TSRTC: 550 ఎలక్ట్రిక్ బస్సులకు ఒలెక్ట్రా కంపెనీకి టీఎస్ ఆర్టీసీ ఆర్డర్, విజయవాడకు 50 సర్వీసులు
మేఘ ఇంజినీరింగ్ కంపెనీ అనుబంధ ఎలక్ట్రిక్ బస్సుల తయారీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ (Olectra Greentech Limited) మరో భారీ ఆర్డర్ దక్కించుకుంది.
TSRTC Orders 550 Electric Buses: తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ కాలుష్యాన్ని నియంత్రించే దిశగా చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు 550 విద్యుత్ బస్సులకు ఒలెక్ట్రా కంపెనీకి ఆర్డర్ ఇచ్చింది. మేఘ ఇంజినీరింగ్ కంపెనీ అనుబంధ విద్యుత్ బస్సుల తయారీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ (Olectra Greentech Limited) మరో భారీ ఆర్డర్ దక్కించుకుంది. టీఎస్ ఆర్టీసీ నుంచి 550 ఎలక్ట్రిక్ బస్సుల తయారీకి తమకు భారీ ఆర్డర్ లభించినట్లు సోమవారం ఓ ప్రకటనలో ఒలెక్ట్రా కంపెనీ తెలిపింది. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఇంత మొత్తంలో ఆర్డర్ రావడం ఇదే తొలిసారి అని, తమ కంపెనీపై నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఒలెక్ట్రా గ్రీన్‌కు చెందిన 40 బస్సులను వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు టీఎస్ ఆర్టీసీ నడుపుతోంది.
ఈ ఆర్డర్‌లో 500 లో ఫ్లోర్ ఇంట్రాసిటీ ఈ-బస్సులతో పాటు 50 స్టాండర్డ్ ఫ్లోర్ 12 మీటర్ల ఇంటర్‌సిటీ కోచ్‌లను తెలంగాణ ఆర్టీసీ సంస్థకు అందించనున్నట్లు సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కేవీ ప్రదీప్ వెల్లడించారు. అయితే తమకు వచ్చిన ఆర్డర్ ను దశలవారీగా బస్సులను అందించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఆర్టీసీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసించారు. వాయు, శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడంలో భాగంగా టీఎస్ ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చునని అభిప్రాయపడ్డారు. ఈ బస్సులు అందుబాటులోకి వస్తే రెండు రకాల కాలుష్యాలు కొంతలో కొంత తగ్గుతాయన్నారు.
పర్యావరణం కోసమే ఎలక్ట్రిక్ బస్సులు - టీఎస్ ఆర్టీసీ ఛైర్మన్
కాలుష్యాన్ని నియంత్రించడంలో భాగంగా విద్యుత్ బస్సులు కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నామని టీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ తెలిపారు. వచ్చే రెండేళ్ల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 3400 విద్యుత్ వాహనాలను అందుబాటులోకి తీసుకురానున్నామని చైర్మన్ తెలిపారు. 2025 నాటికి హైదరాబాద్ నగరమంతా విద్యుత్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నామని టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. కాలుష్య రహిత వాహనాల వినియోగంలో భాగంగా 550 బస్సులను తొలి దశలో అందుకోనున్నట్లు వెల్లడించారు.
విజయవాడకు 50 ఎలక్ట్రిక్ బస్ సర్వీసులు
బెస్ట్ ఎలక్ట్రిక్ బస్సుల తయారీ కంపెనీ ఒలెక్ట్రా మొత్తం 550 విద్యుత్ బస్సులకు గానూ టీఎస్ ఆర్టీసీ ఆర్డర్ అందుకుంది. ఇందులో 50 ఇంటర్‌సిటీ బస్సులను హైదరాబాద్ నుంచి విజయవాడకు నడపాలని ఆర్టీసీ భావిస్తోంది. ఎందుకంటే ఎయిర్ కండీషన్ (AC Facility) కలిగిన ఈ బస్సులు ఒక్కసారి ఛార్జింగ్ తో దాదాపు 325 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తాయి. ఈ ఆర్డర్ లో మిగిలిన 500 బస్సులను హైదరాబాద్ పరిధిలో అందుబాటులోకి తేనున్నారు. ఈ బస్సులు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 225 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి.
తెలంగాణలో తొలిసారిగా ఏసీ స్లీపర్ బస్సులు
రాష్ట్రంలోనే మొదటిసారిగా ఏసీ స్లీపర్ బస్సులను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) అందుబాటు లోకి తీసుకువస్తోంది. ప్రయాణికుల సౌకర్యార్థం సుదూర ప్రాంతాలకు వెళ్లే వారికి మరింతగా చేరువ అయ్యేందుకు ఏసీ స్లీపర్ బస్సులను రూపొందించింది. ప్రైవేట్ బస్సులకు ధీటుగా రూపొందించిన 16 కొత్త ఏసీ స్లీపర్ బస్సులు అందుబాటు లోకి రాబోతున్నాయి. కర్ణాటకలోని బెంగళూరు, హుబ్లీ, ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, తిరుపతి, తమిళనాడు లోని చెన్నై మార్గాల్లో ఈ బస్సులను సంస్థ నడపనుంది. నాన్ ఏసీ స్లీపర్ బస్సుల మాదిరి గానే ఏసీస్లీపర్ బస్సులకు ‘లహరి’ (Sleeper Buses Named A Lahari) గా సంస్థ నామకరణం చేసింది.