Kalvakuntla Kavitha: కులగణన తర్వాతే స్థానిక ఎన్నికలు పెట్టాలి - ఎమ్మెల్సీ కవిత డిమాండ్
Warangal News: లో బీసీ హక్కుల సాధన కోసం భారత జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ సంయుక్తంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత పాల్గొన్నారు.
Caste Census in Telangana: రాష్ట్రంలో కులగణన చేపట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో బీసీ డిక్లరేషన్ లో ప్రకటించిన మేరకు 6 నెలల్లో కులగణన చేపట్టడానికి తక్షణమే ప్రక్రియ ప్రారంభించాలని స్పష్టం చేశారు. ఆగమాగం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనుకుంటే ఊరుకోబోమని హెచ్చరించారు. మంగళవారం (ఫిబ్రవరి 6) వరంగల్ లో బీసీ హక్కుల సాధన కోసం భారత జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ సంయుక్తంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. బిహార్ లో కులగణన చేసినా కోర్టుల్లో ఇబ్బందులు ఎదురయ్యాయని, కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ కులగణన చేస్తామని హామీ ఇచ్చి చేయలేదని గుర్తు చేశారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై స్పష్టమైన కార్యాచరణను ప్రకటించాలని, అధికారంలోకి వచ్చి రెండు నెలలు గడిచినా ముందడుగు వేయలేదని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే కొత్తగా దాదాపు 24 వేల మంది బీసీలు ఎంపీటీసీలు, సర్పంచ్ లు, కౌన్సిలర్లు, కార్పోరేటర్లు, జడ్పీటీసీలు అవుతాయని కాంగ్రెస్ పార్టీ చెప్పిందని గుర్తు చేశారు. ఈ రీత్యా పరిపాలనలో బీసీ భాగస్వామ్యం ఉండాలంటే తక్షణమే జనగణన ప్రక్రియను ప్రారంభించాలని పునరుద్ఘాటించారు. అలాగే, బీసీల సంక్షేమ కోసం ప్రతి ఏటా రూ. 20 వేల కోట్లు బడ్జెట్ కేటాయిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, కాబట్టి ఈ 2024-25 బడ్జెట్ లో ప్రభుత్వం రూ. 20 వేల కోట్లు కేటాయించాలని అన్నారు.
ఆ జిల్లా పేరు మార్చాలి
ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ సబ్ ప్లాన్ కి చట్టబద్ధత కల్పించాలని, ఎంబీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, జనగామా జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జిల్లాగా నామకరణం చేయాలని అన్నారు. అంతేకాకుండా, అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, దీనిపై ఏప్రిల్ 11 లోపు ప్రభుత్వం సానుకూల ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఇచ్చుకునే సౌలభ్యం కల్పించాలని, తద్వారా జనాభా ఆధారంగా రాష్ట్రాల్లో రిజర్వేషన్లు చేసుకోవచ్చని తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రతిపాదించారని గుర్తు చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం రిజర్వేషన్లు చేసుకునే అవకాశాన్ని రాష్ట్రాలకు ఇవ్వడం లేదని తప్పుబట్టారు. నిరంతరం సుప్రీం తీర్పును చూపించి కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ల విషయంలో రాష్ట్రాలకు వెసులుబాటు కల్పించడంలేదని చెప్పారు. మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు కోటా కల్పించాలని డిమాండ్ చేశారు.
2018 నుంచి ఇప్పటి వరకు 4365 మంది సివిల్స్ కు ఎంపికైతే అందులో కేవలం 1,195 మాత్రమే బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉన్నాయని లేవనెత్తారు. ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు ఉన్నా కూడా కేవలం 15.5 శాతం మందిని మాత్రమే ఎంపిక చేశారని చెప్పారు. ఎస్సీలు 5 శాతం, ఎస్టీలు కేవలం 3 శాతం మాత్రమే ఎంపికయ్యారని వివరించారు. కోల్పోతున్న రిజర్వేషన్లపై ఎవరూ మాట్లాడడం లేదని, కాబట్టి బీసీ మేధావులు ఈ అంశంపై గళమెత్తాలని పిలుపునిచ్చారు.
హక్కుల కోసం పోరాటం చేయాలంటే... తెలంగాణ ఉద్యమం తరహాలో పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఉద్యమాలకు పెట్టింది పేరైన వరంగల్ తెలంగాణ ఉద్యమంలో ముందువరసలో ఉందని గుర్తు చేశారు. భారత జాగృతిగా రూపాంతరం చెందిన తెలంగాణ జాగృతి అనేక సామాజిక అంశాలపై పోరాటాలు చేసిందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంతో కొట్లాడి బతుకమ్మకు రాష్ట్ర హోదా, నిరాహార దీక్ష చేసి అసెంబ్లీ ఆవరణలో అంబేడ్కర్ విగ్రహం సాధించామని, నైపుణ్యాభివృద్ధి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి దాదాపు 20 వేల మంది యువతకు ఉద్యగ కల్పనకు దారిచూపామని, దేశవ్యాప్తంగా మహిళా బిల్లుపై చర్చకు ప్రేరేపించామని వివరించారు.
రౌండ్ టేబుల్ సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, బీఆర్ఎస్ నాయకులు వీ ప్రకాశ్, సుందర్ రాజు యాదవ్, యునైటెడ్ పూలే ఫ్రంట్ కన్వీనర్ గట్టు రామచందర్ రావు, భారత జాగృతి రాష్ట్ర నాయకుడు దాస్యం విజయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.