TSPSC Exam Dates 2024: తెలంగాణలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్-3 ఎగ్జామ్ డేట్స్ ఇవే
Telangana Group 2 Exam Date: గ్రూప్-2, గ్రూప్-3 నియామక పరీక్షల తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది.
TSPSC Group 2 Exam Date: హైదరాబాద్: తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త వచ్చింది. నియామక పరీక్షల తేదీలను తెలంగాణ పబ్లిక్స సర్వీస్ కమిషన్ ప్రకటించింది. గ్రూప్ 1, గ్రూప్-2, గ్రూప్-3 పరీక్ష (TSPSC Group 3 Exam Date) తేదీలను బుధవారం నాడు టీఎస్ పీఎస్సీ ప్రకటిచింది. ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహించనున్నారు. నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్-3 పరీక్షలను నిర్వహిస్తామని ప్రకటించారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ జూన్ 9న నిర్వహించనున్నారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ 21 న ప్రారంభం కానున్నాయి.
గ్రూప్ 1 ఎగ్జామ్
తెలంగాణ వచ్చి పదేళ్లు అవుతున్నా, ఒక్కసారి కూడా గ్రూప్-1 పోస్టులు భర్తీ కాలేదు. గత నోటిఫికేషన్ రద్దు చేసి, మొత్తం 563 పోస్టుల భర్తీకీ TSPSC ఫిబ్రవరి 19న నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ అర్హత ఉన్నవారు గ్రూప్-1 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. గత నోటిఫికేషన్ సమయంలో దరఖాస్తు చేసుకున్నవారు తాజా నోటిఫికేషన్ కు ఎలాంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరంలేదు. సరైన అర్హతలున్న అభ్యర్థుల నుంచి ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14న సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరించనున్నారు. గరిష్ఠవయోపరిమితి 44 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాలకు పెంచారు.
'గ్రూప్-2' నోటిఫికేషన్ పూర్తి వివరాలు
783 'గ్రూప్-2' పోస్టుల భర్తీకి గతంలోనే నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే పరీక్షా తేదీలను వాయిదా వేస్తూ వచ్చింది గత ప్రభుత్వం. చివరగా నవంబర్ నెలలో గ్రూప్ 2 ఎగ్జామ్ రీషెడ్యూల్ చేయగా.. ఎన్నికల షెడ్యూల్ కారణంగా ఈ ఏడాది జనవరిలో నిర్వహించడానికి రీషెడ్యూల్ చేసింది గత బోర్డ్. అంతలోనే ఎన్నికలు జరిగి ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం టీఎస్ పీఎస్సీ కమిషన్ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిన నియమించింది. ఈ క్రమంలో ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహించనున్నట్లు తాజాగా ప్రకటించారు. మున్సిపల్ కమిషనర్, ఏసీటీవో, తహసిల్దార్, సబ్-రిజిస్ట్రార్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, మండల పంచాయతీ అధికారి, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
గ్రూప్-3 ఉద్యోగాల వివరాలు
తెలంగాణలో 'గ్రూప్-3' ఉద్యోగాల భర్తీకి టీఎస్ పీఎస్సీ 2022 డిసెంబరు 30న నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1363 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పలు విభాగాల్లో జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అకౌంటెంట్, ఆడిటర్, సీనియర్ ఆడిటర్, అసిస్టెంట్ ఆడిటర్, అకౌంటెంట్ పోస్టులను టీఎస్ పీఎస్సీ భర్తీ చేయనుంది. గ్రూప్-3 పరీక్షలను నవంబర్ 17, 18 తేదీల్లో నిర్వహిస్తామని ప్రకటించారు.
వరుస నోటిఫికేషన్లు, పరీక్షల నిర్వహణకుగానూ అదనంగా సిబ్బందిని ఇవ్వాలని టీఎస్‌పీఎస్సీ చైర్మన్ మహేందర్‌రెడ్డి ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుత అవసరాల దృష్ట్యా 150 మంది సిబ్బందిని కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. 50 మందిని తక్షణమే డిప్యూటేషన్ మీద, మరో 100 మంది ఉద్యోగులను రిక్రూట్‌చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మహేందర్ రెడ్డి కోరారు. ఎన్నికలకు ముందు టీఎస్‌పీఎస్సీలో సిబ్బందిలేరని ప్రతిపక్షాలు విమర్శించాయి. తాజాగా పోస్టుల భర్తీ, నియామక పత్రాలు అందజేయడంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ చేస్తోంది.