YSRTP : షర్మిల పార్టీకి దరఖాస్తులు కరవు - ఆసక్తి చూపని నేతలు !
షర్మిల పార్టీకి టిక్కెట్ల కోసం దరఖాస్తు చేసుకునేవారు కూడా తగ్గిపోయారు. అన్ని స్థానాల్లో అభ్యర్థుల్ని నిలబెట్టడంపై సస్పెన్స్ ఏర్పడుతోంది.

YSRTP : కాంగ్రెస్‌లో విలీన ప్రక్రియ తేలిపోవడతో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అన్ని స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. పోటీ చేయడానికి దరఖాస్తులు చేసుకోవాలని ఆహ్వానించారు. దరఖాస్తు కోసం ఒక్క రూపాయి కూడా ఫీజుగా నిర్ణయించలేదు. కానీ దరఖాస్తు చేసుకునేవారు పెద్దగా కనిపించడం లేదు. పట్టుమని యాభై స్థానాలకు కూడా ఇప్పటి వరకూ ఎవరూ దరఖాస్తు చేసుకోలేదని తెలుస్తోంది. పాలేరు నుంచి షర్మిల పోటీ చేస్తాననిప్రకటించారు. అభ్యర్థులు దొరకకపోతే విజయమ్మతో పాటు బ్రదర్ అనిల్ కుమార్ కూడా బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. వీరి పోటీపై ఇంకా క్లారిటీ రాలేదు. అలాగని అభ్యర్థులూ దొరకడం లేదు.
అసలు దరఖాస్తు చేసుకునేవారే లేకపోతే ఇక పోటీ దారులను వెతకడం అసాధ్యమన్న మాట వినిపిస్తోంది. తెలంగాణలో మొత్తం 119 నియోకవర్గాలు ఉండగా సగం స్థానాలకు కూడా దరఖాస్తులు అందకపోతే ఏం చేయాలన్నదానిపై షర్మిల ఆలోచన చేస్తున్నారు. పార్టీ ప్రకటన తర్వాత పాదయాత్ర చేసిన షర్మిల పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టలేకపోయారు. ముఖ్య నేతలంటూ ఎవరూ లేరు. కనీసం నియోజకవర్గాల్లో కాస్తంత బలం ఉన్న వారు కూడా లేరు. తన పార్టీ బలంపై మితిమీరిన నమ్మకంతో 119 నియోజకవర్గాలకు పోటీ చేస్తానని ప్రకటించారు. ఇప్పుడు అభ్యర్థుల కోసం వెదుక్కోవాల్సిన అవసరం ఏర్పడింది.
దరఖాస్తులు, పోటీ విషయం ఎలా ఉన్నా పార్టీలో షర్మిల ఒక్కరే పోటీకి సిద్ధంగా ఉన్నట్లు ప్రస్తుత పరిస్థితులు సూచిస్తున్నాయి. పార్టీ ఆవిర్భావమప్పుడే తాను ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు షర్మిల. ఆ తర్వాత సికింద్రాబాద్, మిర్యాలగూడ అంటూ ప్రతిపాదనలు వచ్చినా షర్మిల పాలేరుపైనే మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు. ఇక, షర్మిల భర్త బ్రదర్ అని, తల్లి విజయమ్మల పోటీ పైనా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. వీరు పోటీ చేసినా చేయకపోయినా పరిస్థితులు ఇలానే కొనసాగితే ఎన్ని చోట్ల నుంచి పోటీ చేస్తారనే దానిపై నిర్ణయం తీసుకోవాల్సిఉంటుంది. అయితే ఇతర పార్టీల్లో టిక్కెట్లు రాని వారు తమ పార్టీ వైపు చూస్తున్నారని ఆ పార్టీ నేతలు ప్రకటించుకున్నారు.
ఎన్నికల్లో @YSRTelangana ప్రభంజనం సృష్టిస్తుంది
— YSR Telangana Party (@YSRTelangana) October 18, 2023
-బీఫామ్ ల కోసం పార్టీకి భారీగా దరఖాస్తులు
-YSRTP వైపు ఇతర పార్టీల్లో టికెట్ రాని అభ్యర్థుల చూపు
-మరికొద్ది రోజుల్లో పార్టీ అభ్యర్థుల ప్రకటన
-త్వరలో రాష్ట్రమంతా YS షర్మిల గారి పర్యటన
-రాష్ట్ర అధికార ప్రతినిధి పిట్ట రాంరెడ్డి గారు pic.twitter.com/Sebu75Np7l
దరఖాస్తుల స్వీకరణకు డెడ్ లైన్ ప్రకటించనందున నామినేషన్ల గడువు పూర్తయ్యే వరకు దరఖాస్తుల స్వీకరణకు సమయం ఉందని, ఆలోగా దరఖాస్తు చేసుకున్న వారికి టికెట్లు ఇస్తామని షర్మిల పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే పార్టీ నుంచి ఎంతో కొంత ఆర్థిక సాయం వస్తందన్న ఆశతో కొంత మంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. కానీ అలాంటి సాయాలు చేసే ఉద్దేశం లేదని చెబుతున్నారు. మొత్తంగా షర్మిల రాజకీయ పయనం అనుకున్నంత సులువుగా సాగడం లేదు. ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో పోటీ చేయగలగుతారో కూడా స్పష్టత లేకుండా పోయింది.





















