Singareni Joshi : సింగేరణి ప్రైవేటీకరణ అబద్దం - బొగ్గు గనుల వేలం ఆదాయం రాష్ట్రానికేనన్న కేంద్రం !
బొగ్గు గనుల వేలం వల్ల వచ్చే ఆదాయం రాష్ట్రానికే వస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. సింగరేణి ప్రైవేటీకరణపై ఎంపీలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి విమర్శించారు.
Singareni Joshi : సింగరేణి ప్రైవేటీకరణ అనేది పచ్చి అబద్దమని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. తెలంగాణ ఎంపీల ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, అర్థరహితమని కేంద్ర బొగ్గుశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి లోక్‌సభలోనే ప్రకటన చేశారు. సింగరేణి కాలరీస్‌లో రాష్ట్ర ప్రభుత్వ వాటా 51% ఉన్నప్పుడు 49% వాటా కల్గిన కేంద్రం ప్రైవేటీకరణ చేయడం సాధ్యం కాదని జోషి తన ప్రకటనలో తెలిపారు. బొగ్గు గనుల కేటాయింపుల్లో పూర్తి పారదర్శకతతో నిర్వహిస్తున్న వేలం ప్రక్రియపై ఇప్పటి వరకు ఎక్కడా ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదని తెలిపారు. వేలం ప్రక్రియ ద్వారా బొగ్గు గనుల కేటాయింపులు జరుపుతున్న రాష్ట్రాలకు సైతం ప్రయోజన కలుగుతుందన్నారు. దీంతో అనేక రాష్ట్రాలు గనుల వేలానికి పూర్తిగా సహకరిస్తున్నాయన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు కానప్పటికీ చత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలు కూడా వేలం పద్ధతిని అందిపుచ్చుకున్నాయని తెలిపారు. వేలం ద్వారా వచ్చే ఆదాయం మొత్తం రాష్ట్రాలకే వెళ్తుందని.. బొగ్గు కుంభకోణాల్లో ఉన్నవాళ్లే పారదర్శక వేలం పద్ధతిని వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు.
కేంద్ర మంత్రి సింగరేణిపై ఈ ప్రకటన చేయడానికి కారణం కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణలో బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిమాండ్ చేయడం. తెలంగాణలోని నాలుగు బొగ్గు గనుల బ్లాకుల ప్రైవేటీకరణను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసి ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్ సీసీఎల్)కు కేటాయించాలని కాంగ్రెస్ ఎంపీ కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి లోక్‌సభలో కేంద్రాన్ని డిమాండ్ చేశారు. లోక్‌సభలో ఈ అంశాన్ని 'అత్యవసర అంశంగా లేవనెత్తిన ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కల్యాణఖని బ్లాక్-6, కోయగూడెం బ్లాక్-3, సత్తుపల్లి బ్లాక్- శ్రవనపల్లి నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేయడాన్ని తెలంగాణ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ఈ బొగ్గు బ్లాకులు 100 ఏళ్ల నాటి ప్రభుత్వ రంగ బొగ్గు గనుల సంస్థ ఎస్‌ఎస్‌సిఎల్‌కు చెందిన ప్రస్తుత బొగ్గు గనులతో కలిసి ఉన్నాయని ఆయన చెప్పారు. సింగరేణి ప్రభుత్వ రంగ మైనింగ్ సంస్థగా గత 20 ఏళ్లుగా నిరంతరాయంగా లాభాలను నమోదు చేసుకుంటుందన్నారు.
గత నెలలో తెలంగాణలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ చేయబోమని హామీ ఇచ్చారని ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం వేలం పాటకు ముందుకు వెళుతోందని తెలిపారు. ఈ బొగ్గు బ్లాకుల కేటాయింపు కోసం SCCL నుండి అభ్యర్థనలు అందాయని కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తన లిఖితపూర్వక సమాధానంలో అంగీకరించారని ఆయన చెప్పారు. కానీ తొలగించారన్నారు. 2021 డిసెంబర్ 15న నామినేటెడ్ అథారిటీ ద్వారా పైన పేర్కొన్న బొగ్గు బ్లాకుల వేలం జరిగిందని కూడా కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానంలో తెలియజేశారు. సత్తుపల్లి బ్లాక్-III, శ్రావణపల్లి మరియు కళ్యాణ్ ఖని బ్లాక్-6 కోసం వేలం రద్దు చేశారని.. ఈ బొగ్గు గనులను మళ్లీ వేలానికి పెట్టారని ఉత్తమ్ గుర్తు చేశారు.
పార్లమెంట్ బయట ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పలు ఆరోపణలు చేశారు కంపెనీలో తెలంగాణ ప్రభుత్వానికి 51 శాతం వాటా ఉండగా, మిగిలిన వాటా కేంద్రానికి ఉందన్నారు. అయితే, లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న ఎస్‌సిసిఎల్‌ను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మరియు తెలంగాణలోని టిఆర్‌ఎస్ ప్రభుత్వం దెబ్బతీస్తున్నాయి. తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధీనంలో ఉన్న కరీంనగర్‌లోని తాడిచెర్ల బొగ్గు గనిని టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీకి అప్పగించిందని మండిపడ్డారు.రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ఎస్‌సిసిఎల్ అవకాశాలను దెబ్బతీయడం ద్వారా బిజెపి, టిఆర్‌ఎస్ ప్రభుత్వాలు తెలంగాణ భవిష్యత్తును దెబ్బతీస్తున్నాయని కాంగ్రెస్ ఎంపి ఆరోపించారు. వీటన్నింటికీ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తన ప్రకటన ద్వారా సమాధానం ఇచ్చారు.