Draupadi Murmu TS Tour: రామప్పపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసలు, శిల్ప సంపద అద్భుతమని కితాబు
Darupadi Murmu: రామప్ప శిల్ప సంపద చాలా అద్భుతంగా ఉందని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. ఆలయ విశిష్టత, నిర్మాణం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
Draupadi Murmu: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మధ్యాహ్నం 2.55 గంటలకు రామప్ప వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. ఆమెతో పాటు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలకు మంత్రి సత్యవతి రాథోడ్, జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఎస్పీ సంగ్రామ్ సింగ్ లు ఘన స్వాగతం పలికారు. దేవాలయంలో రాష్ట్రపతి బృందానికి మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకరరావు, పల్లా రాజేశ్వర్ రెడ్డిలు స్వాగతం పలికారు. రుద్రేశ్వరుడిని దర్శించుకున్న రాష్ట్రపతి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమెకు వేద పండితులు ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలను అందించారు. మేడారం సమ్మక్క సారలమ్మ సారే (చీరను) మేడారం ఆదివాసీ పూజారులు రాష్ట్రపతి, గవర్నర్ లకు ఇచ్చారు. ఆలయ విశిష్టత, నిర్మాణం, యునెస్కో గుర్తింపుకు కోసం తయారు చేసిన డోసియర్ వివరాలు, వరల్డ్ హెరిటేజ్ బాడి విధించిన నిబంధనలు, తదితర అంశాలను రాష్ట్రపతికి కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ కన్వీనర్ పాండురంగారావు వివరించారు.
రామప్ప శిల్ప సంపద అద్భుతం : రాష్ట్రపతి
రామప్ప శిల్ప సంపద ఎంతో అద్భుతంగా ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పొగిడారు. అనంతరం దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక వద్ద 62 కోట్ల రూపాయలతో "ప్రసాద్" స్కీం పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ముఖ్య అతిథులను, వీక్షకులను ఆకట్టుకున్నాయి. పరమ శివునిపై పరంపరా బృందం చేసిన ప్రదర్శన ఆధ్యాత్మిక భావన కల్గించింది. మన సంస్కృతిని చాటే విధంగా కొమ్ముకోయ కళాకారుల బృందం సమక్క, సారలమ్మ ప్రదర్శన ఆకట్టుకుంది. అనంతరం "బ్రహ్మం ఒక్కటే.. పర బ్రహ్మం ఒక్కటే" అనే అన్నమాచార్య గీతం పై కళాకారులు ప్రదర్శించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి కార్యక్రమాన్ని ముగించారు. సాయంత్రం 4.23 నిముషాలకు కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఎస్పీ సంగ్రామ్ సింగ్ రాష్ట్ర పతికి వీడ్కోలు పలికారు.
ఉదయం భద్రాచలం రామయ్యను దర్శించుకున్న ముర్ము..
అంతకుముందు భద్రాచలం రామయ్యను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆమె ఆలయానికి చేరుకోగానే ఆలయ అర్చకులు, అధికారులు రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు. ద్రౌపది ముర్ము వెంట గవర్నర్ తమిళిసై, మంత్రులు సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్ కుమార్, ఉన్నతాధికారులు ఉన్నారు. ప్రధాన ఆలయంలో సీతారాముల వారికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆలయంలో అర్చకులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం శాలువాతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటం అందజేశారు. అలాగే భద్రాద్రి రామయ్య సన్నిధిలో ప్రసాద్ పథకం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
President Droupadi Murmu addressed the Sammakka Saralamma Janjati Pujari Sammelan organised by the Vanvasi Kalyan Parishad at Bhadrachalam. She did virtual inauguration of Eklavya Model Residential Schools of Ministry of Tribal Affairs at Telangana. https://t.co/ObXJ7VXQMv pic.twitter.com/wG0D1ghBlG
— President of India (@rashtrapatibhvn) December 28, 2022