Top Headlines Today: జగన్ కు రాజధాని ఫ్లెక్సీల సెగ! తమిళిసై వర్సెస్ తెలంగాణ ప్రభుత్వం - నేటి టాప్ హెడ్ లైన్స్
Top 5 Headlines Today 2nd May 2023: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..

‘రాజధాని లేని సీఎంకి స్వాగతం’ - విశాఖలో దారిపొడవునా ఫ్లెక్సీలు
విశాఖపట్నంలోని మధురవాడ ఐటీ హిల్స్ వద్ద ముఖ్యమంత్రి జగన్ ను విమర్శిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కలకలం రేపాయి. రాజధాని లేని రాష్ట్ర ముఖ్యమంత్రికి స్వాగతం అంటు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జన జాగరణ సమితి పేరుతో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రేపు ఐటి హిల్స్ లో అదాని డేటా సెంటర్ కు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ క్రమంలోనే ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
విశాఖపట్నం రుషికొండలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇంటికి వెళ్లే దారిలో ‘రాజధాని లేని రాష్ట్ర ముఖ్యమంత్రి కి స్వాగతం- సుస్వాగతం’ అంటూ ఫ్లెక్సీలు కట్టి జన జాగరణ సమితి వినూత్న నిరసన తెలిపింది. ఈ సందర్భంగా జన జాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు మాట్లాడుతూ రాజధాని లేని రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి దేశ చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతారని అన్నారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులలో అంతటి గొప్ప రికార్డు సృష్టించిన జగన్ కు ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా సన్మానం చేసి "క్యాపిటల్ లెస్ సీఎం" బిరుదు ఇవ్వాలని కోరారు. ఇంకా చదవండి
ఈనెల 4న బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభం, నేడు లేదా రేపు ఢిల్లీకి సీఎం కేసీఆర్
దిల్లీలోని వసంత్ విహార్ లో నిర్మిస్తున్న బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం(తెలంగాణ భవన్)ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 4వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నారు. గతేడాది వసంత్ విహార్‌లో BRS ఆఫీస్ బిల్డింగ్ నిర్మాణానికి కేసీఆర్ భూమి పూజ చేశారు. గతేడాది సెప్టెంబర్ 2వ తేదీన మంత్రులు, ఎంపీల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. దక్షిణాదికి చెందిన పార్టీల్లో ఢిల్లీలో కార్యాలయం ఉన్న తొలి పార్టీ తమదేనని BRS చెబుతోంది. అంతే కాదు. దేశ రాజధానిలో 20 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ భవానాన్ని నిర్మించారు. హైదరాబాద్‌లో తెలంగాణ భవన్ ఉన్నట్టుగానే... ఢిల్లీలోనూ అదే తరహాలో తెలంగాణ భవన్‌ను కట్టారు. అయితే దీనికి ఇంకా సమయం పట్టనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ భవన్‌ను నాలుగు అంతస్తులుగా నిర్మించనున్నారు. కాన్ఫరెన్స్ హాల్, లైబ్రరీ, ఆడియో విజువల్ థియేటర్ ఏర్పాటు చేయనున్నారు.
తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై జాతీయ స్థాయిలో ప్రచారం చేసేందుకు ఈ తెలంగాణ భవన్‌ను వినియోగించుకోవాలని చూస్తోంది పార్టీ. సోమవారం సాయంత్రమే మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ దిల్లీకి పయనమయ్యారు. అక్కడే ఉండి నిర్మాణ పనులను పరిశీలించారు. దిల్లీలో తెలంగాణ పదం పలకాడానికి, వినడానికి అవకాశాలు లేని పరిస్థితుల నుంచి అక్కడ బీఆర్ఎస్ సొంత కార్యాలయాన్ని నిర్మించుకునే స్థాయికి చేరుకోవడం చాలా సంతోషంగా ఉందని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఇంకా చదవండి
పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారా ?
జమిందారులు పాలించిన పిఠాపురం సంస్థానంకు ఎంతో చారిత్ర ఉంది. కాకినాడకు 26 కిలోమీటర్లు దూరంలో ఉండే పిఠాపురం నియోజకవర్గం కాకినాడ జిల్లాలోనే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రతీ ఎన్నికల్లోనూ విభిన్న తీర్పునిచ్చే ఇక్కడి ఓటర్లు ఈ సారి ఏపార్టీకు జై కొడతారో అని ఆసక్తి నెలకొంది. పిఠాపురం మున్సిపాలిటీ, గొల్లప్రోలు, కొత్తపల్లి మండలాలు కలబోసిన ఈ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గ ఓట్లు అత్యధికం. పిఠాపురం నియోజకవర్గంపై జనసేన అధినేత దృష్టి కూడా సారించడంతో ఒక్కసారిగా ఈ నియోజకవర్గంపై అన్ని పార్టీలు చూపు పడింది.. ఈ నియోజకవర్గ సీటు ప్రతిష్టాత్మకంగా మారింది.. ఒక వేళ జనసేనాని గనుక ఇక్కడి నుంచి పోటీకు దిగితే వైసీపీ, టీడీపీ కూడా బలమైన అభ్యర్థినే బరిలోకి దింపే అవకాశాలు లేకపోలేదు..
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కాపులు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల్లో పిఠాపురం, రాజోలు, అమలాపురం, కొత్తపేట నియోజకవర్గాలున్నాయి. అయితే ఇందులో జనసేనకు పట్టున్న నియోజకవర్గాలుగా పిఠాపురం, అమలాపురం, రాజోలు కనిపిస్తున్నాయి. ఇందులో పిఠాపురం మినహా అమలాపురం, రాజోలు రెండూ ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలే. 2019 ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పోటీచేసిన రెండు నియోజకవర్గాలు అంత అనుకూలం కాకపోవడంతో ప్రతికూల ఫలితాన్ని చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సారి ఆ తప్పు జరక్కుండా ఉండేందుకు పిఠాపురంలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. ఇంకా చదవండి
మళ్లీ గవర్నర్ వర్సెస్ తెలంగాణ ప్రభుత్వం, ఈసారి సెక్రటేరియట్ అంశంపై!
తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య మరోసారి వివాదం ప్రారంభమయింది. అత్యంత వైభవంగా జరిగిన తెలంగాణ సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి గవర్నర్ హాజరు కాలేదు. అయితే ఆ విషయం ఎవరూ పట్టించుకోలేదు. పూర్తిగా మంత్రులు.. బీఆర్ఎస్ పార్టీ నేతల కోలాహలం మధ్యనే ఈ ప్రోగ్రాం జరిగింది. ఇతర పార్టీల నేతలకు ఆహ్వానం పంపారు కానీ తాము వెళ్లడం లేదని బండి సంజయ్, రేవంత్ రెడ్డి వంటి వారు ప్రకటించారు. రేవంత్ రెడ్డి సోమవారం సచివాలయానికి వెళ్లే ప్రయత్నం చేస్తే పోలీసులు ఆపేశారు. అయితే ఎవరూ రాకపోయినా బీఆర్ఎస్ నేతలు, మంత్రులు పట్టించుకోలేదు కానీ.. గవర్నర్ రాలేదంటూ తమిళిసై సౌందరరాజన్ పై మంత్రి జగదీష్ రెడ్డి విమర్శలు గుప్పించారు. మంత్రి విమర్శలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.
గవర్నర్ రాకపోవడంపై మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు
గవర్నర్ సచివాలయం ప్రారంభోత్సవానికి రావడం, రాకపోవడం అనేది ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. గవర్నర్ రాకపోవడం వల్ల జరిగే నష్టమేమీ లేదని, దీని వల్ల గవర్నర్ నిజస్వరూపం బయటపడిందని ఆరోపించారు. తెలంగాణ అభివృద్దిని చూసి కొంతమంది తట్టుకోలేకపోతున్నారని, గవర్నర్ రాకపోవడం కూడా అందులో భాగమేనని విమర్శించారు. ప్రతిపక్ష, విపక్ష పార్టీలు అభివృద్ధికి అడ్డుపడుతున్నాయని జగదీష్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. అభివృద్ధికి అడ్డుపడే వారికి ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.ఇవి దుమారం రేపాయి. ఈ అంశంపై రాజ్ భవన్ స్పందించింది. నూతన సచివాలయ ప్రారంభోత్సవానికి సంబంధించి గవర్నర్‌కు ఆహ్వానం అందలేదని రాజ్‌భవన్ స్పష్టం చేసింది. ఇంకా చదవండి
చంద్రబాబు తిరుపతి పర్యటన వాయిదా
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతి పర్యటన వాయిదా పడింది. ఈ నెల 2, 3, 4 తేదీల్లో జరగాల్సిన బాబు పర్యటన రెండు రోజుల పాటు వాయిదా పడింది. వర్షాల కారణంగా తిరుపతి జిల్లాలో బాబు తన పర్యటనను రెండ్రోజులు వాయిదా వేసుకున్నారు. ఈ నెల 4 వ తేదీ నుండి మూడ్రోజుల పాటు తిరుపతి జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ మేరకు టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయ వర్గాలు ప్రకటించాయి. మే 4వ తేదీన సూళ్లూరుపేట, 5న గూడూరు, 6న వెంకటగిరి నియోజకవర్గాల్లో బాబు పర్యటిస్తారు. 'ఇదేం కర్మ మన రాష్ట్రానికి' పేరుతో నిర్వహించనున్న కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. రోడ్ షోలు నిర్వహిస్తారు. పలు ప్రాంతాల్లో ప్రసంగించనున్నారు. ఇంకా చదవండి





















