నా పార్టీ సింబల్ కోసం నిరాహారదీక్ష చెయ్యాలా? నాకెందుకీ నరకం చూపిస్తున్నారు - KA పాల్ ఆవేదన
KA Paul: కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు తమ పార్టీ గుర్తు కేటాయించకుండా వేధిస్తున్నారని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆయన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిశారు.
KA Paul Prajashanthi Party: కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) అధికారులు తమ పార్టీ గుర్తు కేటాయించకుండా వేధిస్తున్నారని ప్రజా శాంతి పార్టీ (Praja Shanti Party) అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆయన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిశారు. పార్టీ గుర్తు కేటాయంచాలని కోరారు. అనంతరం కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా శాంతి పార్టీ తరఫున సెప్టెంబర్లోనే అన్ని డాక్యుమెంట్లు ఇచ్చిన ఇంతవరకు గుర్తు కేటాయించలేదని ఆరోపించారు.
ఎన్నికల సంఘాన్ని ఎవరు నడుపుతున్నారు?
తెలుగు రాష్ట్రాల్లో తమ పార్టీ యాక్టివ్‌గా ఉందని కేఏ పాల్ చెప్పారు. కానీ పార్టీ యాక్టివ్‌గా లేదని చెప్తున్నారని అన్నారు. ఎన్నికల సంఘాన్ని కేసీఆర్ (CM KCR) నడుపుతున్నారో, ఎన్నికల కమిషనర్ నడుపుతున్నాడో అర్థం కావడంలేదని ఆయన విమర్శించారు. పోటీ చేయని వైఎస్సార్ తెలంగాణ పార్టీకి కూడా గుర్తు కేటాయించారని, కానీ మాకు మాత్రం కేటాయించడం లేదన్నారు. నామినేషన్లకు రేపే చివరి తేదీ అయిన సింబల్ ఇవ్వడం లేదన్నారు.
గుర్తు ఏంటని అడుగుతున్నారు?
ప్రజా శాంతి పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు వెళ్తే సింబల్ ఏంటి అని అడుగుతున్నారని కేఏ పాల్ వ్యాఖ్యానించారు. తనకు ఎందుకు ఇంతలా నరకం చూపిస్తున్నారో అర్థం కావడం లేదని పాల్ ఆవేదన వ్యక్తం చేశారు. సింబల్ కోసం నిరాహారదీక్ష చేయ్యాలా? అంటూ ప్రశ్నించారు. హెలికాప్టర్, రింగ్ గుర్తుల్లో ఏది కేటాయించారో చెప్పడం లేదని, ఆరు నెలలుగా ఇస్తున్నామని చెప్తున్నారే తప్ప కేటాయించడం లేదని మండిపడ్డారు.
తక్షణమే గుర్తు కేటాయించాలి
తక్షణమే ప్రజా శాంతి పార్టీకి గుర్తు వెంటనే కేటాయించాలని పాల్ డిమాండ్ చేశారు. నామినేషన్లకు మరో రెండు రోజులు సమయం ఇవ్వాలని కోరారు. ప్రజా శాంతి పార్టీకి సింబల్ ఎందుకు ఇవ్వడం లేదో ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలని నిలదీశారు. తెలంగాణ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని, ప్రచారం చేసేందుకు సమయం కేటాయించాలనే నేను పోటీకి దూరంగా ఉన్నట్లు చెప్పారు.
బీజేపీతో కేసీఆర్ కుమ్మక్కు
గతంలో మునుగోడులో చేసిందే కేసీఆర్ మళ్లీ రిపీట్ చేస్తున్నారని కేఏ పాల్ విమర్శించారు. కేసీఆర్ బీజేపీతో కుమ్మక్కు అయ్యి ప్రజా శాంతి పార్టీకి సింబల్ రాకుండా చేస్తున్నారని ఆరోపించారు. తమకు కేటాయించిన గుర్తులేంటో చెప్పడం లేదని అసహనం వ్యక్తం చేశారు. హెలికాప్టర్ సింబలా? లేక రింగా? చెప్పాలని డిమాండ్ చేశారు. అయిన అందరికీ అడిగిన సింబల్స్ ఇచ్చి తన ఒక్కరికే సింబల్ ఇవ్వకపోవడానికి కారణం ఏమిటని నిలదీశారు. తమకు తమ సింబల్ కావాలని, లేదా ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు.
చట్టాలు మార్చాలంటే ఎంపీ అవ్వాల్సిందే
దేశంలో చట్టాలు మారాలంటే తన లాంటి వాడు ఎంపీ అవ్వాలని కేఏ పాల్ అన్నారు. తన పోరాటంతోనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపేసినట్లు చెప్పారు. తెలుగు ప్రజలు మార్పు కోరుకుంటున్నారని సర్వేలు స్పష్టంగా చెప్తున్నాయని, తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. గొర్రెలు కసాయి వారిని నమ్మినట్లే ఆలోచించలేని వారే అవినీతిపరులైన బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌కు ఓటు వేస్తారని అన్నారు.
ప్రజా శాంతి పార్టీ టికెట్లకు డిమాండ్
ప్రజా శాంతి పార్టీ టికెట్లకు విపరీతమైన పోటీ ఉందని కేఏ పాల్ అన్నారు. తెలంగాణలో 119 స్థానాల్లో పోటీ చేస్తామన్నారు. అధికారంలోకి వస్తే పెన్షన్‌ను రూ.6 వేలు చేస్తామని, రైతు బంధు కింద రూ.20 వేలు ఇస్తామన్నారు. తెలంగాణలో ప్రజాశాంతి పార్టీ బలమైన శక్తిగా ఆవిర్భవించబోతోందని, ఇతర పార్టీల్లో టికెట్లు రానివాళ్లు ప్రజాశాంతి పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు. తన పార్టీ తరఫున పోటీ చేసే వారిని ఎమ్మెల్యేలుగా గెలిపిస్తానన్నారు.