Kollapur : బీఆర్ఎస్ నేత దారుణ హత్య - హుటాహుటిన కొల్లాపూర్‌కు కేటీఆర్
Kollapur: తన ఇంటి ఆరుబయట మంచంపై నిద్రపోతున్న సమయంలో శ్రీధర్ రెడ్డిని కొందరు గుర్తు తెలియని దుండగులు గొడ్డళ్ళతో దాడి చేసి దారుణంగా హతమార్చారు.
Kollapur : వనపర్తి జిల్లాలో బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బీరం హర్ష వర్ధన్ రెడ్డి ముఖ్య అనుచరుడైన శ్రీధర్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఈ సంఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం లోని చిన్నంభావి మండలం లక్ష్మి పల్లి గ్రామానికి చెందిన ఆయన బుధవారం రాత్రి తన ఇంటి ఆరుబయట మంచం పై నిద్రపోతున్న సమయంలో కొందరు గుర్తు తెలియని దుండగులు గొడ్డళ్ళతో శ్రీధర్ రెడ్డిపై దాడి చేసి దారుణంగా హతమార్చారు. ఆయన తల, గొంతు పై కిరాతకంగా నరకడం తో స్పాట్లోనే మృతి చెందారు. గత ఆరు నెలల కాలంలో ఇది రెండో హత్య. ఈ ఘటనతో నియోజకవర్గ వ్యాప్తంగా ఆందోళన చెలరేగింది.
బీఆర్ఎస్ పార్టీ లో శ్రీధర్ రెడ్డి చురుకైన నేతగా ఉంటూ మాజీ ఎమ్మెల్యే హరవర్ధన్ రెడ్డి కి ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. ఇది రాజకీయ హత్యా లేదా భూతగాదాల కారణంగా జరిగిన హత్యా అనేది పోలీసుల విచారణలో తేలనుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఈ హత్య ను తీవ్రంగా ఖండించారు. శ్రీధర్ రెడ్డి హత్య విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ కొల్లాపూర్‌కు బయల్దేరారు.
గతంలో ఇదే నియోజకవర్గం గంట్రావుపల్లిలో ఓ బీఆర్ఎస్ కార్యకర్త దారుణం హత్యకు గురయ్యాడు. ఆరు నెలల వ్యవధిలో శ్రీధర్ రెడ్డిది రెండో హత్య. రాజకీయ కక్షతోనే ఆయనను హత్య చేశారని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఆరోపించారు . శ్రీధర్ రెడ్డి హత్య వెనక మంత్రి జూపల్లి కృష్ణారావు హస్తం ఉందంటూ ఆయన ఆరోపిస్తున్నారు. తమ ప్రాంతంలో బీఆర్ఎస్ నేతలే లక్ష్యంగా జరుగుతున్న దాడులపై డీజీపీకి కంప్లైంట్ చేశామన్నారు . కానీ, వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. తమ నియోజకవర్గంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు శ్రీధర్ రెడ్డి హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
శ్రీధర్ రెడ్డి హత్యను నిరసిస్తూ చిన్నంబావి మండల కేంద్రంలో మృతదేహం తో బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో చేసి, ర్యాలీగా మృతదేహాన్ని లక్ష్మీపూర్ కు తీసుకెళ్లారు. వారిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, అర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు. జూపల్లి డౌన్ డౌన్, హత్య రాజకీయాలు మానుకోవాలి. నిందితులను వెంటనే శిక్షించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నిందితులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు.
ప్రతిపక్షమే ఉండకూడదని పక్కా ప్లాన్
శ్రీధర్ రెడ్డి హత్యను మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఐదు నెలల్లో ఇది రెండో రాజకీయ ప్రేరేపిత హత్య అన్నారు. నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలన్నారు. అలాగే బీఆర్ఎస్ నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సైతం శ్రీధర్ రెడ్డి హత్య ఘటనపై తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు అండతో బీఆర్ఎస్ నాయకులపై పట్టపగలే దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రతిపక్షం అనేదే ఉండకూడదని పక్కా ప్లాన్ ప్రకారమే కాంగ్రెస్ సర్కార్ హత్యల సంస్కృతికి తెరలేపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.