TTD TSRTC Darshan Tickets : టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు టీటీడీ గుడ్ న్యూస్, ప్రతిరోజు శ్రీవారి దర్శనానికి వెయ్యి టికెట్లు జారీ
TTD TSRTC Darshan Tickets : టీఎస్ఆర్టీసీ-టీటీడీ సంయుక్తంగా ఓ పథకానికి శ్రీకారం చుట్టూయి. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో తిరుమలకు వచ్చే ప్రయాణికుల కోసం ప్రతీ రోజు 1000 టికెట్లు అందుబాటులో ఉంచనున్నారు.
TTD TSRTC Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. తిరుమలకు టీఎస్ఆర్టీసీ బస్సులలో వెళ్లే ప్రయాణికుల కోసం ఇవాళ్టి నుంచి నూతన విధానాన్ని అమలులోకి తీసుకువస్తుంది. టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ చొరవతో టీటీడీ ఈ ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. టీటీడీ ప్రత్యేకంగా టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు రోజువారీ రూ.300 ప్రత్యేక శీఘ్ర దర్శన టికెట్లు 1000 మందికి జారీ చేయనుంది. తిరుమల వెళ్లే ప్రయాణికులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కల్పించినందుకు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ ధన్యవాదాలు తెలిపారు. దీంతో టీఎస్ఆర్టీసీకి యాత్రికుల ఆదరణ మరింత పెరుగుతోందని బాజిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
టీఎస్ఆర్టీసీ వెబ్ సైట్ లో బుక్కింగ్
టీఎస్ఆర్టీసీ బస్సులో తిరుమలకు టిక్కెట్టు రిజర్వేషన్ చేసుకునే సమయంలోనే దర్శనం టిక్కెట్టు కూడా బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఈ ప్రత్యేక సదుపాయం అందుబాటులో ఉంటుంది. తిరుపతి నుంచి తిరుమలకు అక్కడి స్థానిక బస్సులో తీసుకెళ్లి ఉదయం 10 గంటలకు శీఘ్ర దర్శనం కల్పించనున్నారు. ఈ దర్శన టికెట్లను టీఎస్‌ఆర్టీసీ వెబ్‌సైట్ లేదా డీలర్ ద్వారా రిజర్వ్ చేసుకోనే అవకాశం ఉంది. అయితే బస్ టికెట్‌తో పాటే దర్శన టికెట్‌నూ బుక్ చేసుకోవాలి. హైదరాబాద్‌తో పాటు మరికొన్ని జిల్లాల నుంచి తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రయాణికులకు ఇది చాలా మంచి సౌకర్యవంతంగా ఉంటుందని సంస్థ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
ప్రతీ రోజు 1000 టికెట్లు
టీఎస్ఆర్టీసీ బస్సులో తిరుమలకు వెళ్లే భక్తులకు స్వామి వారిని దర్శించుకోవడానికి ప్రతిరోజూ 1000 టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని, ఈ సౌకర్యం శుక్రవారం నుంచి అమలులోకి వస్తుందని బాజిరెడ్డి వివరించారు. www.tsrtconline.in ఆన్ లైన్ లేదా టికెట్ బుకింగ్ కౌంటర్లలో ఈ ప్యాకేజీని పొందవచ్చని కనీసం 7 రోజుల ముందుగానే టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఈ అవకాశాన్ని టీఎస్ఆర్టీసీ బస్సులో ప్రయాణించే భక్తులు వినియోగించుకోవాలని ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ కోరారు. టీఎస్ ఆర్టీసీ సంస్థ రీజియన్ మేనేజర్లు, డిపో మేనేజర్లు శ్రీవారి దర్శన టికెట్ల పథకాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు.
టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
తిరుమల వెంకన్న స్వామిని దర్శించుకునేందుకు భక్తులకు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. తిరుమలకు ప్రత్యేక టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. తిరుమలకు వెళ్లే వారికోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సు టికెట్ల కోసం వారం ముందు నుంచే రిజర్వేషన్ చేసుకోవాలని, ఈ కార్యక్రమం జులై 1 నుంచి ప్రారంభం అవుతుందని టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఈ నెల 8 నుంచి తిరుమలకు ప్రత్యేక బస్సులు ప్రారంభం అవుతాయని చెప్పారు. ప్రతి రోజు 1000 మందిని చేరవేసేందుకు 30 బస్సులు అందుబాటులో ఉంచనున్నామన్నారు. బస్ టికెట్ ఛార్జీతో పాటు తిరుమలలో ప్రత్యేక దర్శనం టికెట్ కోసం అదనంగా రూ.300 కూడా చెల్లించాల్సి ఉంటుందన్నారు బాజిరెడ్డి గోవర్ధన్. తిరుమల వెళ్లాక అక్కడ ప్రత్యేక వసతి సౌకర్యం కూడా ఆర్టీసీ కల్పిస్తుందని చెప్పారు. దర్శనం కోసం పంచలు కూడా ఇస్తామని అన్నారు. ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు సైతం ఈ ప్రత్యేక టికెట్స్ కోసం బస్సులు ఉంటాయన్నారు బాజిరెడ్డి గోవర్ధన్. ఈ కార్యక్రమంపై ప్రజలకు విస్తృత అవగాహనను ఆర్టీసీ అధికారులు కల్పించాలని సూచించారు. ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.