Vikarabad MLA: బీఆర్ఎస్ ఎమ్మెల్యే వైరల్ వీడియో కలకలం - వివరణ ఇచ్చిన ఎమ్మెల్యే
వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చన్‌గోముల్ లో భూ కబ్జాకు ఎమ్మెల్యే అనుచరులు ప్రయత్నించినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి.
వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహేశ్ రెడ్డికి సంబంధించిన ఓ వీడియో బయటికి వచ్చి విపరీతంగా వైరల్ అవుతోంది. అందులో ఆయన భూకబ్జాదారులకు అనుకూలంగా మాట్లాడుతున్నట్లుగా ఉంది. భూకబ్జా చేసిన తన అనుచరులకు అనుకూలంగా ఆయన మాట్లాడుతున్నారని తీవ్రమైన విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లాలోని పూడూరు మండలం చన్‌గోముల్ లో భూ కబ్జాకు ఎమ్మెల్యే అనుచరులు ప్రయత్నించినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. బాధితులకు అనుచరులకు ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి సెటిల్మెంట్ కుదిర్చేందుకు ప్రయత్నించారని, భూకబ్జాకు పాల్పడిన అనుచరులకు మద్ధతుగా నిలిచారని ఆరోపణలు వస్తున్నాయి. తన అనుచరుల నుంచి ఎంతోకొంత తీసుకుని, భూమి వదిలేయాలని ఎమ్మెల్యే మహేష్ రెడ్డి చెబుతున్నట్లుగా వీడియోలో ఉంది. భూ కబ్జాకు పాల్పడ్డ బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఎమ్మెల్యే మహేశ్ రెడ్డికి చెందిన అనుచరులు తమ భూమిపై కన్నేశారని బాధితుడైన నవీన్ అనే వ్యక్తి ఆరోపిస్తున్నారు. 346 సర్వే నెంబర్‌లో శ్రీనివాస్ అనే వ్యక్తి నుంచి తాను అగ్రిమెంట్ చేసుకున్న 4 ఎకరాల భూమికి ఫెన్సింగ్ వేస్తుండగా ఎమ్మెల్యే అనుచరులు అడ్డుకున్నారని తెలిపారు. కర్రలు, రాడ్లతో దాడి చేశారని ట్రాక్టర్ తో ఫెన్సింగ్ పగలగొట్టి, బైక్ తగలబెట్టి భయభ్రాంతులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా ఎమ్మెల్యే ఒత్తిడితో పట్టించుకోవడం లేదని బాధితుడు తెలిపారు.
ఆ భూమి ఎక్కడుందో కూడా తెలీదు - ఎమ్మెల్యే
అనుచరులకు అనుకూలంగా ల్యాండ్ సెటిల్మెంట్ ఆరోపణలపై పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ భూమి ఎక్కడ ఉందో కూడా తనకు తెలియదని అన్నారు. తన దగ్గర పంచాయతీ జరిగింది నిజమేనని, రాజీ కుదుర్చుకోమని చెప్పానని అన్నారు. బాధితుడు నవీన్ అనే వ్యక్తి ఎవరో కూడా తనకు తెలియదని అన్నారు. ఆ భూమి ఎక్కడుందో కూడా తెలియదని అన్నారు. కొందరు తనపై కావాలనే అసత్య ఆరోపణలు చేస్తున్నారని, వైరల్ అవుతున్న వీడియో గురించి తనకు తెలియదని అన్నారు.
పూడూరు మండలం, చన్‌గోముల్‌లోని సర్వే నెం.346లో శ్రీనివాస్ అనే వ్యక్తి నుంచి నవీన్ నాలుగు ఎకరాల భూమి అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఆ భూమిలో ఫెన్సింగ్ వేస్తుండగా కర్రలు, రాడ్లతో ఎమ్మెల్యే అనుచరులుగా భావిస్తున్నవారు దాడి చేసి, ట్రాక్టర్‌తో ఫెన్సింగ్ స్తంభాలను పగలగొట్టారు. బాధితుల బైక్ తగలబెట్టారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఎమ్మెల్యే ఒత్తిడితో ఫిర్యాదును పట్టించుకోలేదని బాధితుడు వాపోతున్నాడు.