Voter Sahaya Mithra: తెలంగాణ ఓటర్ల కోసం చాట్ బాట్, అందుబాటులోకి తెచ్చిన ఎన్నికల సంఘం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా ‘ఛాట్ బాట్’ లను వాడబోతున్నారు.
Voter Sahaya Mithra for Telangana Assembly Elections
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే నెలలో నోటిఫికేషన్ విడుదల కానుంది. అక్టోబరు మొదటి వారంలో షెడ్యూల్ ను ప్రకటించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం రెడీ అవుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు, క్షేత్రస్థాయిలో పరిస్థితులు పరిశీలించారు. అక్టోబరులో నోటిఫికేషన్ విడుదల చేసి, నవంబరు పోలింగ్ జరపాలని యోచిస్తోంది. రాజకీయ పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా ‘ఛాట్ బాట్’ లను వాడబోతున్నారు. కొత్త తరం ఓటర్లను అట్రాక్ట్ చేసేందుకు ఎన్నికల సంఘం ఈ సరికొత్త టూల్ ను వినియోగించబోతోంది. ఓటర్లు, పోటీ చేస్తున్న అభ్యర్థులు, రాజకీయ పార్టీలకు ఎన్నో సందేహాలు వస్తాయి. వాటిని ఎప్పటికపుడు పరిష్కరించి, సందేహాలను తీర్చుకునేందుకు సీఈఓ కార్యాలయం ‘ఓటరు సహాయ మిత్ర’ పేరుతో చాట్‌బాట్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. సీఈవో తెలంగాణ (ceotelangana.nic.in) వెబ్‌సైట్ తెరిచిన వెంటనే ఇది సందర్శకులను ఆకర్షిస్తుంది.
పోలింగ్ బూత్‌కు వెళ్లే ముందు ఓటర్లకు వచ్చే సందేహాలకు చాట్ బాట్ సమాధానం ఇస్తుంది. ఇందులో ఓటర్లు ఫిర్యాదులు కూడా చేయవచ్చు. ఓటర్లకు వన్ స్టాప్ సొల్యూషన్స్ అందించే హబ్ గా ఎన్నికల సంఘం చాట్ బాట్ పనిచేయనుంది. ఓటరు గుర్తింపు కార్డు, పోలింగ్ బూత్, బూత్ స్థాయి అధికారులు, ఓటర్లను నమోదు చేసుకునే అధికారులు... తదితర సమాచారం ఎలా, ఎక్కడ వెతకాలో ‘ఓటరు సహాయ మిత్ర’ సూచిస్తుంది. కొత్త ఓటరుగా నమోదు కావాలన్నా, ఇప్పటికే నమోదై ఓటు ఉండి దానిలో మార్పులు చేసుకోవాలన్నా, ఏదైనా అంశంపై ఫిర్యాదు చేయాలనుకున్నా చాట్ బాట్ లో కంప్లయింట్ చేసుకోవచ్చు. ఓటు హక్కును ఎలా నమోదు చేసుకోవాలి ? ఓటర్ ఐడీని ఎలా డౌన్‌లోడ్ చేయాలి ? పోలింగ్ బూత్ ఎక్కడ ఉంది ? ఓటర్ స్లిప్ ఎలా డౌన్‌లోడ్ చేయాలి ? వంటి ప్రశ్నలకు ఇది ఇట్టే ఆన్సర్ ఇస్తుంది. నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరు? వారు సమర్పించిన అఫిడవిట్ లో ఉన్న వివరాలు ఏమిటి ? అనే చిట్టాను చాట్ బాట్ అందిస్తుంది.
చాట్ బాట్ ను ఎన్నికల్లో వినియోగిస్తున్న రెండో రాష్ట్రం తెలంగాణ. ఇలాంటి సాంకేతికతను హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వాడారు. ఓటర్ల అనుమానాలను క్లియర్ చేసేలా అప్పటికప్పుడు సమాధానం చెప్పడం చాట్ బాట్ ప్రత్యేకత. ఈ బాట్ బాట్ కు సంబంధించిన అల్గారిథమ్ ను ఎన్నికల సంఘం టెక్నికల్ టీమ్ స్వయంగా తయారు చేసింది. పోటీలో ఉన్న అభ్యర్థులు, అఫిడవిట్ల నమూనాలు వంటి వివరాలను అందించడంలో ఓటరు సహాయ మిత్ర చాట్ బాట్ సహాయపడుతుంది. దివ్యాంగులైన ఓటర్ల కోసం ఎన్నికల సంఘం అందించే వీల్ ఛైర్ వంటి ప్రత్యేక సౌకర్యాలు ఇందులో తెలుసుకోవచ్చు. ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు అందించే సమాచారాన్ని కూడా అందిపుచ్చుకుని సందర్శకులకు తాజా సమాచారాన్ని తెలిపేలా ఓటరు సహాయ మిత్ర ఉపకరించనుంది.