నేడు సిపిఎం, సిపిఐ నేతల భేటీ- గులాబీ పార్టీతో కలిసి వెళ్లాలని నిర్ణయం-భవిష్యత్ కార్యాచరణపై చర్చ
సిపిఎం, సిపిఐ ఎన్ని సీట్లలో పోటీ చేయాలి.. ఏ రకమైన వ్యూహాలను భవిష్యత్‌లో అనుసరించాలనేదానిపై ఇవాళ మగ్దూం భవన్‌లో రెండు పార్టీల నేతల భేటీ కానున్నారు. భవిష్యత్ కార్యాచారణ నిర్ణయించనున్నారు.
నేడు వామపక్షల నేతల భేటీ
BRSతో కలిసి CPM, CPI వచ్చే ఎన్నికలను ఎదుర్కోనున్నాయి. రెండు పార్లీలు ఎన్నిసీట్లలో పోటీ చేయాలి, ఏ రకమైన వ్యూహాలను భవిష్యత్‌లో అనుసరించాలనేదానిపై ఇవాళ ఉదయం మగ్దూం భవన్‌లో రెండు పార్టీల నేతల భేటి కానున్నారు. భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించనున్నారు. ఇప్పటికే మునుగోడు ఉపఎన్నికల్లో సిపిఎం, సిపిఐ రెండు పార్టీలు కూడా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు పలికాయి. వామపక్షాల మద్దతు కారణంగానే మునుగోడులో విజయం సాధ్యమైందని బీఆర్ఎస్ నేతలు కూడా అంటున్నారు. అయితే ఈ నెల 18న ఖమ్మం నిర్వహించే బీఆర్ఎస్ సభకు వామపక్షనేతల్ని కూడా సిఎం కేసిఆర్ ఆహ్వానించారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ సభకు రానున్నారు. సిపిఐ జాతీయ కార్యదర్శి డి. రాజా కూడా వస్తారని సమాచారం. బీజేపీని ఏ విధంగా నిలువరించాలనే దానిపై చర్చించనున్నారు. ఈ భేటికి సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శులతోపాటు రాష్ట్రా స్థాయి నాయకులు కూడా హాజరు కానున్నారు.
నేడు నాంపల్లి ఎగ్జిబిషన్‌కు మహిళలకు మాత్రమే ఎంట్రీ
నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరుగుతున్న నుమాయిస్‌లో ఈరోజు మహిళా దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పురుషులకు ఎగ్జిబిషన్‌లోకి అనమతించరు. మహిళలతోపాటు వచ్చే 18 ఏళ్లలోపు పిల్లలను కూడా అనుమతి ఇస్తామని నిర్వాహకులు తెలిపారు. ప్రతి సంవత్సరంలో ఎగ్జిబిషన్‌లో ఒక రోజు మహిళలు కేటాయించడం ఆనవాయితీగా వస్తుంది. అందుకే ఇవాళ మహిళలకు కేటాయించడంతో పాటు ఎగ్జిబిషన్‌లో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
నేడూ కొనసాగనున్న ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో వాదనలు
ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి దర్యాప్తును సిబిఐకి అప్పగించడంపై ప్రభుత్వం అప్పీల్ కు వెళ్లింది. సిట్ దర్యాప్తు ను తప్పించి సిబిఐకి దర్యాప్తు బాధ్యతలను అప్పగించడంపై ప్రభుత్వం అప్పీల్ వెళ్లింది. దీనిపై గత రెండు రోజులుగా హైకోర్టులో ఇరు పక్షాల వాదనలు కొనసాగుతున్నాయి. నేడు కూడా ప్రభుత్వం, నిందితుల తరపున న్యాయవాదులు తమ తమ వాదనలను మరోసారి వినిపించనున్నారు.
మరో రెండు రోజులు వాతావరణం లో ఇదే పరిస్థితి...
వచ్చే రెండ్రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశముందని హెచ్చరిస్తోంది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఉత్తరాన వీస్తున్న చలిగాలుల ప్రభావంతో రాష్ట్రంలోని ఉష్ణోగ్రతలు పడిపోతున్నట్టు చెబుతున్నారు. జనవరి 11 వరకూ రాష్ట్రంలో చలి తీవ్రత ఇలాగే కొనసాగుతుందని అంటోంది ఐఎండీ హైదరాబాద్. ఈ మేరకు ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, కొమ్రంభీమ్- ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. చాలా చోట్ల సింగిల్ డిజిట్ టెంపరేచర్స్ రికార్డు కావడమే ఇందుకు కారణం.హైదరాబాద్ వాతావరణ కేంద్రం విడుదల చేసిన వివరాల ప్రకారం.. నిన్న ఆదిలాబాద్ లో ఆరు, మెదక్‌లో 8, హన్మకొండ 9. 9 డిగ్రీలు నమోదయ్యాయి. రామగుండం 10. 6, హైదరాబాద్ 11. 3, నిజామాబాద్ 12. 5, దుండిగల్, ఖమ్మం 12. 6, హకీంపేట్ 13. 8, భద్రాచలం 14, మహబూబ్ నగర్ 14. 1 నల్గొండ 14. 8 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఇవి సాధారణ ఉష్ణోగ్రతలకంటే ఐదారు డిగ్రీలు తక్కువ. రానున్న రెండ్రోజుల్లో చలి తీవ్రత మరింతగా పెరిగే అవకాశమున్నట్టు చెబుతోంది హైదరాబాద్ వాతావరశాఖ.
మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు నేటి నుంచి దరఖాస్తులు
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 194 మోడల్ స్కూళ్లలో 6వ తరగతిలో కొత్తగా ప్రవేశాలు కల్పించడంతోపాటు 7-10 తరగతుల్లోని ఖాళీ సీట్ల భర్తీకి నిర్వహించే ప్రవేశ పరీక్షకు నేటి నుంచి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు మోడల్ స్కూల్ అదనపు సంచాలకురాలు ఉషారాణి నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 10 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మోడల్ స్కూళ్లు ఉన్న మండల కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తారు. ఎంపికైన విద్యార్థుల జాబితాను మే 15న వెల్లడిస్తారు. తరగతులు జూన్ 1న కానీ, 2023-24 అకడమిక్ క్యాలెండర్ ప్రకారం కానీ మొదలవుతాయని ఉషారాణి పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు మోడల్ స్కూల్ వెబ్‌సైట్ www.telanganams.cgg.gov.in ను చూడాలన్నారు.
ఈపీఎఫ్’ సమస్యల పరిష్కారానికి నేడు నిధి ఆప్‌కే నికత్
భవిష్య నిధి ఖాతాదారులు, పింఛనుదారుల ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ సమస్యల పరిష్కారానికి నేడు‘నిధి ఆప్‌కే నికత్’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు హైదరాబాద్ రీజనల్ పీఎఫ్ కమిషనర్ సి.రవితేజకుమార్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈపీఎఫ్‌వో వాటాదారుల కోసం ప్రత్యేక సెన్సిటైజేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఆన్‌లైన్‌లో కార్యక్రమం నిర్వహిస్తుండగా https://meet.google.com/oshdfic-iyb లింక్‌ను సందర్శించాలని సూచించారు
ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో 201 ట్యూటర్ పోస్టులుఒప్పంద ప్రాతిపదికన నియామకానికి అనుమతి
రాష్ట్రంలోని 14 ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో పనిచేయడానికి 201 ట్యూటర్ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. వీరిని ఈ ఏడాది మార్చి 31 వరకు కానీ, వారి అవసరాలు తీరే వరకు కానీ, రెగ్యులర్ ప్రాతిపదికన నియామకాలు జరిపే వరకు కానీ ఆయా కాలపరిమితికి ఏది ముందుగా జరిగితే దానికి ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసుకోవడానికి అనుమతిస్తూ ఆర్థిక శాఖ కార్యదర్శి రొనాల్డ్‌రాస్ ఉత్తర్వులు జారీచేశారు. వీరికి నెలకు రూ.57,700 గౌరవ వేతనంగా చెల్లిస్తారు. నల్గొండలో 18, సూర్యాపేటలో 18, రిమ్స్(ఆదిలాబాద్)లో 16, నిజామాబాద్‌లో 16, వనపర్తిలో 16, రామగుండంలో 16, భద్రాద్రి కొత్తగూడెంలో 15, జగిత్యాలలో 14, నాగర్‌కర్నూల్‌లో 14, మహబూబాబాద్‌లో 14, సంగారెడ్డిలో 13, మంచిర్యాలలో 13, మహబూబ్‌నగర్‌లో 10, సిద్దిపేటలో 8 చొప్పున పోస్టులు మంజూరు చేశారు.