Telangana Crop Loan Waiver: రైతులకు మంత్రి తుమ్మల గుడ్ న్యూస్, రుణమాఫీపై డేట్ ఫిక్స్ చేసిన ప్రభుత్వం
Crop Loan Waiver in Telangana | తెలంగాణలో త్వరలోనే రుణమాఫీ చేస్తామని, అయితే ఎక్కడా అప్పులు పుట్టడం లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోనియా గాంధీ పుట్టినరోజు నాటికి పూర్తి చేస్తామన్నారు.
Thummala Nageswara Rao: అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రూ. 2 లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. తెలంగాణలలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన 10 నెలలు పూర్తయినా పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలేదు. తొలుత పూర్తిగా రుణమాఫీ జరిగిందని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహా పలువురు మంత్రులు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం అదే తీరుగా మాట్లాడారు. కానీ విపక్షాలు లెక్కలు బయటపెట్టడం, మరోవైపు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ చెప్పిన లెక్కలు, బడ్జెట్ సమయంలో వెల్లడించిన రుణమాఫీ వివరాలు, జులై, ఆగస్టులో జరిగిన రుణమాఫీ లెక్కలు సరిపోలడం లేదు. దాంతో రూ.25 వేల కోట్ల రుణమాఫీ చేశామని, త్వరలోనే మిగతా అన్నదాతలకు సైతం రుణాలు మాఫీ అవుతాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు.
రైతులకు మంత్రి తుమ్మల గుడ్ న్యూస్
తెలంగాణలో రుణమాఫీ ప్రక్రియ ఇంకా ముగియలేదని, ప్రస్తుతానికి రూ.1 లక్ష రుణం వారికి పూర్తయిందని, రూ.1.5 లక్షల రుణాలున్న వారికి సైతం రుణమాఫీ జరిగిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆధార్ కార్డు వివరాలు, బ్యాంక్ ఖాతాలో వివరాలు లింకింగ్ సరిగా లేదని రైతులకు రుణాలు మాఫీ కాలేదన్నారు. తమది కేసీఆర్ లాంటి ప్రభుత్వం కాదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క సైతం రుణమాఫీ ప్రక్రియ ఇంకా ముగిసిపోలేదన్నారు.
దసరా తర్వాత రూ. 2 లక్షల రుణం వారికి రుణమాఫీ చేస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడా అప్పులు పుట్టడం లేదని, అందుకే పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయడం వీలు కాలేదన్నారు. డిసెంబర్ 9న సోనియా గాంధీ పుట్టినరోజును పురస్కరించుకుని ఆ సమయంలోపు రైతులకు రుణమాఫీ పూర్తవుతుందన్నారు. తుమ్మల చేసిన వ్యాఖ్యలు వీడియో రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
‘గత ప్రభుత్వం చర్యల కారణంగా రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. అయినా కూడా రైతులకు ఇచ్చిన హామీ కోసం రూ.25,000 కోట్ల రుణమాఫీ చేశాం. కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ పెంపులో స్వామినాథన్ కమిషన్ నివేదికను కూడా పట్టించుకోలేదు. రుణమాఫీ ప్రక్రియ పూర్తయిందని రైతులు ఆందోళన చెందవద్దు. బీఆర్ఎస్, బీజేపీలు రైతులకు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో అన్నదాతలు ఎన్నిటికీ మరిచిపోరు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఆరు గ్యారంటీలకు నెరవేర్చుతూ రాష్ట్రంలో సంక్షేమ పాలన అందిస్తోంది. పేదలకు ఇళ్లకు ఆర్థిక సాయం కోసం రూ.5 లక్షలు అందించడానికి ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం ఉత్తర్వులు సైతం జారీ చేశామన్నారు’ మంత్రి తుమ్మల.
రుణమాఫీపై వాళ్లది దుష్ప్రచారం: మంత్రి తుమ్మల
రుణమాఫీపై బీజేపీ, బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని రైతులు పట్టించుకోవద్దు అని అన్నదాతలకు మంత్రి తుమ్మల సూచించారు. తల తాకట్టు పెట్టయినా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భీమా అందిస్తుందని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో 2.5 మెగావాట్ల పవర్ ప్లాంట్ ను నిర్మించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులతో కలిసి శనివారం ప్రారంభించారు. ఆ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. రైతు రుణమాఫీ, రైతు బీమా కచ్చితంగా ఇస్తామని రైతులకు భరోసా ఇచ్చారు.