TS High Court : జూబ్లీహిల్స్ పబ్ లలో రాత్రి 10 గంటల తర్వాత నో మ్యూజిక్, హైకోర్టు కీలక ఆదేశాలు
TS High Court : జూబ్లీహిల్స్ లోని 10 పబ్ లకు హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. రాత్రి 10 గంటల తర్వాత ఎలాంటి మ్యూజిక్ ప్లే చేయకూదనని ఆదేశించింది.
TS High Court : పబ్ లలో రాత్రి 10 గంటల తర్వాత మ్యూజిక్ వినిపించకూడదని ఇటీవల హైకోర్టు సింగిల్ బెంచ్ కీలక తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై రెస్టారెంట్ అసోసియేషన్ హైకోర్టు డివిజనల్ బెంచ్ ముందు అప్పీల్ చేసింది. ఈ పిటీషన్ పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. సింగిల్ బెంచ్ తీర్పు జూబ్లీహిల్స్‌లోని 10 పబ్‌లకు మాత్రమే వర్తిస్తుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 26న పబ్‌లలో మ్యూజిక్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి కీలక ఆదేశాలు ఇచ్చారు. రాత్రి 10 గంటల తర్వాత పబ్ లలో మ్యూజిక్ అనుమతించవద్దని ఆదేశించింది. అలాగే మైనర్లను కూడా పబ్‌లలోకి అనుమతివ్వొద్దని తెలిపింది. పబ్‌ల విషయంలో తీసుకున్న చర్యలపై నివేదికలు ఇవ్వాలని ముగ్గురు పోలీసు కమిషనర్లను, జీహెచ్ఎంసీ కమిషనర్ ను కోర్టు ఆదేశించింది.
ఆ పది పబ్ లలో
హైదరాబాద్ లోని ముగ్గురు పోలీస్ కమిషనర్లు, జీహెచ్ఎంసీ కమిషనర్ తమ నివేదికలను సెప్టెంబర్ 26న హైకోర్టుకు సమర్పించారు. నివాస ప్రాంతాలు, విద్యాసంస్థలకు సమీపంలో పబ్‌లను అనుమతించడంపై కోర్టు తప్పుబట్టింది. ఈ క్రమంలో పబ్ ల వ్యవహారంపై హై కోర్టు ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. జూబ్లీహిల్స్ లోని 10 పబ్‌లలో రాత్రి 10 తర్వాత ఎలాంటి మ్యూజిక్ పెట్టకూడదని స్పష్టం చేసింది. సింగిల్ బెంచ్ తీర్పు జూబ్లీహిల్స్ లో ఉన్న టాట్, జూబ్లీ 800, ఫర్జీ కేఫ్, అమ్నిషియా, హై లైఫ్, డైలీ డోస్, డర్టీ మార్టిని, బ్రాడ్వే, హార్ట్ కప్ పబ్‌లతో పాటు మరో పబ్‌కు వర్తిస్తుందని తెలిపింది.
ఇళ్ల మధ్య పబ్ లు
జూబ్లీహిల్స్ రెసిడెంట్స్ క్లీన్ అండ్ గ్రీన్ అసోసియేషన్ హైకోర్టులో ఇళ్ల మధ్య పబ్ నిర్వహణపై పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై హైకోర్టులో విచారణ చేపట్టింది. డీజే సౌండ్‌లు, అధిక ధ్వని, డ్యాన్స్ ల వల్ల చుట్టు పక్కల వారికి ఇబ్బందులు కలుగుతున్నాయని పిటిషన్ తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. ఈ విషయంలో పోలీసులు, ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు చేసినా ఎవరూ స్పందించడం లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది గతంలో వాదించారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న కోర్టు అప్పట్లో రాత్రి 10 గంటల తర్వాత నో మ్యూజిక్ ఆదేశాలు ఇచ్చింది.
పబ్ లలో డ్రగ్స్ పార్టీలు
హైదరాబాద్ లోని పలు పబ్ లో డ్రగ్స్ పార్టీలు జరిగిన ఘటనలు ఇటీవల వెలుగుచూశాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అలెర్ట్ అయ్యి నిబంధనలు కఠినతరం చేసింది. ముఖ్యంగా పబ్ లో డ్రగ్స్ సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ పలు ఆదేశాలు ఇచ్చింది. గీత దాటితే ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదు అని స్పష్టం చేసింది. పబ్‌లో అసాంఘిక కార్యక్రమాలు వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. పబ్ ను పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు కవర్ అయ్యేలా ఏర్పాటు చేయాలి. అలా కెమెరాలు ఏర్పాటు చేయని పబ్ ను మూసివేయాలని పోలీసులను ఆదేశించింది ఎక్సైజ్ శాఖ.