Telangana: బోథ్ ను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని పెరుగుతున్న డిమాండ్
బోథ్ ను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 76 రోజుకు చేరుకున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం గాడ నిద్రలోంచి మేల్కొని రెవెన్యూ డివిజన్ గా బోథ్ ను ఏర్పాటు చేయాలని బోథ్ రెవెన్యూ డివిజన్ సాధన సమితి నాయకుడు చంటి ఈ విధంగా వ్యాఖ్యానించారు. అదిలాబాద్ జిల్లా బోథ్ ను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 76 రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా బోథ్ బందు చేపట్టారు. పలు వ్యాపార, వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా బంద్ చేసి తమ మద్దతును తెలిపారు.
ఈ సందర్భంగా చంటి మాట్లాడుతూ.... బోథ్ మండల వ్యాప్తంగా ఈరోజు స్వచ్ఛందంగా బందుకు పిలుపునివ్వడంతో వ్యాపార సంఘాలు పెద్ద మొత్తంలో సహకరించి బందును విజయవంతం చేశాయని తెలిపారు. అందరూ స్వచ్ఛందంగా వ్యాపార సముదాయాలు బందు చేసి నిరసన దీక్షకు సహకరించడం హర్షనీయమని తెలిపారు. గత 70 రోజులు నుంచి బోథ్ అస్తిత్వాన్ని, ఆత్మ గౌరవాన్ని కాపాడుకునే దిశగా ప్రజలు మమేకమై నిరాహార దీక్షలు చేస్తున్నారని వెల్లడించారు. ప్రజలచే ఎన్నుకోబడిన నాయకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటని వెల్లడించారు.
బోథ్ ను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు చేపడతామని హెచ్చరించారు. నిరసనలో భాగంగా ఈనెల 25వ తేదీన మంత్రి కేటీఆర్ నిర్మల్ పర్యటన ఉన్నందున ఆరోజు జరగబోయే సభలో బోథ్ ను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజల నుండి పెద్ద ఎత్తున ప్లకార్డు ప్రదర్శన, నిరసనలు చెలరేగుతాయని రెవెన్యూ డివిజన్ సాధన సమితి నాయకుడు చంటి హెచ్చరించారు. నిరసనలో భాగంగా రేపు జాతీయ రహదారి దిగ్బంధం కార్యక్రమానికి పిలుపునిచ్చారు.
వందలాది మంది యువకులు, బోథ్ ఆటో యూనియన్ తరపున 100 ఆటోలతో బోథ్ పట్టణ ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు.పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కాలనీలలో యువకులు, మహిళలు, తమ మద్దతు తెలిపారు. అనంతరం బస్టాండ్ దగ్గర సమావేశం ఏర్పాటు చేసుకొని వంటా వర్పు కార్యక్రమాన్ని చేపట్టారు. బోథ్ రెవెన్యూ డివిజన్ సాధన సమితి ఆధ్వర్యంలో రెవెన్యూ డివిజన్ సాధన, సబ్ డివిజనల్ పోలీస్ అధికారి కార్యాలయం ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. కోర్టు కాంప్లెక్స్ భవనాన్ని పూర్తి చేయాలని, జనరల్ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని, ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని, 31 అంశాలతో డిమాండ్ చేస్తూ బోథ్ మండలం సంపూర్ణ బంద్ కొనసాగింది. ఉదయం నుంచి వ్యాపార వర్గాలు బంద్ పాటించాయి. అనంతరం రెవెన్యూ డివిజన్ నాయకులు బ్యాంకులు, ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు బంద్ చేయించారు.