Yadadri temple: యాదాద్రి ఆలయానికి రికార్డ్ స్థాయిలో ఆదాయం, ఆదివారం ఒక్కరోజే రూ. 1.09 కోట్లు!
Yadadri temple: యాదాద్రి ఆలయానికి రికార్డు స్థాయిలో ఆదివారం ఒక్కరోజే రూ.1.09 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే కోటి రూపాయలు దాటడం ఇదే మొదటి సారి అని ఆలయ అధికారులు తెలిపారు.
Yadadri temple: యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. ఆదివారం ఒక్కరోజే రూ. 1.09 కోట్ల ఆదాయం నెలకొనగా.. ఆలయ చరిత్రలో తొలిసారి కోటి రూపాయలు దాటిందని ఆలయ అధికారులు చెప్పారు.
యాదాద్రికి పోటెత్తిన భక్తులు…
యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో పాటు కార్తిక మాసం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చారు. దీంతో స్వామివారి ఉచిత దర్శనానికి దాదాపు 6 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు 3 గంటల సమయం పడుతోంది. బ్రేక్ దర్శనానికి సైతం భక్తులు అధిక సంఖ్యలో వెళ్లారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. లడ్డు ప్రసాదం కౌంటర్లు, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కల్యాణ కట్ట ప్రాంతాల్లో భక్తుల సందడి నెలకొంది. కార్తిక మాసం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించుకుని దీపారాధన పూజల్లో పాల్గొన్నారు.
ఇటీవలే యాదాద్రికి వచ్చిన సీఎం కేసీఆర్ ఫ్యామిలీ..
యాదాద్రి ఆలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని సీఎం కేసీఆర్, ఆయన సతీమణి శోభ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా దర్శనానికి వచ్చిన కేసీఆర్‌కు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఘనస్వాగతం పలికారు. ప్రత్యేక పూజలకు వెళ్లే ముందు యాదాద్రి కొండకు దిగువన ఉన్న ప్రెసిడెన్షియల్ సూట్‌లో వైటీడీఏ అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష జరిపారు. యాదాద్రి ఆలయ విమాన గోపురానికి బంగారం తాపడం కోసం విరాళాలివ్వాలని గత అక్టోబర్‌లో కేసీఆర్ పిలుపునిచ్చారు. తాను స్వయంగా కేజీ బంగారన్ని ప్రకటించారు. కేసీఆర్ పిలుపు మేరకు వ్యాపార వేత్తలు, ప్రముఖులు ముందుకు వచ్చి కిలోల కొద్దీ బంగారాన్ని విరాళంగా ఇచ్చారు.
యాదాద్రి ఆలయ విమాన గోపురానికి 125 కిలోల బంగారంతో తాపడం చేయించాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఇందుకు విరాళాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ యాదాద్రిలో పిలుపునిచ్చారు. తన కుటుంబం తరఫున కిలో 16 తులాల బంగారం ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. ఆ విరాళాన్ని కేసీఆర్ ఇప్పుడు సమర్పించారు. సామాన్య ప్రజలు కూడా విరాళాలిస్తున్నారు. విరాళాల సేకరణ కోసం యాదాద్రి ఆలయ ఆఫీసర్లు ప్రత్యేక బ్యాంక్ అకౌంట్ నంబర్ ను తీసుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత యాదాద్రిని అద్భుతంగా అభివృద్ది చేశారు కేసీఆర్. ఆలయ ప్రారంభోత్సవం కూడా ఇటీవలే్ జరిగింది.
హరిత పుణ్యక్షేత్రానికి అరుదైన గౌరవం
అంతేకాదండోయ్ ఇటీవలే 2022 - 25 సంవత్సరాలకు గాను ప్రతిష్టాత్మక గ్రీన్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ గుర్తింపును కైవసం చేసుకుంది. 40 శాతం పచ్చదనంతో విద్యుత్తు వినియోగాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించేలా యాదాద్రి ఆలయాన్ని నిర్మించగా.. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్(ఐజీబీసీ) ఈ గుర్తింపును ఇచ్చింది. భారత పరిశ్రమల సంఖ్య (సీఐఐ) అనుబంధ సంస్థ అయిన ఐజీబీసీ నిర్మాణ రంగంలో హరిత విధానాలను ప్రోత్సహించడం ద్వారా పర్యావరణాన్ని సమతుల్యంగా ఉంచేందుకు గాను కృషి చేస్తోంది. 2025 నాటికి ప్రపంచంలో అత్యుత్తమ పర్యావరణ అనుకూల నిర్మాణాలు జరిపే దేశాల సరసన భారత్ ను నిలపాలని ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్(ఐజీబీసీ) లక్ష్యంగా పెట్టుకుంది.