Maoist Surrender: మావోయిస్టు పార్టీకి గట్టి దెబ్బ, లొంగిపోయిన అగ్రనేత సావిత్రి!
Maoist Surrender: మావోయిస్టు పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. అగ్రనేత శ్రీనివాస్ భార్య, కీలక మహిళా నేత సావిత్రి పోలీసులకు లొంగిపోయారు. రామన్న చనిపోయినప్పటి నుంచి ఆమె పార్టీకి దూరంగా ఉంటున్నారు.
Maoist Surrender: తెలంగాణ మావోయిస్టు పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. మరో కీలక మహిళా నేత లొంగిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం పోలీసుల ముందు మావోయిస్టు అగ్రనేత దివంగత రావుల శ్రీనివాస్ అలియాస్ రామన్న భార్య సావిత్రి లొంగిపోయారు. ఇటీవలే రామన్న అనారోగ్యంతో చనిపోయారు. రామన్న మృతి తర్వాత ఆమె భార్య సావిత్రి పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే తాను లొంగిపోతున్నట్లు తెలంగాణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. బుధవారం సాయంత్రం డీజీపీ మహేందర్ రెడ్డి మక్షంలో మీడియా ముందుకు రామన్న భార్య సావిత్రి రానున్నట్లు అధికారులు తెలిపారు. కాగా.. ఇప్పటికే పోలీసుల ఎదుట లొంగిపోయిన సావిత్రి పోలీసులకు పలు కీలక విషయాలను వెల్లడించినట్లు సమాచారం.
గతేడాది లొంగిపోయిన సావిత్రి కుమారుడు..
కిష్టారం ఏరియా కమిటీకి సెక్రటరీగా వ్యవహరించే ఈమె.. 1994లో దళం సభ్యురాలిగా చేరింది. అయితే గతేడాది ఆమె కుమారుడు రంజిత్ కూడా పోలీసులకు లొంగిపోయాడు. సావిత్రి మావోయిస్టు దండకారణ్య కమిటీ సెక్రటరీ కూడా. అయితే 1994లో దళం సభ్యురాలైన సావిత్రిని రామన్న వివాహం చేసుకున్నాడు. మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, ఝూర్ఖండ్ రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. రామన్నపై గతంలో పోలీసులు 40 లక్షల రివార్డును కూడా ప్రకటించారు. అయితే 2019లో ఆయన అనారోగ్యం కారణంగా ఛత్తీస్ గఢ్ అడవుల్లో మృతి చెందారు.
మడకం కోసితో పాటు మరో ఇద్దరి అరెస్ట్..!
కాగా.. తెలంగాణలో మావోయిస్టు పార్టీ కట్టడికి పోలీసులు భారీ వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే, పలు జిల్లాల్లోకి మావోయిస్టు పార్టీకి చెందిన దళాలు ప్రవేశించాయన్న సమాచారంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా రెండేళ్ల కిందట ఛత్తీస్‌గఢ్ పారిపోయిన అడెల్లు భాస్కర్ దళం కూడా ఆదిలాబాద్ అడవుల్లోకి ప్రవేశించినట్లు తెలియడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మోస్ట్ వాంటెడ్ నక్సలిస్టుల ఫొటో జాబితాను సైతం విడుదల చేశారు. ఈ క్రమంలోనే మావోయిస్టు అగ్రనేత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మావోయిస్టు ఏరియా కమాండర్ మడకం కోసి అలియాస్ రజితను కూడా భద్రాద్రి పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతో పాటు మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే తాజాగా సావిత్రి లొంగుబాటుతో మావోయిస్టులకు గట్టి దెబ్బ తగిలినట్లు పేర్కొంటున్నారు.
మావోయిస్టు పార్టీ వార్షికోత్సవాలు, అప్రమత్తమైన పోలీసులు
ములుగు జిల్లా ఏజన్సీలో హై అలర్ట్ ప్రకటించారు. బుధవారం ఈనెల 27వరకు మావోయిస్టు పార్టీ 18వ వార్షికోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ప్రతీ గ్రామంలోనూ ఉత్సవాలు జరుపుకోవాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. పట్టుకోసం మావోయిస్టుల ఇప్పటికే ప్రయత్నాలు సాగిస్తున్న క్రమంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలోనే స్పెషల్ పార్టీ, గ్రేహౌండ్స్ పోలీసు బలగాలు అడవిని జల్లడపడుతున్నారు. గోదావరి పరివాహక ప్రాంతంపైనా పోలీసులు నిఘా పెంచారు. మావోయిస్టు సానుభూతి పరులపై కన్నేసిన పోలీసులు... గ్రామాలు, గూడాల్లో ముమ్మరంగా సోదాలు నిర్వహిస్తున్నారు. పోలీసుల సోదాల క్రమంలో ఏజెన్సీ గ్రామాలు, ఆదివాసీ గూడాలు భయం గుప్పెట్లో ఉన్నాయి.