బీజేపీ కార్నర్ మీటింగ్స్- రేవంత్ పాదయాత్ర- నేటి తెలంగాణ అప్‌డేట్స్ ఇవే
ఉపాధ్యాయుల ప్రమోషన్స్, ట్రాన్స్‌ఫర్స్ ప్రోసెస్ మరింత లేట్ అయ్యేలా కనిపిస్తోంది.
రేవంత్ రెడ్డి నేటి పర్యటన షెడ్యూల్..
రేవంత్‌రెడ్డి యాత్ర ములుగు నియోజకవర్గంలో నేడు కూడా కొనసాగనుంది. రామప్ప దేవాలయాన్ని సందర్శించి రుద్రేశ్వరుడికి పూజల అనంతరం పాదయాత్రగా రామాంజాపురం, వెల్తుర్లపల్లి క్రాస్‌రోడ్డు, బుద్దారం, కేశవాపురం, నర్సాపురం, బండారుపల్లి మీదుగా ములుగు వస్తారు. సాయంత్రం జిల్లాకేంద్రంలో జరిగే రోడ్‌షోలో ప్రజలనుద్దేశించి మాట్లాడతారు.
నేడు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్నర్ మీటింగ్స్
రాష్ట్ర వ్యాప్తంగా కార్నర్ మీటింగ్స్కు బీజేపీ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా నేడు రాష్ట్రానికి బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ బన్సల్ రానున్నారు. 11వేల కార్నర్ మీటింగ్ల కోసం దాదాపు 800 మంది లీడర్లను బీజేపీ గుర్తించింది. బీజేపీ నాయకులకు నేడు ఒక్క రోజు శిక్షణ ఇవ్వనున్నారు. మన్నెగూడలో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు శిక్షణ తరగతులను నిర్వహించనున్నారు. స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ లో ఏ అంశాలు చర్చించాలనే అంశంపై లీడర్లకు సునీల్ బన్సల్, బండి సంజయ్ దిశానిర్దేశం చేయనున్నారు.
నేటి బదిలీలు, పదోన్నతుల జాబితాకు బ్రేక్
ఉపాధ్యాయుల ప్రమోషన్స్, ట్రాన్స్‌ఫర్స్ ప్రోసెస్ మరింత లేట్ అయ్యేలా కనిపిస్తోంది. తెలంగాణ హైకోర్టు తీర్పు కారణంగా ప్రస్తుతానికి ప్రక్రియను ఆపాలాని ఉన్నతాధికారులు జిల్లా స్థాయి అధికారులకు ఆదేశించారు. సర్వీస్ సీనియారిటీ ఆధారం 317 జీఓ ప్రకారం గతేడాది 25 వేల మందిని బదిలీ చేసింది ప్రభుత్వం. ఉమ్మడి జిల్లాలోని పాఠశాలలో పని చేసిన కాలాన్ని పరిగణనలోకి తీసుకొని తమకు కూడా బదిలీ దరఖాస్తుకు అవకాశం ఇవ్వాలని కొందరు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సోమవారం హైకోర్టు మధ్యంతర తీర్పు చెప్పింది. దీంతో సోమవారం రాత్రి విద్యాశాఖ తాజా ఆదేశాలు జారీ చేసింది. ఎన్‌టైటిల్‌మెంట్ పాయింట్ల ఆధారంగా ఉపాధ్యాయ బదిలీలకు సీనియారిటీ జాబితా, పదోన్నతుల కోసం తాత్కాలిక సీనియారిటీ జాబితాలు రిలీజ్ చేయొద్దని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన డీఈఓలను ఆదేశించారు. ఉపాధ్యాయ ఖాళీల జాబితా కూడా ప్రకటించొద్దని సూచించారు. ఫలితంగా బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. 317 జీఓ ద్వారా ఇతర జిల్లాలకు బదిలీ అయిన వారికి కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇవ్వొచ్చని భావిస్తున్నారు. అదేజరిగితే మరో 15 వేల మంది బదిలీ దరఖాస్తు చేసుకుంటారని అంచనా వేస్తున్నారు.
జేఈఈ మెయిన్ ఫలితాల విడుదల
జేఈఈ మెయిన్ తొలి విడత పేపర్-1 స్కోర్‌ను విడుదల చేశారు. తొలి విడత పరీక్షలు ఈనెల 1న ముగిసిన సంగతి తెలిసిందే. బీటెక్ సీట్ల కోసం ఈ పరీక్షను దేశవ్యాప్తంగా 8.60 లక్షల మంది రాయగా వారిలో తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 1.60 లక్షల మంది ఉన్నారు. చివరి విడత పరీక్షలు ఏప్రిల్‌లో జరగనుండగా దానికి హాజరయ్యేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేడు ప్రారంభం కానుంది.