TS News Developments Today: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నేడు విచారణ, సీబీఐ రంగంలోకి దిగుతుందా? లేదా?
ఇప్పటికే ప్రభుత్వం తరపు వాదనలు పూర్తి కాగా, ప్రతివాదుల తరపు వాదనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో హైకోర్టు ధర్మాసనం తదుపరి విచారణను వాయిదా వేసింది. నేటి మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి విచారణ చేపట్టనుంది.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు..నేడు విచారణ
ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలన్న సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్ ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కాగా ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ రిట్ పిటిషన్ ను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఇప్పటికే ప్రభుత్వం తరపు వాదనలు పూర్తి కాగా. ప్రతివాదుల తరపు వాదనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో హైకోర్టు ధర్మాసనం తదుపరి విచారణను వాయిదా వేసింది. నేటి మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి విచారణ చేపట్టనుంది.
నేటి నుంచి వార్డెన్ పోస్టులకు
సంక్షేమ శాఖల్లోని 581 వార్డెన్ పోస్టులకు నేటి నుంచి దరఖాస్తులు మొదలు కానున్నాయి. వీటితోపాటు కళాశాల, ఇంటర్మీడియట్ విద్యలో 128 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు ఆన్‌లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది. అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి చూడకుండా, సకాలంలో పొరపాట్లు దొర్లకుండా ప్రక్రియ ముగించాలని కమిషన్ వర్గాలు సూచిస్తున్నాయి.
నేటి నుంచి ఆయుష్ పీజీ సీట్లకు..
రాష్ట్రంలోని ఆయుష్ పీజీ వైద్య సీట్ల భర్తీకి కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రవేశ ప్రకటన విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు పీజీ ఆయుర్వేదం, హోమియో, యునానీ కోర్సుల్లో కన్వీనర్ కోటాలో సీట్లకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నెల 6న ఉదయం 9 గంటల నుంచి 13న సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది.
నేటి నుంచి ఎమ్మెస్సీ, ఎంపీటీ కన్వీనర్ కోటా కౌన్సెలింగ్
ఎమ్మెస్సీ నర్సింగ్, ఎంపీటీ కోర్సుల్లో కన్వీనర్ కోటాలో మిగిలిన సీట్లకు ఈ నెల 6, 7 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బీఎస్సీ నర్సింగ్, బీపీటీ కోర్సుల్లో కన్వీనర్ కోటాలో మిగిలిన సీట్లకు ఈ నెల 6న ప్రవేశ ప్రక్రియ నిర్వహించనున్నట్లు తెలిపింది.
హైదరాబాద్‌లో జీ-20 ‘హెల్త్’ సదస్సు
దేశంలో నిర్వహిస్తున్న జీ-20 సమావేశాల్లో తెలంగాణకు మరో అరుదైన అవకాశం దక్కింది. అత్యంత కీలకమైన ‘హెల్త్ వర్కింగ్ గ్రూప్'(హెచ్‌డబ్ల్యూజీ) సదస్సుకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనున్నది. మొత్తం నాలుగు నగరాల్లో సదస్సులు జరుగనుండగా, ఇందులో హైదరాబాద్ కూడా ఒకటి. నగరంలో జూన్ 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు మూడు రోజులపాటు ఈ సదస్సు జరుగుతుంది. వ్యాక్సిన్లు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు (డయాగ్నొస్టిక్స్), ఔషధాల లభ్యత పెంపు, పరిశోధనల కోసం జీ-20 దేశాలు అమలు చేయాల్సిన ప్రణాళికపై వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. హైదరాబాద్‌తో పాటు తిరువనంతపురం(కేరళ), గోవా, అహ్మదాబాద్(గుజరాత్)లో సదస్సులు జరుగుతాయి.
కేసీఆర్ కి రేవంత్ రెడ్డి లేఖ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కామారెడ్డి మునిసిపాలిటీ కొత్త మాస్టర్ ప్లాన్ ముసాయిదాను వెంటనే రద్దు చేసుకోవాలని గత నెల రోజులుగా కామారెడ్డి, అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామాల ప్రజలు చేస్తున్న ఆందోళనలను ప్రభుత్వం పట్టించుకోక పోవడం దారుణం అన్నారు. కామారెడ్డి లో రైతులు చేస్తున్న ఆందోళనలకు కాంగ్రెస్ మద్దతు ప్రకటిస్తుందన్నారు. అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో పయ్యావుల రాములు అనే రైతు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరమైన విషయం అన్నారు.