Bhatti Vikramarka: ఇళ్లు లేక ప్రజలు అల్లాడిపోతుంటే, కేసీఆర్ కొత్త సచివాలయంతో ప్రయోజనం ఏంటి: భట్టి విక్రమార్క
Bhatti Vikramarka: బీఆర్ఎస్ పార్టీ పెద్దలు ప్రజా సంపదను దోచుకుంటున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు.
Bhatti Vikramarka: రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ శాఖలు మినహా ముఖ్యమంత్రి కేసీఆర్ మిగతా శాఖలను గాలికి వదిలేశారని సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క విమర్శించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిపాలన అస్తవ్యస్తంగా మారిందన్నారు. పారదర్శక పరిపాలన లేదని విమర్శలు చేశారు. బీఆర్ఎస్ పాలనలో పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో సంక్షేమాన్ని సీఎం కేసిఆర్ గాలికొదిలేశారని ఆరోపించారు. భట్టి విక్రమార్క ప్రారంభించిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఆదివారం జనగామ జిల్లా కేంద్రం నుండి ప్రారంభమైంది. పెంబర్తి శివారులోని కాకతీయ కళాతోరణం వద్ద భట్టి మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల శాఖలకు నిధులు కేటాయించకుండా కేసీఆర్ సర్కారు వాటిని నిర్వీర్యం చేస్తోందని అన్నారు. రాబడి వచ్చే శాఖలపై దృష్టి పెట్టి బీఆర్ఎస్ పార్టీ పెద్దలు ప్రజా సంపదను దోచుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడి వారి జీవితాల్లో వెలుగులు నిండితే అది నిజమైన అభివృద్ధి అవుతుందని అన్నారు.
ఇళ్లు లేక ప్రజలు అల్లాడిపోతుంటే ప్రభుత్వం కొత్త సచివాలయం కట్టుకుంటే ప్రజలకు కలిగే ప్రయోజనం ఏంటని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. కేసీఆర్ ది రాజుల మనస్తత్వమని ఎద్దేవా చేశారు. ప్రజల మీద పడి సంపదను దోపిడీ చేసి ఆనాడు రాజులు రాజభవనాలు కట్టేవారని, ప్రజలు ఆకలి కేకలతో అహంకారాలు చేస్తున్న పట్టించుకునేవారు కాదని ఇప్పుడు కేసీఆర్ అదే చేస్తున్నారని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ప్రజలు ఇళ్లు లేక కొలువు లేక అల్లాడిపోతుంటే ప్రజల సంపదతో కొత్త సచివాలయం కట్టి అభివృద్ధి చేశామని చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలో ప్రజలకు ఉపాధి, ఉద్యోగాలు, సాగు నీళ్లు కొలువులు సమకూర్చిన తర్వాత పాలకులు ఏ ప్యాలెస్లు కట్టుకున్న ప్రజలకు ఇబ్బంది కాదని భట్టి అన్నారు. ప్రజలకు ఉపయోగపడేటువంటి మంచి సచివాలయం తీసేసి కొత్తది కట్టుకున్నంత మాత్రాన కలిగే ప్రయోజనం ఏమీ లేదని తెలిపారు. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో నిరుద్యోగులు తిరిగి కొలువుల కోసం కొట్లాడాల్సిన దుస్థితి రావడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకుండా, లేక లేక నోటిఫికేషన్ వేసి ప్రశ్నాపత్రాన్ని లీకేజీ చేయడం వల్ల విద్యార్థులు, నిరుద్యోగులు గడ్డాలు పెంచుకొని తిరుగుతున్నారని వారి తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారని భట్టి తెలిపారు. విద్యార్థి, నిరుద్యోగుల ఉసురు ఈ ప్రభుత్వానికి తప్పకుండా తగులుతుందని విమర్శించారు.
విద్యార్థి, యువత మేదస్సు పక్క దారి పడితే సమాజానికి విస్పోటనం పేలినంత ప్రమాదకరం అవుతుందని భట్టి అన్నారు. ధర్నాలు లేని తెలంగాణ చేస్తానని చెప్పిన కేసీఆర్ పరిపాలనలో ప్రతి రోజు రాష్ట్రంలో ధర్నాలు జరుగుతూనే ఉన్నాయని ఎద్దేవా చేశారు. ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు, ప్రశ్నాపత్రాల లీకేజీ పై నిరుద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు, మహిళలు, యువత తాము ఎదుర్కొంటున్న సమస్యలపై ధర్నాలు చేస్తూనే ఉన్నారని చెప్పారు. కేసీఆర్ పరిపాలనలో తెలంగాణ ప్రజలు సుఖంగా ఎవరూ లేరని వ్యాఖ్యానించారు. కేసీఆర్ కుటుంబం, ప్రభుత్వ పెద్దలే సుఖంగా ఉన్నారని విమర్శించారు. తెలంగాణ వచ్చిన పది సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం బహుళార్థసాధక ప్రాజెక్టులు కట్టింది లేదని ఎద్దేవా చేశారు. కృష్ణ, గోదావరి నదుల నుంచి అదనంగా ఒక ఎకరానికి సాగునీరు అందించింది లేదని విమర్శించారు. పెద్ద, పెద్ద పరిశ్రమలు ఏర్పాటు చేసింది లేదని చెప్పారు. రూ.18 లక్షల కోట్లు బడ్జెట్ ఖర్చు చేశారని, ఇది చాలనట్టు ఐదు లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు.