Telangna Elections 2023 : అఫిడవిట్ ప్రకారం కేసీఆర్ ఆస్తుల లెక్క ఇదిగో - 2018తో పోలిస్తే ఆశ్చర్యకర విషయాలు
కేసీఆర్ ఆస్తుల వివరాల్లో గణనీయమైన మార్పు వచ్చింది. తనకు ఒక్క ఎకరం కూడా భూమి లేదని అఫిడవిట్ లో కేసీఆర్ ప్రకటించారు.
Telangna Elections 2023 KCR Assests and Loans : తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ( KCR ) గురువారం అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో తన ఆస్తులు, అప్పులను ప్రకటించారు. గజ్వేల్ ( Gajwel ) , కామారెడ్డి నియోజకవర్గాల్లో కేసీఆర్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. చరాస్తులలో నగదు, డిపాజిట్లు, పెట్టుబడులు, రూ. 25.61 కోట్ల విలువైన బంగారం, వజ్రాలు, హెచ్‌యూఎఫ్‌లో రూ. 9.81 కోట్లతో కలిపి మొత్తం రూ.35.42 కోట్లకు చేరుకుంది. స్థిరాస్తుల్లో బంజారాహిల్స్‌లోని ఆయన నివాసం, కరీంనగర్‌లోని ఫామ్‌హౌస్, రూ.8.50 కోట్ల విలువైన భూములు, హెచ్‌యూఎఫ్‌లో రూ.15 కోట్లతో కలిపి మొత్తం రూ.23.50 కోట్లకు చేరుకుంది.
కేసీఆర్ పేరిట వాహనాలేమీ లేవు. మొత్తం రూ. 17,40,000 విలువ చేసే 3 కిలోల బంగారం, వజ్రాలు, రత్నాలు ఆయన వద్ద ఉన్నాయి. శోభ పేరిట 2,841 గ్రాముల (2 కేజీల 800 గ్రాముల) బరువైన బంగారు ఆభరణాలున్నాయి. 45 కేజీల వెండి వస్తువులున్నాయి. వీటన్నిటి మొత్తం విలువ రూ. 1,49,16,408గా పేర్కొన్నారు. కేసీఆర్ భార్య శోభకు బ్యాంకులలో రూ. 6,29,08,404 ఉన్నాయి. తెలంగాణ బ్రాడ్‌కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో రూ. 2,31,00,000 విలువైన వాటాలు.. తెలంగాణ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో రూ. 4,16,25,000 విలువైన వాటాలు ఉన్నాయని కేసీఆర్ పేర్కొన్నారు.
మొత్తంగా కేసీఆర్ పేరిట చరాస్తులు రూ. 17,83,87,492 ఉండగా, ఆయన భార్య శోభ పేరిట రూ. 7,78,24,488 ఉన్నాయి. ఇక, కేసీఆర్ హిందూ అవిభాజ్య కుటుంబానికి రూ. 9,81,19,820 మేర చరాస్తులున్నాయి. స్థిరాస్తుల విషయానికొస్తే కేసీఆర్ పేరిట రూ. 8.5 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉండగా ఆయన భార్య పేరిట ఏమీ లేవు. కేసీఆర్ దంపతులకు స్థిర, చరాస్తులన్నిటి మొత్తం విలువ రూ. 58,93,31,800. మొత్తం అప్పులు రూ. 24,51,13,631 ఉన్నాయని అఫిడవిట్‌లో ( Election Affidavit ) పేర్కొన్నారు.
2018 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అఫిడవిట్ లో ముఖ్యమంత్రి మొత్తం చరాస్తుల విలువ ₹ 10.40 కోట్లు . స్థిరాస్తులు ₹ 12.20 కోట్లు. స్థిరాస్తుల్లో సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ బ్లాక్ ఎర్రవెల్లి గ్రామంలోని 54 ఎకరాల వ్యవసాయ భూమిని చూపించారు. దీని విలువ ₹ 6.50 కోట్లు. అతనికి హైదరాబాద్‌లో, కరీంనగర్‌లో మరో ఇల్లు ను చూపించారు. తన కుమారుడు కెటి రామారావు నుండి ₹ 82.87 లక్షలు మరియు అతని కోడలు శైలిమ నుండి ₹ 24.60 లక్షలు సహా, పూచీకత్తు లేని రుణాల రూపంలో తనకు ₹ 8.88 కోట్ల వరకు అప్పులు ఉన్నాయని కేసీఆర్ ప్రకటించారు . ఇప్పుడు అఫిడవిట్‌లో గణనీయమైన మార్పులు వచ్చాయి. భూమిని కుటుంబ ఆస్తిగా చూపించారు.