TS Raitu Bandhu KCR : వరి పంట వేస్తే "రైతు బంధు" నిలిపివేస్తారా !? .. కేసీఆర్ నిర్ణయంపై ఉత్కంఠ !
వరి పంట వేసే రైతులకు రైతు బంధు పథకం నిలిపివేస్తారన్న ప్రచారం తెలంగాణలో జరుగుతోంది. దీనిపై విస్తృతంగా చర్చ జరుగుతున్నా ఎలాంటి ప్రకటనా ప్రభుత్వం చేయలేదు.
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం రైతు బంధు పథకం నిధులను రైతుల ఖాతాల్లో 15వ తేదీ నుంచి జమ చేస్తారని అధికారవర్గాలు ప్రకటించాయి. అయితే అనూహ్యంగా ఆపేశాయి. పథకం అమలు ఇంకా ప్రారంభమవలేదు. యాసంగికి సంబంధించి రైతు బంధు పథకం నిధులు రైతుల ఖాతాల్లోకి డిసెంబర్ మొదటి వారంలోనే జమ చేస్తామని కేసీఆర్ చెప్పారు. కానీ ఇప్పటికీ ప్రారంభం కాకపోవడం వెనుక కీలక నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉండటమే కారణం అన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకూ రైతు బంధు పథకానికి ఎలాంటి ఆంక్షల్లేవు. కానీ తొలి సారిగా నిబంధనలు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం వరి పంట వేయవద్దని రైతుల్ని కోరుతోంది. ధాన్యం కొనుగోలుకు కేంద్రం అంగీకరించడం లేదని.. అందుకే వరి పంట వేయవద్దని ప్రభుత్వం కోరుతోంది. వాస్తవంగా రైతు బంధు అమలు ఇప్పటికే ప్రారంభం కావాలి. కానీ ఆపేశారు. ఆపేసిన కారణం కూడా చెప్పలేదు. నిధులు సర్దుబాటు కాకపోవడమే కారణమని అంచనా వేస్తున్నారు. పథకం అమలు కోసం దాదాపుగా రూ. ఏడున్నర వేల కోట్లు కావాలి. కానీ అంత పెద్ద మొత్తంలో సర్దుబాటు కాలేదని తెలుస్తోంది. ఇప్పుడు కోత విధించే ఆలోచన చేస్తున్నారు. వరి పంటను ఈ సారి 54 లక్షల ఎకరాల్లో వరి వేస్తారనే అంచనా ఉంది. అధికారులు ఎంత వద్దన్నా రైతులు మాత్రం తమకు తెలిసిన పంటనే వేస్తున్నారు. వరి వేయవద్దంటే రైతులు వినడం లేదని రైతుబంధును నిలిపివేస్తే ఆపుతారని కారణం చెబుతున్నారు.
Also Read: తెలంగాణలో కారుతో పొత్తుకు కామ్రెడ్లు సిద్ధమే..! వ్యూహాలు అమలు చేస్తున్న నేతలు
చివరకు 30 లక్షల్లో వరి సాగు చేసినా.. దాదాపుగా రూ. 1500 నుంచి రూ. 1800 కోట్ల వరకు ప్రభుత్వానికి మిగిలే అవకాశం ఉంది. ఇది ప్రభుత్వానికి ఆర్థిక వెసులుబాటు కల్పిస్తుంది. ప్రస్తుతం ఈ అంశంపై అధికారిక నిర్ణయం తీసుకోలేదు. కానీ ప్రభుత్వ వర్గాల్లో మాత్రం జోరుగా చర్చ సాగుతోంది. ఒక వేళ ఈ నిర్ణయం అమలు చేస్తే పంటలు వేయకుండా ఉన్న భూముల రైతులకు కూడా రైతు బంధు వస్తుంది కానీ.. ధాన్యం పండిస్తున్న వారికి రాదు.
Also Read: వరంగల్ కు జెన్పాక్ట్ ఐటీ కంపెనీ... మంత్రి కేటీఆర్ తో జెన్పాక్ట్ బృందం భేటీ...
ప్రభుత్వం లెక్కల ప్రకారం 19 శాతం భూముల్లో వ్యవసాయమే చేయడం లేదు. అయినా కూడా రైతు బంధు సాయం అందుతోంది. అసలు వదిలేయకుడా వరి పండించడమే నేరమన్నట్లుగా పరిస్థితి మార్చడం కేసీఆర్‌పై వ్యతిరేకత మరింత పెరగడానికి కారణం అవుతుంది. ఇప్పటికే రైతుల్లో కేసీఆర్ ప్రభుత్వంపై అసంతృప్తి ఉందన్న అభిప్రాయం ఉంది. ఇప్పుడు వరి పండించే వారికి రైతు బంధు నిలిపివేస్తే ప్రతిపక్షాలకు మరో అస్త్రం దొరికినట్లవుతుంది. మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.
Also Read: సోనియాతో డీఎస్ భేటీ.. త్వరలో కాంగ్రెస్‌లో చేరే అవకాశం !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి