప తండ్రి (మురళీధర్ గౌడ్) చెబుతారు.
కొరియాలో ఏమైంది? గ్యాంగ్‌స్టర్‌ను చంపినది ఎవరు? సింగపూర్ వెళ్లిన కనకరాజు అన్నయ్య పృథ్వీ (శ్రీనివాస్ అవసరాల) కొరియాలో ఎందుకు కనిపించారు? ఆత్మ కనకరాజును వదిలేసిందా? లేదా? అనేది సినిమా.
Also Read : Friday OTT Movies : ఈ శుక్రవారం వెరీ స్పెషల్ - ఒక్క రోజే ఓటీటీల్లో 16 సినిమాలు... మీ ఛాయిస్ ఏంటి?
విశ్లేషణ (Korean Kanakaraju Review Telugu): సినిమాల్లో కమర్షియల్ అంశాల కంటే కంటెంట్ ఉన్న కథలకు వరుణ్ తేజ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. మాస్ ఇమేజ్ కోసం ఆయన ఎప్పుడూ ట్రై చేయలేదు. ఆయన ఫిల్మోగ్రఫీలో డిఫరెంట్ స్టోరీ బేస్డ్ ఫిలిమ్స్ ఉంటాయి. అయితే... అటు కంటెంట్ ఓరియెంటెడ్ ఫిల్మ్స్, ఇటు కమర్షియల్ సినిమాలకు ఇటీవల ఆయనకు సరైన విజయాలు ఇవ్వలేదు. ఈ తరుణంలో హారర్ కామెడీ 'కొరియన్ కనకరాజు' చేశారు.
'కొరియన్ కనకరాజు'లో వరుణ్ తేజ్ టెస్ట్ కనిపిస్తుంది. సూపర్ హిట్ ఫార్ములాలో తీసిన సినిమా అయినప్పటికీ... కొరియన్ ఆత్మ, శరీరంలో ప్రవేశించిన 21 రోజుల్లో ఆత్మ బయటకు రావాలనేవి ఆసక్తిగా కలిగించేవి. కమర్షియల్ అంశాలతో పాటు కంటెంట్ కూడా ఉందీ కథలో! అయితే... దర్శకుడు మేర్లపాక గాంధీ రాత, తీత ఆశ్చర్యపరిచింది. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్', 'ఎక్స్‌ప్రెస్ రాజా' సినిమాల్లో కనిపించిన దర్శక రచయిత... ఈసారి ఎందుకో వెనుకబడ్డాడు. కామెడీలో మేర్లపాక గాంధీ మెప్పించారు. వరుణ్ తేజ్, సత్య సీన్స్ గానీ... హీరో శరీరంలో కొరియన్ ఆత్మ ప్రవేశించిన తర్వాత వచ్చే సన్నివేశాలు గానీ వినోదాత్మకంగా తీశారు. అయితే కథను ఆసక్తిగా చెప్పడంలో ఫెయిలయ్యారు.
హారర్ కామెడీలకు లాజిక్కులతో పని లేదు. స్క్రీన్ మీద మేజిక్ జరిగితే చాలు. ఈ 'కొరియన్ కనకరాజు'లో కామెడీ మేజిక్ జరిగింది. నవ్వులకు లోటు లేదు. ముఖ్యంగా ఫస్టాఫ్ అంతా వరుణ్ తేజ్, సత్య కలిసి ఎంటర్టైన్ చేశారు. సెకండాఫ్ వచ్చేసరికి, మరీ ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో మేర్లపాక గాంధీ డిజప్పాయింట్ చేశారు. ప్రతి ట్విస్ట్ ఊహించేలా ఉంది. బ్రదర్ సెంటిమెంట్ కూడా సరిగా వర్కవుట్ కాలేదు. ఈ సినిమాకు మరో మేజర్ మైనస్ తమన్ మ్యూజిక్. పాటలు, ఆర్ఆర్ ఆశించిన స్థాయిలో లేవు.
రాయలసీమ కుర్రాడిగా వరుణ్ తేజ్ మాసీగా కనిపించారు. ఆ యాసను కూడా బాగా పలికారు. కొరియా వెళ్ళిన తర్వాత స్టైలిష్ అవతార్‌లో కనిపించారు. ఆయన లుక్, యాక్టింగ్ బావున్నాయి. ముఖ్యంగా సత్యతో కామెడీ టైమింగ్ కుదిరింది. ఇద్దరి సీన్స్ నవ్విస్తాయి. ముఖ్యంగా సత్య అదరగొట్టాడు. హీరోలను ఇమిటేట్ చేస్తూ చెప్పే కొన్ని డైలాగులకు థియేటర్లలో రెస్పాన్స్ వస్తుంది. రితికా నాయక్ స్క్రీన్ స్పేస్, ఆమె క్యారెక్టర్ ఇంపార్టెన్స్ తక్కువ. హీరోతో పాటు కనిపించినా పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. సునీల్, టెంపర్ వంశీలను సరిగా వాడుకోలేదు. మురళీధర్ గౌడ్ ఉన్నంతలో నవ్వించే ప్రయత్నం చేశారు. హీరో తల్లిదండ్రులుగా తులసి, చిన్నా కనిపించారు. వాళ్ళకూ ఇంపార్టెన్స్ లేదు.
'కొరియన్ కనకరాజు' థియేటర్లకు వెళ్ళిన ప్రేక్షకులకు నవ్వులకు లోటు ఉండదు. కానీ కథ, ఎగ్జిక్యూషన్ పరంగా మేర్లపాక గాంధీ డిజప్పాయింట్ చేశారు. వరుణ్ తేజ్ తన బెస్ట్ ఇచ్చారు. సత్య అదరగొట్టారు. లాజిక్స్ వంటివి ఆలోచించకుండా కేవలం నవ్వుల మేజిక్ కోసం అయితే ఎటువంటి అంచనాలు లేకుండా సినిమాకు వెళ్ళండి.
Also Read : Korean Kanakaraju OTT : కొరియన్ కనకరాజు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు చూడొచ్చంటే?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















