Valmidi Srirama Navami : వల్మీడిలో ఘనంగా శ్రీరామనవమి ఉత్సవాలు, ఏర్పాట్లపై సమీక్షించిన మంత్రి ఎర్రబెల్లి
Valmidi Srirama Navami : వల్మీడిలో శ్రీరామ నవమి ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్షించారు. శ్రీరామ నవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
Valmidi Srirama Navami : వరంగల్ జిల్లాలోని వల్మీడి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయానికి భద్రాద్రికి మించిన వైభోగం దక్కేలాగా అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. భద్రాద్రి దేవాలయానికి ఉన్నంత ప్రాశస్త్యం చరిత్ర వల్మీడి దేవాలయానికి కూడా ఉందని ఆయన చెప్పారు. మిగతా దేవాలయాలకు భిన్నంగా వాల్మీకి దేవాలయానికి ఎకరాల కొద్ది స్థలం ఉందని ఆ స్థలాన్ని ఆసరా చేసుకుని దేవాలయాన్ని విస్తృతంగా అభివృద్ధి చేసే అవకాశం మెండుగా ఉందని మంత్రి చెప్పారు. శ్రీరామనవమి సందర్భంగా జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం పాలకుర్తి మండలం వల్మీడి గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగే సీతారామచంద్రస్వామి కల్యాణ ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి ఎర్రబెల్లి ఆదివారం సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... రాముడు నడయాడిన నేలగా, రామాయణ కర్త వాల్మీకి మహర్షి తపస్సు చేసిన గుట్టగా, వల్మీడికి చరిత్ర ,గుర్తింపు, గౌరవం ఉన్నాయని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. గుట్టను విస్తృతంగా అభివృద్ధి చేస్తూ దేవాలయంలో 11 కోట్ల 40 లక్షల రూపాయల వ్యయంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు మంత్రి వివరించారు. కల్యాణ మండపం గుట్ట మీదకు రోడ్డు వంటి సదుపాయాలను కల్పిస్తున్నామని చెప్పారు. సీఎం కేసీఆర్ పాలకుర్తి, బమ్మెర, వల్మీడి గ్రామాలను కలుపుతూ ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి పరచడానికి అడిగిన నిధులు ఇవ్వడమే కాకుండా ప్రత్యేక చొరవ చూపుతూ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తున్నారని మంత్రి చెప్పారు. ఈ మూడు దేవాలయాలను అభివృద్ధి పరుస్తున్నట్లు మంత్రి చెప్పారు. గతంలో ఎన్నడూ కనీవినీ ఎరగని రీతిలో వల్మీడి దేవాలయంలో ఈసారి శ్రీరామనవమి ఉత్సవాలు సీతారామచంద్రస్వామిల కల్యాణం ఘనంగా వైభోగంగా నిర్వహించనున్నట్లు అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
నవమి నాటికి కల్యాణ మండపం
గుట్ట మీదకు పక్కా రోడ్డు సిద్ధం చేయాలని మంత్రి అధికారుల ఆదేశించారు. రోడ్లపై దుమ్ము లేవకుండా నీటిని రోడ్ల పై చల్లాలి.
నిరంతరం పారిశుధ్యం నిర్వహించాలి. అందుకు తగినట్లుగా సిబ్బంది అధికారులను నియమించాలి. 50 మంది మల్టీ పర్పస్ వర్కర్స్, 3 ఎంపీ ఓ లు, 15 మంది కార్యదర్శులు, ఇంకా పారిశుద్ధ్య సిబ్బందిని నియామకం చేసి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.మహిళల కోసం ప్రత్యేకంగా 15 మొబైల్ టాయ్ లెట్స్ ఏర్పాటు చేయాలని సూచించారు.
అధికారులకు బాధ్యతలు
కల్యాణ కార్యక్రమ బాధ్యతలు ఆర్డీవోకు, మంచినీరు బాధ్యత మిషన్ భగీరథ అధికారులు, భోజనాలు అందించే బాధ్యత ఆర్డీవో, డీపీవోకు, శాంతి భద్రతలు, రద్దీ నియంత్రణ బాధ్యతలు పోలీసులకు, వాలంటీర్లు బాధ్యత పార్టీ ఇంచార్జీలకు అప్పగించారు. అలాగే లైటింగ్ బాధ్యతలు పంచాయతీ రాజ్ శాఖ అధికారులకు, లడ్డు, పులిహోర బాధ్యతలు శ్రీనివాస్ కు మంత్రి అప్పగించారు.
వల్మీడికి వచ్చే భక్తులకు భోజనాలు
వల్మీడికి వచ్చే భక్తులకు ప్రత్యేకంగా భోజనాలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. శ్రీరామనవమి రోజు వచ్చే భక్తులందరికీ ఉచితంగా మంచి భోజనాలు అందించడానికి బాధ్యతలు అప్పగించారు. ఆ రోజు వివిధ గ్రామాల నుంచి భక్తులు సకుటుంబ సపరివార సమేతంగా రావాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజలను ప్రత్యేకంగా ఆహ్వానించారు.
సొంతంగా మంత్రి రూ.5 లక్షల విరాళం
ఇదిలా ఉండగా రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన వంతుగా వల్మీడి ఆలయంలో నిర్వహించే శ్రీరామ నవమి ఉత్సవాలకు రూ.5 లక్షల విరాళం ప్రకటించారు. శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా దేవాలయ ప్రాంగణంలో కళాకారులతో వివిధ ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. దేవస్థాన ధర్మకర్తల మండలి అధికారులు సమన్వయంతో పని చేస్తూ వివిధ కమిటీలను ఏర్పాటు చేసుకొని ఆయా కమిటీల ఆధ్వర్యంలో ఆయా పనులను సరిగ్గా నిర్వర్తిస్తూ కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సమగ్రంగా జరిగేటట్లు ఏర్పాట్లు చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశించారు. అనంతరం మంత్రి దేవాలయ ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు కాంట్రాక్టర్ నరసింహారెడ్డికి పలు సూచనలు చేస్తూ నిర్మాణ పనులు వేగంగా జరగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శివలింగయ్య ఆర్డీవో కృష్ణవేణి డీఆర్డీవో రాంరెడ్డి మిషన్ భగీరథ పంచాయితీరాజ్ దేవాదాయ సంబంధిత వివిధ శాఖల అధికారులు దేవాలయ ధర్మకర్తల మండలి సభ్యులు సలహాదారులు గ్రామ ప్రజలు ప్రముఖులు స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజలు పాల్గొన్నారు.