Kandikonda Yadagiri Funeral: రేపు స్వగ్రామం నాగుర్లపల్లిలో కందికొండ అంత్యక్రియలు
Kandikonda Last Rites: వరంగల్ జిల్లా నర్సంపేట మండలం స్వగ్రామం నాగుర్లపల్లిలో కందికొండ యాదగిరి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
Kandikonda Last Rites : ప్రముఖ సినీగేయ రచయిత కందికొండ యాదగిరి(49) అంత్యక్రియలు ఆయన స్వగ్రామంలో నిర్వహించాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని కందికొండ స్వగ్రామం నాగుర్లపల్లిలో రేపు (మార్చి 14న) ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. క్యాన్సర్ మహమ్మారి బారిన పడిన యాదగిరి రెండేళ్లుగా చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ వెంగళరావునగర్‌లోని తన నివాసంలోనే శనివారం ఆయన తుదిశ్వాస విడిచారు.
కందికొండకు ప్రముఖుల నివాళులు..
నేటి ఉదయం ఫిలిం ఛాంబర్‌కు కందికొండ భౌతికకాయాన్ని తరలించారు. టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు, రాజకీయ నేతలు కందికొండ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. కందికొండ కుటుంబసభ్యులకు అండగా ఉంటామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కందికొండ కుటుంబానికి చిత్రపురి కాలనీలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లును తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసింది. తమకు అండగా నిలిచిన ప్రభుత్వానికి కందికొండ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు చెప్పారు. ప్రముఖ గీత రచయిత కందికొండ యాదగిరి మృతి చాలా బాధాకరమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఫిలిం ఛాంబర్‌లో కందికొండ పార్ధివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.
కందికొండ మృతి చాలా బాధాకరం: మంత్రి @YadavTalasani.
— TRS Party (@trspartyonline) March 13, 2022
ప్రముఖ గీత రచయిత కందికొండ యాదగిరి మృతి చాలా బాధాకరమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఫిలిం ఛాంబర్‌లో కందికొండ పార్ధివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. pic.twitter.com/BeB4MHlLFl
తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుంది..
సినీ గేయ రచయిత కందికొండకు నివాళులర్పించిన అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ.. తెలంగాణ సమాజానికి ఉపయోగ పడే ఎన్నో పాటలు రాసిన వ్యక్తి కందికొండ యాదగిరి అన్నారు. కానీ ఆరోగ్య రీత్యా చిన్న వయసులో ఇబ్బంది రావడం బాధాగా ఉందన్నారు. ఆయన కుటుంబానికి అన్ని విధాలుగా మంత్రి కేటీఆర్ అండగా ఉన్నారని, కందికొండ కుటుంబానికి ఇల్లు ఇస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు.
క్యాన్సర్‌తో పోరాటం దెబ్బతీసింది..
క్యాన్సర్ సమస్య రావడంతో పాటలు రాయలేకపోయారు కందికొండ. గత కొన్నాళ్లుగా క్యాన్సర్‌తో పోరాడి విజయం సాధించినా ఆ ప్రభావం శరీరంపై పడింది. ఆ వ్యాధిని జయించినా, దాని ప్రభావం వెన్నెముకపై పడటంతో కందికొండ ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం ఆయన కుటుంబానికి అండగా నిలిచింది. చికిత్సకు సహకారం అందించినా వెన్నెముక శస్త్రచికిత్స నుంచి కోలుకపోలేకపోయారు.
Also Read: Kandikonda: ప్రముఖ రైటర్ కందికొండ కన్నుమూత