Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఏర్పాటు - రేవంత్‌రెడ్డికి మరింత బలం !
తెలంగాణ ఎన్నికల కమిటీని హైకమాండ్ ఏర్పాటు చేసింది. రేవంత్ రెడ్డి చైర్మన్ గా ఉంటారు.
Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కమిటీని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రకటించింది. మొత్తం ఇరవై ఆరు మంది సభ్యులు.. ముగ్గురు ప్రత్యేక ఆహ్వానితులతో కమిటీ ఏర్పాటయింది. ఈ కమిటీకి కూడా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చైర్మన్ గా ఉంటారు. ఇతర సీనియర్ నేతలందరికీ చోటు కల్పించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కూడా ఇందులో అవకాశం లభించింది.
Hon'ble Congress President has approved the proposal for the constitution of Pradesh Election Committee for ensuing Assembly Elections in Telangana-2023, as follows, with immediate effect. pic.twitter.com/lz6KZK41j3
— Telangana Congress (@INCTelangana) July 20, 2023
ఉచిత విద్యుత్ పై రేవంత్ వ్యాఖ్యల తర్వాత ఆయనపై గురి పెట్టిన సీనియర్లు
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అందరూ ఐక్యంగా కనిపిస్తున్నట్లున్నారు కానీ అంతర్గతంగా విబేధాలు మాత్రం తీవ్రంగా ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవల అమెరికాలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ వివాదాస్పదం చేసిన క్రమంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మల్లు భట్టి విక్రమార్క వంటి నేతలు పరోక్షంగా రేవంత్ రెడ్డిని తప్పు పట్టారు. ఆయన టీడీపీ నుంచివచ్చిన నేత అంటూ.. బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలకు సింక్ అయ్యేలా కామెంట్లు చేయడం కలకలం రేపింది. అయితే తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి సర్దుకున్నారు. ఆ విషయాన్ని పక్కన పెట్టి.. ఇరవై నాలుగు గంటల కరెంట్ రావడం లేదన్న అంశంపై మాట్లాడుతున్నారు. తాజాగా బుధవారం కోమటిరెడ్డి ఇంట్లోనే ముఖ్య నేతలంతా సమావేశమై చేరికలపై చర్చించారు.
హైకమాండ్‌కు రేవంత్‌పై వరుస ఫిర్యాదులు చేసినట్లుగా ప్రచారం
అయితే అంతర్గతంగా రేవంత్ రెడ్డి వల్ల పార్టీకి నష్టం జరుగుతోందని కొంత మంది హైకమాండ్‌కు ఫిర్యాదులు చేశారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆయనకు ప్రాధాన్యత తగ్గిస్తున్నారన్న అభిప్రాయామూ ఏర్పాడుతోంది. ఇలాంటి సమయంలో రేవంత్ రెడ్డినే ఎన్నికల కమిటీకి చైర్మన్ గా చేయడంతో.. హైకమాండ్‌కు ఆయనపై ఏ మాత్రం నమ్మకం తగ్గలేదని నిరూపితమయిందని రేవంత్ రెడ్డి వర్గీయులు అంటున్నారు. మొత్తం ఎన్నికల బాధ్యతను ఈ కమిటీనే చూస్తుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా సభ్యుడిగా ఉన్నప్పటికీ.. ఇతర సీనియర్లతో పాటు ఆయన సమానమని గుర్తు చేస్తున్నారు.
రేవంత్ పైనే పూర్తి స్థాయిలో నమ్మకం పెట్టుకున్న హైకమాండ్
ఎలా చూసినా కాంగ్రెస్ పార్టీలో వివాదాలన్నింటికీ ఈ ఎన్నికల కమిటీతో చెక్ పెట్టినట్లయిందన్న వాదన వినిపిస్తోంది. ఇక ఎవరూ రేవంత్ రెడ్డి మాటను జవదాటకూడదని.. ఆయన చెప్పే పార్టీ స్టాండ్ ప్రకారమే ముందుకు వెళ్లాలన్న సంకేతాల్ని పార్టీ హైకమాండ్ పంపిందని అంటున్నారు.