Kagaznagar Attack: 8 నెలల గర్భిణీ ఫారెస్ట్ ఆఫీసర్‌పై కర్రలతో దాడి, రక్షణ కోసం పరిగెత్తుతూ ఘోరం
Kagaznagar: అటవీ అధికారులు గ్రామస్తులను అడ్డుకొని కర్రలతో దాడికి దిగారు. కానీ, ఎఫ్‌బీఓ శిరీష 8 నెలల గర్భంతో ఉన్నారు. కర్రలతో జరిగిన దాడి ఘటనలో ఆమె ఎడమ చేతికి గాయాలు అయ్యాయి.
Asifabad District: కొమురం భీం జిల్లాలో (Komaram Bheem Asifabad) అమానుషం జరిగింది. కాగజ్ నగర్ (Kagaznagar) ఫారెస్ట్ రేంజ్ అటవీ అధికారులపై (Attack on Forest Officers) పలువురు దాడి చేశారు. ఆ అటవీ సిబ్బందిలో ఓ మహిళ కూడా ఉండగా ఆమె ప్రస్తుతం 8 నెలల గర్భంతో ఉంది. ఆమె గర్భంతో ఉందని తెలిసి కూడా ఆమెపై దాడి జరిగింది. వారి నుంచి తప్పించుకునే క్రమంలో 8 నెలలు నిండిన గర్భిణీ చాలా దూరం పరిగెత్తారు. ఈ క్రమంలోనే ఆమె అస్వస్థతకు గురయ్యారు. కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్ మండలం ఊట్‌పల్లిలో (Ootpally) మంగళవారం ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాలివీ..
కొమురం భీం జిల్లా (Komaram Bheem Asifabad) కాగజ్ నగర్ మండలం ఊట్ పల్లి కాగజ్ నగర్ ఫారెస్ట్ రేంజ్ కిందికి వస్తుంది. అక్కడి అటవీ అధికారులు అగ్ని ప్రమాదాలపై(Fire Accidents) అవగాహన కల్పించడం కోసం ఊట్‌పల్లిలో మంగళవారం కళాజాత నిర్వహించారు. ఈ క్రమంలో గ్రామస్థులు అటవీ సిబ్బందిపై ఆరోపణలు చేశారు. వంట చెరకును తీసుకోనివ్వకుండా అధికారులు అడ్డుకుంటున్నారని, గొడ్డళ్లు, సైకిళ్లను స్వాధీనం చేసుకుంటున్నారని అధికారులను గ్రామస్తులు ఘెరావ్ చేశారు.
దీంతో కళాజాత బృందం సభ్యులు అర్ధాంతరంగా కార్యక్రమాలను ఆపేసి వెళ్లిపోయారు. అదే క్రమంలో కోసిని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (Forest Beat Officer) అయిన శిరీష, వాచ్ మేన్‌లు దేవ్‌సింగ్, రాములు, శంకర్ తమ బైక్‌లపై బయలు దేరుతున్నారు. ఈ క్రమంలోనే వారిని గ్రామస్తులు అడ్డుకొని కర్రలతో దాడికి దిగారు. కానీ, శిరీష ఎనిమిది నెలల గర్భంతో (8 Months Pregnancy) ఉన్నారు. కర్రలతో జరిగిన దాడి ఘటనలో ఆమె ఎడమ చేతికి గాయాలు అయ్యాయి. దాడి నుంచి తప్పించుకోవడానికి వారంతా కలిసి బైక్‌లను వదిలి పరుగులు పెట్టాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే గర్భిణీ అయిన శిరీష తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సిబ్బంది ద్వారా సమాచారం అందుకున్న శిరీష భర్త వెంటనే అక్కడికి చేరుకొని ఆమెను కాగజ్ నగర్ (Kagaznagar) పట్టణంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి ఆమెను మంచిర్యాల (Mancherial) ఆస్పత్రికి తరలించారు.
గర్భవతినని చెప్పినా కర్రలతో దాడి చేశారు: బాధితురాలు
ఆస్పత్రిలో బాధితురాలు శిరీష మాట్లాడుతూ.. ‘30 నుంచి 40 మంది మహిళలు కర్రలు పట్టుకొని నా స్కూటీకి ఎదురుగా వచ్చారు. తోసే ప్రయత్నం చేశారు. అప్పటికే నేను బండి దిగేసి దూరం వెళ్లిపోయాను. మమ్మల్ని అడవుల్లోకి పోనివ్వట్లేదని వారు నాతో గొడవ పడ్డారు. నా ఉద్యోగమే అది.. నా డ్యూటీ నన్ను చెయ్యనివ్వండని చెప్పా. అయినా వారు వినకుండా నాపై దాడికి యత్నించారు. నేను గర్భవతినని చెప్పినా వారు వినలేదు. అయినా నాపైకి దాడికి వచ్చారు. నేను పరిగెత్తి దెబ్బల నుంచి తప్పించుకున్నా. పరిగెత్తకపోయి ఉంటే నా బిడ్డకు లేదా నాకు ఏదైనా జరిగి ఉండేది.’’ అని ఎఫ్‌బీఓ శిరీష వాపోయారు.
హరిత హారం కార్యక్రమంలో భాగంగా అటవీ శాఖ అధికారులకు కొంత మంది గిరిజన గ్రామాల వారికి మధ్య ఘర్షణలు జరిగిన ఘటనలు గతంలో చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములను తమనుంచి లాక్కుంటున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఆ క్రమంలోనే ఘర్షణలు జరుగుతున్నాయి.