Sajjanar Bus Trip: బస్సెక్కిన ఆర్టీసీ బాస్... సాధారణ ప్రయాణికుడిలా ట్రావెల్... విషయం తెలిసి అధికారులు షాక్
సజ్జనార్ ఎక్కడున్నా తనదైన మార్క్ చూపిస్తారు. ప్రస్తుతం టీఎస్ఆర్టీసీ ఎండీగా ఉన్న ఆయన సాధారణ ప్రయాణికుడిలా ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ప్రయాణికులతో ముచ్చటించారు.
సజ్జనార్...తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితమైన పేరు. ప్రస్తుతం ఆయన తెలంగాణ ఆర్టీసీ ఎండీగా ఉన్నారు. ఆయన ఏం చేసినా డిఫరెంట్ గా ఉంటుంది. ఎన్ కౌంటర్ అయినా... తనిఖీలు అయినా... తనదైన స్టైల్ చూపిస్తుంటారు. వీసీ సజ్జనార్ తాజాగా ఆర్టీసీ బస్సులో సాధారణ ప్రయాణికుడిలా ట్రావెల్ చేశారు. తోటి ప్రయాణికులతో మాటలు కలిసి, వారి బాధలు సైతం అడిగి తెలుసుకున్నారు. అధికారిగా తనదైన మార్క్ చూపించే సజ్జనార్.. బుధవారం ఆర్టీసీ బస్సులో సాధారణ వ్యక్తిగా ప్రయాణించి, బస్సు కండెక్టర్‌కు, ఇతర ప్రయాణికులు తానెవరో చెప్పకుండా ప్రయాణం చేశారు. బుధవారం ఉదయం 11 గంటలకు జీడిమెట్ల డిపోకు చెందిన 9X/272 గండి మైసమ్మ నుంచి సీబీఎస్ రూట్‌లో ప్రయాణించే బస్సులో సజ్జనార్ లక్డీకాపూల్ వద్ద సాధారణ వ్యక్తిగా బస్సు ఎక్కారు. కండక్టర్‌కు తానెవరో చెప్పకుండా టికెట్ తీసుకుని ఎంజీబీఎస్ వరకు బస్సులో ప్రయాణించారు.
ఆదాయం పెంచుకునేందుకు
బస్సులో ప్రయాణిస్తోన్న సమయంలో సజ్జనార్ తన తోటి ప్రయాణికులతో మాటలు కలిపి వారి బాధలు తెలుసుకున్నారు. ఆ తర్వాత ఎంజీబీఎస్ కు దిగి అక్కడ సాధారణ వ్యక్తిగా తిరుగుతూ బస్టాండు ప్రాంగణంలోని పరిశుభ్రతను పరిశీలించారు. ఏఏ ప్లాట్‌ఫాంలల్లో ఏఏ రూట్ బస్సులు వెళ్తాయో తెలిపే రూట్ బోర్డును, విచారణ కేంద్రం, రిజర్వేషన్ కేంద్రాల పనితీరును పరిశీలించారు. అలాగే బస్టాండ్ లో మరుగుదొడ్ల పరిశుభ్రతను పరిశీలించారు. అంతేకాకుండా ప్లాట్‌ఫాంపై నిలబడి ఉన్న సిబ్బందితో కూడా మాట్లాడారు. అనంతరం ఆర్టీసీ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి, పరిసరాలను శుభ్రత, మరుగుదొడ్ల పరిశుభ్రతను మెరుగుపర్చాలని, పార్కింగ్ స్థలంలో చాలా కాలంగా పేరుకుపోయిన వాహనాలను స్క్రాప్ యార్డ్‌కు తరలించాలని ఆదేశించారు. ప్రకటనల ద్వారా అదనపు ఆదాయం సమకూర్చుకోవడానికి పార్కు నిర్వహణ బాధ్యతను ఔట్ సోరింగ్ ఏజెంట్లకు అప్పగించాలని సూచించారు. ఆర్టీసీ బస్టాండ్ లలో ఖాళీగా ఉన్న స్టాల్స్ భర్తీకి చర్యలు చేపట్టాలన్నారు.
#MGBS #BusTerminal లో ఒక సాధారణ ప్రయాణికుడిలా@tsrtcmdoffice #VCSajjanar గారు. pic.twitter.com/nCgmHUtCBr
— Khwaja Moinuddin (@khwajamoinddin) September 15, 2021
Also Read: TS High Court: మీకు నిర్లక్ష్యమా? మేమే జోక్యం చేసుకుంటాం.. సర్కార్‌పై హైకోర్టు సీరియస్
అశ్లీల పోస్టర్లపై చర్యలు
ఆర్టీసీ ఆదాయాన్ని పెంచుకునేందుకు పండుగలు, వివాహ సమయాలలో బస్సులను అద్దెకు ఇవ్వాలని సజ్జనార్ సూచించారు. రాబోయే దసరా పండుగ నేపథ్యంలో తగిన బస్సులను నడిపి సంస్థ ఆదాయాన్ని పెంచాలన్నారు. ఇప్పటి నుంచే రిజర్వేషన్ ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించారు. ఆర్టీసీ బస్సులపై అశ్లీల చిత్రాలు కనిపించకుండా చర్యలు చేపడతామని టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. హైదరాబాద్ నగర బస్సులపై ఓ సినిమాకు సంబంధించిన అశ్లీల పోస్టర్ చిత్రాలను బుధవారం ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. ఆదాయం కోసం ఇలాంటి ప్రకటనలు బస్సులపై వేస్తున్నారంటూ పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సజ్జనార్ చర్యలు తీసుకుంటామని తెలిపారు. భవిష్యత్తులో అలాంటివి కనిపించకుండా చూస్తామంటూ రీట్వీట్ చేశారు.