Telangana: ఆ మహిళలపై దాడుల్ని ఖండించిన మంత్రి సత్యవతి రాథోడ్, చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు
ఆదివాసీ మహిళలపై ఫారెస్ట్ బీట్ గార్డులు అమానుషంగా ప్రవర్తించారన్న సంఘటనపై తెలంగాణ గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్రంగా స్పందించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకల పల్లి మండలంలో రాచన్న గూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఆదివాసీ గూడెం, సాకివాగుకు చెందిన ముగ్గురు ఆదివాసీ మహిళలపై ఫారెస్ట్ బీట్ గార్డులు అమానుషంగా ప్రవర్తించారన్న సంఘటనపై తెలంగాణ గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్రంగా స్పందించారు. వెంటనే ఈ సంఘటనపై సమగ్ర విచారణ చేసి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, కమిషనర్ ను ఆదేశించారు.
ఆదివాసీ మహిళలకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని, వారికి అన్ని విధాల న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఇప్పటికే అడవిలో జీవనాధారం నిమిత్తం అటవీ ఉత్పత్తుల కోసం వెళ్లే ఆదివాసీల జోలికి వెళ్లొద్దని పలుసార్లు హెచ్చరించామని గుర్తుచేశారు. అయినా కొంతమంది ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని, వారిని ఉపేక్షించేది లేదన్నారు. మంత్రి ఆదేశాలతో అధికారులు వెంటనే స్పందించి, విచారణ ప్రారంభించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐటిడిఏ ప్రాజెక్టు అధికారికి దీనిపై వెంటనే విచారణ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
అసలేం జరిగిందంటే..
గత 5 ఏళ్లుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెలంగాణ, చత్తీస్‌ఘడ్ సరిహద్దు ప్రాంతానికి చెందిన గొత్తి కోయలు వలస వచ్చి ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అటవీ సమీపంలోనే వీరు ఉండటంతో గతంలో తరుచుగా ఫారెస్ట్ అధికారులు వలస గొత్తి కోయలపై దాడులకు పాల్పడిన సంఘటనలు ఉన్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టులకు పోలీసులకు మద్య ఉద్రిక్తలు నెలకొన్న నేపథ్యంలో వీరంతా వలస వచ్చారు. ఇలా వలస వచ్చిన గొత్తి కోయలు సమీప గ్రామాల్లో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
పొయ్యిలో కట్టెలు సేకరించేందుకు అడవిలోకి వెళ్లిన ఆదివాసీ మహిళలపై అటవీశాఖ అధికారులు దాడి చేసిన సంఘటన చోటు చేసుకుంది. మహిళలను దాడి చేయడంతోపాటు వివస్త్రను చేసి కొట్టారంటూ బాదిత మహిళలు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబందించిన వివరాలిలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం సాకివాగు సమీపంలో ఇటీవల చత్తీస్‌ఘడ్ నుంచి వలస వచ్చిన కూలీలు నివాసముంటున్నారు. నలుగురు మహిళలు పొయ్యిలో కట్టెలు తెచ్చుకునేందుకు సమీపంలోని అడవిలోకి వెళ్లారు.
అటువైపుగా వచ్చిన ఫారెస్ట్ గార్డులు వీరిపై దాడి చేశారు. దీంతో భయంతో నలుగురు మహిళలు పరుగులు పెట్టారు. ఇందులో ఒక మహిళ పరిగెడుతూ గుంతలో పడిపోవడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే మిగిలిన ముగ్గురిలో ఒక మహిళపై తీవ్రంగా దాడి చేశారని, వివస్త్రను చేసి దాడి చేశారని బాదిత మహిళలు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై విచారణ చేసి ఆదివాసీ మహిళలపై దాడులకు పాల్పడిన అటవీశాఖ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని న్యూడెమోక్రసీ పార్టీ పాల్వంచ డివిజన్ కమిటీ నాయకులు కుంజా కృష్ణ డిమాండ్ చేశారు.
Also Read: Weather Updates: తెలంగాణను కమ్మేసిన దట్టమైన మేఘాలు.. ఏపీలో పెరిగిన చలి తీవ్రత, మళ్లీ అకాల వర్షాలు