Revanth Reddy: ఇక కేసీఆర్ స్లీపింగ్ కేటీఆర్ వర్కింగ్... కమీషన్ల కోసమే కాళేశ్వరం... టీఆర్ఎస్ ప్లీనరీపై రేవంత్ హాట్ కామెంట్స్
టీఆర్ఎస్ ప్లీనరీపై రేవంత్ రెడ్డి ఘాటైన విమర్శలు చేశారు. టీఆర్ఎస్ ప్రస్థానం అవినీతి దృశ్యంగా మారిందన్నారు. కమీషన్ల కోసమే కాళేశ్వరం నిర్మిస్తున్నారని ఆరోపించారు.
టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీపై టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి స్పందించారు. జలదృశ్యం నుంచి జనదృశ్యం అని ఆ పార్టీ నేతలు చెబుతున్నారని, కానీ ఉద్యమం ముసుగులో గులాబీ పార్టీని విస్తరించారని రేవంత్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ లో ఎక్కడ చూసిన టీఆర్ఎస్ జెండాలే కనిపిస్తున్నాయని, సామాన్య ప్రజలు నగరంలో టులెట్ బోర్డ్ పెడితే జీహెచ్ఎంసీ 2 వేల జరిమానా వేసిందన్నారు. నగరంలో మరి ఇప్పుడు టీఆర్ఎస్ నేతలకు ఎంత ఫైన్ వేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేత విగ్రహాలకు సైతం టీఆరెఎస్ జెండాలు కట్టారన్నారు. ప్లీనరీలో తెలంగాణ అమర వీరులను కూడా స్మరించుకోలేదన్నారు. జల దృశ్యంలో మొదలైన టీఆర్ఎస్ ప్రస్థానం అవినీతి దృశ్యంగా దోపిడీ దృశ్యంగా మారిందని విమర్శించారు.
తెలంగాణ తల్లికి బదులు తెలుగు తల్లి
టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో తెలంగాణ తల్లి కాకుండా తెలుగు తల్లిని ఫ్లేక్సీ పెట్టారని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ తల్లిని కాదని తెలుగు తల్లికి పెద్ద పీట వేశారన్నారు. ఆంధ్రా కాంట్రాక్టర్ల కోసమే వేదికపై తెలుగు తల్లిని పెట్టారని విమర్శించారు. మొదటి నుంచి టీఆర్ఎస్ లో ఉన్న వాళ్లు, రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరులు గుర్తురాలేదన్నారు. 2001 జలదృశ్యంలో మొదలైన టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు రూ.వేల కోట్లకు ఎగపాకిందని విమర్శించారు. కొండా లక్ష్మణ్ బాపు, బియ్యాల జనార్దన్ రావు, జయశంకర్, కేశవరావు, గుడ అంజయ్య, సాంబశివుడు, రహ్మాన్, చివరి నిమిషం వరకు కేసీఆర్ కోసం పనిచేశారన్నారు. గాదె ఇన్నయ్య, పాశం యాదగిరి, పాపారావు, విజయ రామరావు, ఆలే నరేంద్ర, విజయశాంతి.. ఎవర్ని గుర్తు చేసుకోలేదని విమర్శించారు.
Also Read: ప్లీనరీ నుంచే కేసీఆర్ హుజురాబాద్ ప్రచారం ! ఎన్నికల సంఘంపై ఆగ్రహం వెనుక అసలు కారణం..
ఏడున్నర ఏళ్ల పాలనపై చర్చకు సిద్ధమా..!
కేసీఆర్, కేటీఆర్ ఇద్దరి బొమ్మలే ప్లీనరీలో పెట్టుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఏడున్నర ఏళ్ల పాలనపై చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక, విద్యార్థులకు స్కాలర్ షిప్ లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేజీ టు పీజీ వరకు ఉచిత విద్యపై చర్చకు సిద్ధమా అన్నారు. ఓయూకు ఎంత నిధులు కేటాయించారో తెలపాలన్నారు. యువతను ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో ప్రాణాలు తీసుకుంటున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. కొత్తలో లక్ష 7 వేల ఖాళీలున్నాయని కేసీఆర్ చెప్పారని, బిశ్వల్ కమిటీ రిపోర్ట్ కూడా లక్ష 91 వేల ఉద్యోగాలు ఖాళీలున్నాయని చెప్పిందన్నారు. సింగరేణి, విద్యుత్, ఆర్టీసీ, నిరుద్యోగుల సమస్యలపై కవులు, కళాకారులు, జర్నలిస్టులు, తెలంగాణ సమాజం అంతా కలిసి పోరాటం చేశాలని కోరారు. ఉద్యమకారులపై పెట్టిన కేసులు ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు. కల్వకుంట్ల కవిత, కేటీఆర్, కేసీఆర్ పై పెట్టిన కేసులు తొలగించుకున్నారని విమర్శించారు.
కమీషన్ల కోసమే కాళేశ్వరం
అమర వీరుల కుటుంబాలను సీఎం కేసీఆర్ పట్టించుకోలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఎందుకు న్యాయం చేయలేదని ప్రశ్నించారు. 1500 కుటుంబాలను ఆదుకుంటామని అని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన కేసీఆర్... ఉద్యమ అమరులకు ఏంచేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కమీషన్ల కోసమే కట్టిన కాళేశ్వరం వల్ల ఒక్క ఎకరానికి కూడా నీరందలేదని విమర్శించారు. తెలంగాణ వచ్చాక రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర సర్కార్ ల విధానాలతో 40 వేల మంది రైతులు చనిపోయారని రేవంత్ రెడ్డి తెలిపారు. పార్టీ కార్యాలయాల పేరుతో సీఎం కేసీఆర్ రూ.1000 కోట్ల ఆస్తులను సంపాదించుకున్నారని విమర్శించారు. ఫిక్సిడ్ డిపాజిట్లు రూ.420 కోట్లు ఉన్నాయంటే.. అవి ఎలా వచ్చాయని ప్రశ్నించారు. టీఆర్ఎస్ బైలాస్ మార్చారంటే కేసీఆర్ స్లీపింగ్ కేటీఆర్ వర్కింగ్ అని భవిష్యత్ ముఖ చిత్రం తెలుస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు.
Also Read: టీఆర్ఎస్‌లో అసలు "వర్క్" అంతా కేటీఆర్‌దే ! ప్లీనరీ సక్సెస్‌తో మరోసారి పట్టు నిరూపించుకున్న యువనేత !