TS High Court: మీకు నిర్లక్ష్యమా? మేమే జోక్యం చేసుకుంటాం.. సర్కార్‌పై హైకోర్టు సీరియస్
తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ టి.వినోద్ కుమార్ ధర్మాసనం కరోనా థర్డ్ వేవ్ విషయంలో మరోసారి విచారణ చేపట్టింది.
కరోనా మూడో వేవ్ విషయంలో ప్రభుత్వంపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. థర్డ్ వేవ్‌కు అనుసరించే ప్రణాళిక విషయంలో ఆలసత్వం చేయొద్దని హెచ్చరించింది. లేకపోతే తామే జోక్యం చేసుకుంటామని స్పష్టం చేసింది. ఇప్పటికే మూడో వేవ్ విషయంలో ప్రణాళిక సమర్పించాలని పలుమార్లు ఆదేశించినప్పటికీ ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. సమస్యను ముందుగా గుర్తించి పరిష్కారానికి ప్రణాళిక రూపొందించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగానిదేనని స్పష్టం చేసింది.
తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ టి.వినోద్ కుమార్ ధర్మాసనం కరోనా థర్డ్ వేవ్ విషయంలో మరోసారి విచారణ చేపట్టింది. ప్రభుత్వం తన బాధ్యతను నిర్వర్తిస్తుందని ఆశిస్తున్నామని.. లేదంటే కోర్టు జోక్యం చేసుకుంటుందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఒకవైపు స్కూళ్లు మొదలుకాగా.. మరోవైపు వినాయక ఉత్సవాలు జరుగుతున్నాయని.. ఈ నేపథ్యంలో పిల్లలకు కరోనా సోకకుండా ఇంకా అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది.
ఒకవేళ మూడో దశ వస్తే రాష్ట్రవ్యాప్తంగా నిలోఫర్ ఆస్పత్రిపైనే ఆధారపడకుండా జిల్లాల్లోనూ పిల్లల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మెరుగు పరచాలని ఆదేశించింది. అయితే, థర్డ్ వేవ్‌పై నిపుణుల కమిటీ జూలై 15నే సమావేశమై సూచనలు ప్రభుత్వానికి సిఫార్సు చేసిందని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ హైకోర్టుకు తెలిపారు. నిపుణుల కమిటీ సిఫార్సుల అమలుకు ఏం చర్యలు తీసుకున్నారో నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను ధర్మాసనం ఈ నెల 22కి వాయిదా వేసింది.
తెలంగాణలో 2 కోట్ల వ్యాక్సిన్లు పూర్తి
తెలంగాణలో గత జనవరిలో ప్రారంభమైన వ్యాక్సిన్ల పంపిణీ కార్యక్రమం కీలక మైలు రాయిని చేరింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్ రెండు కోట్ల మార్క్‌ను దాటింది. ఈ సందర్భంగా సచివాలయంలో సీఎస్ సోమేశ్ కుమార్ కేకు కట్ చేశారు. ఈ సందర్భంగా వైద్య అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దాదాపు 1,500లకు పైగా కేంద్రాల ద్వారా వ్యాక్సిన్‌ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. వచ్చే రెండు మూడు నెలల్లోనే రాష్ట్రవ్యాప్తంగా వంద శాతం మందికి కనీసం ఒక డోస్ వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే నిత్యం సుమారు 2 లక్షల మందికి టీకాలు అందిస్తున్నారు.
కొత్తగా 324 కరోనా కేసులు
తెలంగాణలో కొత్తగా 324 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,62,526కు చేరింది. కొత్తగా 280 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా.. వైరస్‌తో ఒకరు చనిపోయారు. ఇప్పటి వరకు మొత్తం 6,53,302 మంది బాధితులు కోలుకున్నారు. కరోనా బారినపడి మొత్తం 3,899 మంది ప్రాణాలు వదిలారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,325 యాక్టివ్ కేసులున్నాయి. ఇవాళ ఒకే రోజు 73,323 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. తాజా కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలోనే 79 పాజిటివ్ కేసులు ఉండగా.. ఖమ్మంలో 24, కరీంనగర్‌లో 22, నల్గొండలో 19, రంగారెడ్డిలో 18 మంది వైరస్ పాజిటివ్‌గా గుర్తించారు.