(Source: ECI/ABP News/ABP Majha)
Erraballi Dayakar: నాకు నచ్చిన సీఎంలు ఆ ఇద్దరే, మిగతా వాళ్లంతా బ్రోకర్లు - ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు
మహబూబాబాద్ జిల్లా పెద్దవంగరలో శుక్రవారం (మే 26) బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు.
తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తనకు నచ్చిన ముఖ్యమంత్రులు ఇద్దరే అని అన్నారు. వారిలో ఒకరు ఎన్టీ రామారావు అయితే, మరొకరు కేసీఆర్ అని చెప్పారు. మిగతా వాళ్లంతా బ్రోకర్ గాళ్లే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగరలో శుక్రవారం (మే 26) బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. ఈ దేశాన్ని సుదీర్థ కాలంగా పరిపాలించిన కాంగ్రెస్, ఇప్పుడు పాలిస్తున్న బీజేపీల దుష్పరిపాలన వల్లే ఈ దుష్ప్రభావాలు ఏర్పడ్డాయని అన్నారు. దేశం, రాష్ట్రాలు ఏళ్ళకు ఏళ్ళు వెనుకబడిపోయాయని, అందుకే సీఎం కేసీఆర్ లాంటి పరిపాలనా దక్షుల అవసరం దేశానికి, రాష్ట్రానికి ఏర్పడిందని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కేంద్రంలో మన రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాలపై పొగడ్తలు గుప్పించి, రాష్ట్రానికి వచ్చే సరికి విమర్శలు చేస్తూ, సీఎం కేసీఆర్‌ను, ఆయన పాలనను తిడుతున్నారు. బీజేపీ వైఖరిని తిప్పి కొట్టాలి. గ్రామాలకు వచ్చే ఆ పార్టీల నాయకులను నిలదీయాలి. వారి విమర్శలను తిప్పి కొట్టాలి. అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజలకు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం పెద్దవంగర మండలం చిట్యాల, బొమ్మకల్ గ్రామాలకు కలిపి, పెద్దవరంగలో, గంట్లకుంట, పోచంపల్లి, అవుతాపురం గ్రామాలకు కలిపి పోచంపల్లి క్రాస్ రోడ్డులో శుక్రవారం జరిగిన ఆత్మీయ సమ్మేళనాల్లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి విశిష్ట అతిథిగా ప్రసంగించారు.
‘‘దేశంలో కేసీఆర్ లాగా ఎవరూ ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని పట్టించుకున్న పాపాన పోలేదు. కేసీఆర్ చేస్తున్నటువంటి ఇంత గొప్ప పరిపాలన నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చూడలేదు. ప్రజలు విశ్లేషించుకోవాలి... మంచిని అభినందించాలి. స్వాగతించాలి. ఆశీర్వదించాలి. చెడుని తిరస్కరించాలి. కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని, సంక్షేమాన్ని అభినందిస్తున్నది. పార్లమెంట్ సాక్షిగా పొడుతున్నది. అవార్డులు ఇచ్చి తస్కరిస్తున్నది. రాష్ట్రానికి వచ్చే సరికి తిడుతున్నది. విమర్శలు చేస్తున్నది. బీజేపీ ద్వంద్వ వైఖరిని తిప్పి కొట్టాలి. ఆ పార్టీ నేతలు గ్రామాల్లోకి వస్తే నిలదీయాలి’’ అని మంత్రి ఎర్రబెల్లి ప్రజలకు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్న పలు అభివృద్ధి పథకాలను ప్రజలకు, పార్టీ శ్రేణులకు సోదాహరణంగా వివరించారు.
తాను నియోజకవర్గ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని, పార్టీ కార్యకర్తలను కడుపులో పెట్టుకుని చూస్తున్నదని, ప్రజలు సీఎం కేసీఆర్ కి అండగా నిలవాలని, సీఎం కేసీఆర్ ప్రజలకు అండగా ఉంటారని మంత్రి ఎర్రబెల్లి వివరించారు.
పాల్గొన్న కడియం శ్రీహరి
మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మాట్లాడుతూ, ‘‘సిఎం కేసీఆర్ పాలన వల్ల దేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం తయారైంది. అన్ని రంగాల్లో రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది. అభివృద్ధి, సంక్షేమాల్లో ముందున్న తెలంగాణను చూసి దేశం నేర్చుకుంటున్నది. ఇంత గొప్పగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దిన ఘనత మన సీఎం కేసీఆర్ గారికే దక్కుతుంద’’ని అన్నారు. అయితే, కాంగ్రెస్, బీజేపీ లు రాష్ట్రంలో కేసీఆర్‌పాలన చూసి, దేశానికి ఆయన నాయకత్వం అవసరమున్న నేపథ్యంలో ఆయన్ని దేశ రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకోవడానికే అడ్డగోలుగా విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం సహకరించుకున్నా, సీఎం కేసీఆర్ ఇంతగా అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. తెలంగాణలో అమలు అవుతున్న పలు అభివృద్ధి పనులను కడియం ప్రజలకు, పార్టీ శ్రేణులకు వివరించారు.
అంతకుముందు ఈ ఆత్మీయ సమ్మేళనంలో సిఎం కేసీఆర్ సందేశాన్ని చదివి వినిపించారు. ఎర్రబెల్లి ట్రస్టు చైర్ పర్సన్ ఎర్రబెల్లి ఉషా దయాకర్‌రావు పాలకుర్తి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కళ్ళకు కడుతున్నది. ఇంతగా ఎప్పుడూ అభివృద్ధి జరగలేదు. ఇటు నియోజకవర్గంలో దయన్నను, అటు రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ను కాపాడుకుంటేనే, వారు ప్రజలను కాపాడగలుగుతారని, ప్రజలు వారికి అండగా నిలవాలని కోరారు.
కాగా, ఆత్మీయ సమ్మేళనాల ప్రాధాన్యాన్ని పార్టీ శ్రేణులకు వివరించారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునే పార్టీ బిఆర్ ఎస్ మాత్రమేనని, తాను కూడా కార్యకర్తలను కాపాడుకుంటానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ కార్యకర్తలకు తెలిపారు. పార్టీ కార్యకర్తలతో కలిసి మంత్రి భోజనాలు చేశారు. వారికి వడ్డించారు. అందరినీ పలకరిస్తూ, కుశల ప్రశ్నలు వేస్తూ మంత్రి సందడి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, పలువురు ప్రజలు పాల్గొన్నారు.