Telangana News : మళ్లీ గవర్నర్ వర్సెస్ తెలంగాణ ప్రభుత్వం - ఈ సారి సచివాలయ ప్రారంభోత్సవమే కారణం !
తెలంగాణ గవర్నర్, ప్రభుత్వం మధ్య మరోసారి వివాదం ఏర్పడింది. ఈ సారి జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు దీనికి కారణం అయ్యాయి.

Telangana News : తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య మరోసారి వివాదం ప్రారంభమయింది. అత్యంత వైభవంగా జరిగిన తెలంగాణ సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి గవర్నర్ హాజరు కాలేదు. అయితే ఆ విషయం ఎవరూ పట్టించుకోలేదు. పూర్తిగా మంత్రులు.. బీఆర్ఎస్ పార్టీ నేతల కోలాహలం మధ్యనే ఈ ప్రోగ్రాం జరిగింది. ఇతర పార్టీల నేతలకు ఆహ్వానం పంపారు కానీ తాము వెళ్లడం లేదని బండి సంజయ్, రేవంత్ రెడ్డి వంటి వారు ప్రకటించారు. రేవంత్ రెడ్డి సోమవారం సచివాలయానికి వెళ్లే ప్రయత్నం చేస్తే పోలీసులు ఆపేశారు. అయితే ఎవరూ రాకపోయినా బీఆర్ఎస్ నేతలు, మంత్రులు పట్టించుకోలేదు కానీ.. గవర్నర్ రాలేదంటూ తమిళిసై సౌందరరాజన్ పై మంత్రి జగదీష్ రెడ్డి విమర్శలు గుప్పించారు. మంత్రి విమర్శలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.
గవర్నర్ రాకపోవడంపై మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు
గవర్నర్ సచివాలయం ప్రారంభోత్సవానికి రావడం, రాకపోవడం అనేది ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. గవర్నర్ రాకపోవడం వల్ల జరిగే నష్టమేమీ లేదని, దీని వల్ల గవర్నర్ నిజస్వరూపం బయటపడిందని ఆరోపించారు. తెలంగాణ అభివృద్దిని చూసి కొంతమంది తట్టుకోలేకపోతున్నారని, గవర్నర్ రాకపోవడం కూడా అందులో భాగమేనని విమర్శించారు. ప్రతిపక్ష, విపక్ష పార్టీలు అభివృద్ధికి అడ్డుపడుతున్నాయని జగదీష్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. అభివృద్ధికి అడ్డుపడే వారికి ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.ఇవి దుమారం రేపాయి. ఈ అంశంపై రాజ్ భవన్ స్పందించింది. నూతన సచివాలయ ప్రారంభోత్సవానికి సంబంధించి గవర్నర్‌కు ఆహ్వానం అందలేదని రాజ్‌భవన్ స్పష్టం చేసింది.
అసలు ప్రభుత్వం ఆహ్వానమే పంపలేదన్న రాజ్ భవన్
రాజ్ భవన్ అసలు ఆహ్వానం పంపలేదని స్పష్టం చేస్తూంటే.. రాలేదని మంత్రి విమర్శలు చేయడం చర్చనీయాంశమవుతోంది. ఆహ్వానం పంపామని రాష్ట్ర ప్రభుత్వం అనడం తప్పు అని, గవర్నర్‌కు అసలు ఆహ్వానం ఇవ్వలేదని తెలిపింది. ఆహ్వానం రాకే గవర్నర్ సచివాలయ ప్రారంభోత్సవానికి వెళ్లలేదని రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు రాజ్‌భవన్ మంగళవారం ఓ నోట్ విడుదల చేసింది. రాజ్ భవన్ ప్రకటనపై ఇంకా మంత్రి జగదీష్ రెడ్డి కానీ.. ప్రభుత్వం కానీ స్పందించలేదు. ఆహ్వానం పంపి ఉంటే ఆ విషయాన్ని ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. ఒక వేల పంపకపోతే.. జగదీష్ రెడ్డి గవర్నర్ పై చేసిన విమర్శలకు ఇబ్బంది పడే అవకాశం ఉంది.
జగదీష్ రెడ్డి తొందరపడి విమర్శలు చేశారా ?
గవర్నర్ వర్సెస్ ప్రభుత్వం మధ్య ఎప్పటినుంచో విమర్శల యుద్దం కొనసాగుతోంది. మధ్యలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాజీ కుదిరిందని అనుకున్నారు కానీ.. తర్వాత యథావిధిగా వివాదాలు కొనసాగుతున్నాయి. బిల్లులు ఆమోదించకపోవడంపై సుప్రీంకోర్టులోనూ పిటిషన్ దాఖలు చేశారు. చివరికి గవర్నర్ బిల్లులు క్లియర్ చేశారు. ఇప్పుడీ ఆహ్వానం వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సి ఉంది.





















