Harish Rao: బోగస్‌గా మారిన సన్న వడ్లకు బోనస్ హామీ, త్వరగా తేల్చండి - సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ
Harish Rao : వరి దాన్యం కొనుగోలు నిలిపివేసి దాదాపు 50 రోజులు గడిచిపోతున్నాయన్నా, ఇంత వరకు రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బులు జమ కాలేదని హరీష్ రావు ఆరోపించారు.

Harish Rao : సన్న వడ్లకు బోనస్ విడుదల చేయాలని కోరుతూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాసిన బహిరంగ లేఖను విడుదల చేశారు. రైతు పండించిన అన్ని పంటలకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని ఆనాడు ప్రకటించి ఈనాడు మాట తప్పుతున్నారని హరీష్ రావు ఆరోపించారు. అన్ని పంటలకు బదులు కేవలం సన్న వడ్లకే బోనస్ ఇస్తామని మాట మార్చారని, మీ బోనస్ హామీ ఒక బోగస్ హామీగా మారిపోయిందన్నారు.
పెండింగ్ లోనే బోనస్ చెల్లింపులు
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 8,64,000 మెట్రిక్ టన్నుల దాన్యానికి సంబందించిన రూ.432 కోట్లు బోనస్ చెల్లింపులు పెండింగ్ లోనే ఉన్నాయని హరీష్ రావు చెప్పారు. వరి దాన్యం కొనుగోలు నిలిపివేసి దాదాపు 50 రోజులు గడిచిపోతున్నాయన్నారు. కానీ ఇంత వరకు రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బులు జమ కాలేదని, రెండో పంటకు సిద్దం కావాల్సిన రైతులు బోనస్ డబ్బుల కోసం ప్రభుత్వ అదికారుల చుట్టూ తిరిగాల్సిన పరిస్థితి దాపురించిందని చెప్పుకొచ్చారు. నిన్నటికి నిన్న మహబూబ్ నగర్ జిల్లాలో ముచ్చింతల రైతులు తమ వడ్లు అమ్మి రెండు నెలలు అయినా ప్రభుత్వం బోనస్ చెల్లించడం లేదంటూ జిల్లా కలెక్టర్ ను కలిస్తే బోనస్ డబ్బులు పెండింగ్ లో ఉన్నది నిజమే, ప్రభుత్వం విడుదల ఆలస్యం అవుతుందని సమాదానం ఇచ్చారు. బహిరంగ మార్కెట్ లో రూ.2,800 నుండి రూ.3 వేల ధర పలుకుతున్నా బోనస్ కోసం రైతులు ప్రభుత్వాన్ని నమ్మి దాన్యాన్ని విక్రయిస్తే, తమను ప్రభుత్వం మోసం చేసిందని రైతులు ఆందోళన చెందుతున్నారని వాపోయారు.
420 రోజులవుతున్నా ఏ హామీ పూర్తిగా నెరవేర్చలేదు
రాష్ట్రంలో సంక్షేమ పథకాల హామీపైనా హరీష్ రావు ప్రశ్నించారు. కేసీఆర్ గారి పాలనలో రైతులంతా గుండెధైర్యంతో వ్యవసాయాన్ని పండగలా చేశారన్న ఆయన.. కాంగ్రెస్ హయాంలో మాత్రం వ్యవసాయం దండగలా మారి రైతు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. రైతు డిక్లరేషన్ లో ప్రకటించినట్లుగా రూ.2 లక్షల రుణమాఫీ, ఎకరానికి రూ.15 వేల రైతుభరోసా, అన్ని పంటలకు బోనస్, కౌలు రైతులకు కూడా రైతు భరోసాను 100 రోజుల్లో అమలు చేస్తానని చెప్పినా ఇంకా నెరవేర్చలేదని ఆరోపించారు. వరంగల్ రైతు డిక్లరేషన్ అబద్దమా..? మీరిచ్చిన బాండ్ పేపర్ బూటకమా..? వెంటనే సమాదానం చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి 420 రోజులు పూర్తైనా ఏ ఒక్క పథకమూ సంపూర్ణంగా అమలు చేయలేదని, రైతులు పడుతున్న ఇబ్బందులను చూసి వారి పక్షాన తక్షణమే హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నానని చెప్పారు.
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బీసీ సభ
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో త్వరలో బీసీ సభ నిర్వహిస్తామని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రకటించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ హాజరవుతారన్నారు. కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ప్రకటించిన చోటే ఈ సభను నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. కుల గణన మళ్లీ చేయాలని బీఆర్ఎస్ పార్టీ అభిప్రాయపడుతోందని, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Also Read : Crime News: మాయమాటలు చెప్పి బీటెక్ స్టూడెంట్ పై అఘాయిత్యం- మరోచోట వేధింపులు తట్టుకోలేక హోంగార్డు సూసైడ్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

