Warangal News : వరంగల్ సీపీ రంగనాథ్ ఫ్లెక్సీకి రైతులు క్షీరాభిషేకం
Warangal News : వరంగల్ సీపీ రంగనాథ్ కు రైతు దంపతులు పాలాభిషేకం చేశారు. తమ పొలం అమ్మాలని బెదిరించిన వాళ్లపై కేసులు నమోదు చేసి న్యాయం చేశారని ఇలా ధన్యవాదాలు తెలుపుకున్నారు.
Warangal News : వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ ఫ్లెక్సీకి రైతులు పాలాభిషేకం చేశారు. తమకు న్యాయం చేసినందుకు కృతజ్ఞతగా వరంగల్ జిల్లా నర్సంపేటలో రైతు నాడెం వీరస్వామి, రాజ్యలక్ష్మి దంపతులు శుక్రవారం సీపీ ఫ్లెక్సీకి పాలతో అభిషేకం చేశారు. రైతు వీరస్వామి, రాజ్యలక్ష్మి దంపతులు మాట్లాడుతూ.. తమకు నర్సంపేట శివారులో రెండెకరాల భూమి ఉండగా, అందులో నుంచి ఇరవై గుంటల భూమిని ఏనుగుల తండాకు చెందిన ఎస్బీఐ ఉద్యోగి బానోతు అనిల్ నాయక్ భార్యకు, బానోతు సునీల్ నాయక్ కు 2018లో అమ్మినట్లు తెలిపారు. అప్పటి నుంచి ఎవరి హద్దుల్లో వాళ్లమే ఉంటున్నామన్నారు. అయితే కొద్ది కాలం నుంచి మరో పది గుంటల భూమిని అమ్మాలని అనిల్ నాయక్, సునీల్ నాయక్ తమను ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. తమకు జీవనోపాధిగా ఉన్న భూమిని అమ్మబోమని చెప్పగా, అప్పటి నుంచి తమను అనిల్ నాయక్, సునీల్ నాయక్ మరికొంత మందితో కలిసి బెదిరించడంతో పాటు, తమ పొలాన్ని ధ్వంసం చేశారని, హద్దు రాళ్లు తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. తామే వారిని కులం పేరుతో దూషించామని మాపై పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశారని ఆవేదన చెందారు.
బెదిరించిన వాళ్లపై కేసులు
అయితే వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ కు తమకు జరిగిన అన్యాయం గురించి రైతు దంపతులు చెప్పుకున్నారు. దీంతో ఆయన విచారణ జరిపి తమను భయభ్రాంతులకు గురి చేస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారని రైతు వీరస్వామి తెలిపారు. దీంతో 11 మందిపై నర్సంపేట పోలీసులు కేసులు నమోదు చేశారన్నారు. భూమిని నమ్ముకొని, సాగు చేసుకొని బతికే తమకు సీపీ రంగనాథ్ న్యాయం చేశారని, అందుకే ఆయన ఫ్లెక్సీకీ పాలతో అభిషేకం చేశామని రైతు వీరస్వామి, రాజ్యలక్ష్మి దంపతులు తెలిపారు. అలాగే డీసీపీ కరుణాకర్ కు , పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.
నిర్ధిష్ట సమయంలో చిట్ ఫండ్ ఖాతాదారులకు చెల్లింపులు చేయాలి
చిట్ ఫండ్ ఖాతాదారులకు చెల్లింపులు ముందుగా సూచించిన సమయంలోనే చెల్లించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ చిట్ ఫండ్ సంస్థల యాజమాన్యానికి సూచించారు. చిట్ ఫండ్ కంపెనీల ఆగడాలపై రోజు, రోజుకి వరంగల్ పోలీస్ కమిషనర్ కు ప్రజల నుంచి ఫిర్యాదులు రావడంతో, ఈ ఫిర్యాదులపై స్పందించిన పోలీస్ కమిషనర్ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని చిట్ ఫండ్ సంస్థలకు చెందిన యాజమాన్యాలతో గురువారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ముందుగా చిట్ ఫండ్ సంస్థలు ఎంతమంది చిట్ ఫండ్ ఖాతాదారులకు చెల్లింపులు ఉన్నాయి. అలాగే గతంలో చిట్ ఫండ్ సంస్థలపై నమోదైన కేసుల్లో ఎంత మంది బాధితులకు చిట్ ఫండ్ యాజమాన్యం చెల్లింపులు జరిపాయని పోలీస్ కమిషనర్ సంబంధిత పోలీస్ అధికారులను అడిగితెలుసుకున్నారు. అలాగే అత్యధికంగా చెల్లింపులు చేయాల్సిన చిట్ ఫండ్ సంస్థల వివరాలను పోలీస్ కమిషనర్ రంగనాథ్ తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ఖాతాదారులకు డబ్బు చెల్లింపు చిట్ ఫండ్ సంస్థలు చేస్తున్న ఆలస్యానికి గల కారణాలను కూడా పోలీస్ కమిషనర్ చిట్ ఫండ్ యాజమాన్యాన్ని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ చిట్ ఫండ్ ఖాతాదారుల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇందుకోసం చిట్ ఫండ్ కంపెనీలు ఎంత మంది ఖాతాదారులకు ఎంత మొత్తంలో చెల్లించాల్సి ఉంది. అలాగే ఖాతాదారుల నుంచి రావాల్సిన మొత్తానికి సంబంధించిన చిట్ ఫండ్ కంపెనీల వారిగా వివరాలను సేకరించి సంబంధిత పోలీస్ అధికారులకు అందజేయాలని ఆదేశించారు. ఈ సమాచారంతో వచ్చే మంగళవారం చిట్ ఫండ్ కంపెనీ యాజమానులతో మరోమారు సమావేశాన్ని నిర్వహించి చిట్ ఫండ్ బాధితులకు న్యాయం అందించే దిశగా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇందులో భాగంగా చిట్ ఫండ్ కంపెనీలు డబ్బు చెల్లించించాల్సిన ఖాతాదారులకు సంబంధించి చిట్ ఫండ్ సంస్థలు అందజేసిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనరేట్ వెబ్ సైట్లో ఉంచుతామన్నారు. చిట్ ఫండ్ సంస్థలు ఇచ్చిన సమాచారంలోని బాధితులు కాకుండా మరే ఇతర బాధితులు ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామన్నారు. సంస్థలు కచ్చితమైన సమాచారాన్ని అందజేయాలని సీపీ రంగనాథ్ తెలిపారు.