Tirumala Ghee Adulteration: తిరుమలలో నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం, నలుగురు నిందితులకు 14 రోజుల రిమాండ్
Tirupati Laddu Row | తిరుమలలో కలకలం రేపిన కల్తీ నెయ్యి వ్యవహారంలో నలుగురు నిందితులను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జడ్జి వీరికి 14 రోజుల రిమాండ్ విధించారు.

Tirumala Ghee Adulteration Case | తిరుపతి: ఏపీతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన తిరుమలలో నెయ్యి కల్తీ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. నలుగురు నెయ్యి సరఫరాదారులను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తిరుమల ఆలయానికి నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డైరీ ఏండీ రాజశేఖరన్ తో పాటు ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఓ డైరీ నిర్వాహకులను సీబీఐ అరెస్ట్ చేసింది. రాజశేఖరన్‌తో పాటు ఉత్తరప్రదేశ్ కు చెందిన విపిన్ గుప్త, పోమిల్ జైన్, అపూర్వ చావ్డాలను సీబీఐ అదుపులోకి తీసుకుంది. సిట్ సభ్యుడు, సిబిఐ జాయింట్ డైరెక్టర్ విరేష్ ప్రభు తిరుపతిలో మకాం వేసి కల్తీ నెయ్యి (జంతువుల కొవ్వు) వ్యవహారంలో దర్యాప్తు వేగవంతం చేశారు.
టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో సుప్రీంకోర్టు నియమించిన సిట్ బృందం నలుగురిని అరెస్టు చేసింది. ఉత్తరాఖండ్ రాష్ట్రం రూర్కీలోని భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు విపిన్ జైన్, పొమిల్ జైన్, శ్రీకాళహస్తి సమీపంలోని పెనుబాకలోని శ్రీవైష్ణవి డైయిరీ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో అపూర్వ చావడా, తమిళనాడు రాష్ట్రం దిండిగల్ లోని ఏఆర్ డెయిరీ ఎండీ డాక్టర్ రాజు రాజశేఖరన్ లను అరెస్టు చేశారు. నలుగురిని ఆదివారం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం రాయలచెరువు రోడ్డులో నివాసంలో జడ్జి ఎదుట నిందితులను హాజరు పరిచారు. అంతకుముందు జడ్జిల నివాస సముదాయం ఎదుట రోడ్డుపైనే నిందితులకు పోలీసులు గుర్తింపు పరీక్షలు నిర్వహించారు. ఆదివారం రాత్రి 11 గంటలకు రెండో అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ప్రవీణ్ కుమార్ ఎదుట నిందితులను హాజరుపరచగా వారికి 14 రోజుల రిమాండు విధించారు. అనంతరం 11.30 గంటలకు నిందితులను పోలీసులు తిరుపతి సబ్ జైలుకు తరలించారు.
తిరుమలలో కల్తీ నెయ్యి వివాదం..
ఏపీలో గత ఎన్నికల్లో విజయం సాధించి కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తిరుమలలో ప్రసాదాలలో వినియోగించే నెయ్యి కల్తీ అయిందని ఆరోపణలు వచ్చాయి. వైసీపీ హయాంలో తిరుమలలో విచ్చలవిడితనం పెరిగిందని, టీటీడీలో సైతం అన్య మతస్తులకు అవకాశం కల్పించారని ఆరోపించడం వైసీపీ వర్సెస్ కూటమి పార్టీలుగా మారింది. ఎంతో భక్తితో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు స్వీకరించే ప్రసాదమైన తిరుపతి లడ్డూల తయారీలో, ఇతర ప్రసాదాల తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారని టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు ఆరోపించడంతో వివాదం మొదలైంది. వైసీపీ హయాంలో స్వచ్ఛమైన ఆవు నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వుతో తయారుచేసిన నెయ్యిని తిరుమల ప్రసాదాలలో వినియోగించారని ప్రభుత్వ పెద్దలు ఆరోపించారు.
నెయ్యి పరీక్ష కోసం గుజరాత్‌కు ట్యాంకర్ శాంపిల్స్
తిరుమలకు వచ్చిన ఓ ట్యాంకర్ నెయ్యి నాణ్యతపై అనుమానం వచ్చి గుజరాత్ కు పంపి పరీక్షించామని ఏపీ ప్రభుత్వం, టీటీడీ తెలిపింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ అంశాన్ని మరింత పెద్దది చేశారు. హైందవ ధర్మం, హిందూ సమాజం మేల్కోవాలని ఇలాంటి తప్పులను క్షమించరాదని వ్యాఖ్యానించారు. ప్రాయశ్చిత్త దీక్ష సైతం చేపట్టిన పవన్ కళ్యాణ్ చివరగా తిరుమలకు వచ్చి వారాహి దీక్ష విడిచారు. ఆ సమయంలో తిరుపతిలో వారాహి బహిరంగ సభ నిర్వహించి హైందవ ధర్మాన్ని కాపాడుకునేందుకు రక్షణల పేరుతో కొన్ని విషయాలు ప్రస్తావించారు. రక్షణల కోసం కొన్ని అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఆలయాల పరిరక్షణ, హిందూ మతానికి పూర్వవైభవం కోసం పనిచేద్దామని పిలుపునిచ్చారు.
కల్తీ నెయ్యిని వెనక్కి పంపించామన్న వైసీపీ
వైసీపీ నేతలు సైతం దీనిపై స్పందించి తమ హయాంలో పలుమార్లు కల్తీ నెయ్యి గుర్తించి ట్యాంకర్లను వెనక్కి పంపించామన్నారు. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. మరోవైపు ఏపీ ప్రభుత్వం సైతం ఈవిషయాన్ని సీరియస్ గా తీసుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ విచారణకు ఆదేశించగా.. విచారణ సభ్యులు తిరుమలలో పర్యటించి, అన్ని వివరాలు సేకరించారు. మరోవైపు నెయ్యి సరఫరాదారులను సైతం విచారణ చేపట్టాలని భావించి కొందర్ని అరెస్ట్ చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

