Bullet Bandi Song: బుల్లెట్టు బండి పాటకి టీఆర్ఎస్ ఎంపీ కవిత దరువు.. ఆమె స్టెప్పులకు ఆశ్చర్యపోయిన జనం, వీడియో వైరల్
మహబూబాబాద్‌లోని టీఆర్‌ఎస్ నేత ముత్యం వెంకన్న గౌడ్ కుమారుడి వివాహం వరంగల్‌లో జరిగింది. ఈ వివాహానికి హాజరైన మాలోత్ కవిత నూతన వధూవరులను ఆశీర్వదించారు.
‘‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా.. డుగ్గు డుగ్గని..’’ ఈ పాట ఇప్పుడు ఎంత సంచలనంగా మారిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల ఓ పెళ్లి కుమార్తె తన బారాత్‌లో ఆ పాటకు అనుకోకుండా వేసిన డాన్స్ సామాజిక మాద్యమాల్లో విపరీతంగా వైరల్ అవ్వడంతో బుల్లెట్టు బండి పాటకు ఎనలేని జనాదరణ దక్కింది. తాజాగా ఈ పాటకు టీఆర్ఎస్ మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత కూడా తన పాదం కదిపారు. ఓ పెళ్లి వేడుకలో బుల్లెట్టు బండి పాటకు అదిరిపోయే స్టెప్పులేసి అందర్నీ ఆశ్చర్యపర్చారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది.
మహబూబాబాద్‌లోని టీఆర్‌ఎస్ నేత ముత్యం వెంకన్న గౌడ్ కుమారుడి వివాహం వరంగల్‌లో జరిగింది. ఈ వివాహానికి హాజరైన మాలోత్ కవిత నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం వధూవరులు, ఫ్యామిలీతో కలిసి బుల్లెట్ బండి పాటకు కల్యాణ వేదికపైనే డ్యాన్స్ చేశారు. కవితతో పాటు పార్టీ నాయకురాలు హరిత కూడా సరదాగా స్టెప్పులు వేశారు. ఇటీవల పాపులర్ అయిన బుల్లెట్ పాటకు వారు డ్యాన్స్ చేయడం పెళ్లికే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఇప్పుడెక్కడ విన్నా ఇదే పాట మార్మోగుతోంది. సోషల్ మీడియాను, యూత్‌ను ఈ పాట షేక్ చేస్తోంది. ఫంక్షన్స్‌లో ఆటోల్లో కార్లలో ఎక్కడ చూసినా ఈ పాటే వినబడుతుంది. వాస్తవానికి ఈ పాట వచ్చి చాలా రోజులైనా.. సాయి శ్రియ అనే అమ్మాయి వల్ల సోషల్ మీడియాలో ఈ పాట సెన్సేషన్ అయింది. అంతేకాకుండా ఆమె స్టెప్పులకు ఫిదా అయిన ‘బుల్లెట్టు బండెక్కి..’ పాట నిర్మాతలు తమ తర్వాతి ప్రైవేటు ఆల్బంలో అవకాశం కూడా ఇచ్చారు.
అయితే, ఈ పాట అందరికి కనెక్ట్ కావడం మాత్రం సింగర్ మోహన భోగరాజు గాత్రం వల్లే అని చెప్పవచ్చు. లక్ష్మణ్ కలం నుంచి వచ్చిన ఈ పాట సాహిత్యానికి ఎస్‌కే బాజీ సంగీతం అందించగా, తెలంగాణ యాసలో అద్భుతంగా ఆలపించింది. ‘బుల్లెట్ బండి’ పాట వైరల్ అయ్యాక ఈ పాట పాడింది ఎవరు? ఆమె నేపథ్యం ఏంటని అంతా ఆరా తీస్తున్నారు.
బుల్లెట్ బండి పాట ఎలా పుట్టిందంటే..
‘బుల్లెట్ బండి’ పాటకు ఎంత క్రేజ్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ఊరూ వాడా ఆ పాట మార్మోగిపోతోంది. అయితే ఈ పాట ఎలా పుట్టిందో ఈ పాటను పాడిన గాయని మోహన భోగరాజు ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. మోపెండ్లీడుకొచ్చిన ఓ యువతి మనోభావాలను పాట రూపంలో చెప్పాలని ఎప్పటి నుంచో అనుకుంటుందట. ఆమె ఎక్కడ పుట్టింది? ఎలా పెరిగింది? ఆమె నేపథ్యం ఏంటి? అనేది తాను పెళ్లి చేసుకునే యువకుడికి వివరించాలనేది తన కాన్సెప్ట్. తన ఆలోచనకు అచ్చం సరిపోయేలా పాటల రచయిత లక్ష్మణ్ మంచి లిరిక్స్ రాశారు. అందుకే మోహన ఈ పాటను వెంటనే ఒప్పేసుకొని ఆస్వాదిస్తూ పాడిందట. ఇప్పటికే తాను సినిమా పాటలతో బిజీగా గడుపుతున్నప్పటికీ ఇలాంటి ఫోక్ పాటల్ని వదలబోనని మోహన భోగరాజు వెల్లడించింది.