Telangana Elections: రాత్రి 10 తర్వాత అవి బంద్, సీఈఓ వికాస్ రాజ్ కీలక సూచనలు
Telangana Elections: నేటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని, అభ్యర్థులు ప్రకటనలు ఇచ్చుకోవాలంటే ముందస్తు అనుమతి తీసుకోవాలని సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు.
Telangana Elections: తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లకు అనుమతి లేదని, ప్రభుత్వ వెబ్‌సైట్లలో నాయకుల ఫొటోలు తొలగించాలని స్పష్టం చేశారు. మహిళ, యువత కోసం ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, అన్ని పోలింగ్ కేంద్రాల్లో బెయిలీ బ్యాలెట్ పత్రాలు అందుబాటులో ఉంచామని చెప్పారు. ఏమైనా సమస్యలు ఉంటే 1950 నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. అభ్యర్థులు ప్రకటనలు ఇచ్చుకునే ముందు ముందస్తు అనుమతి తప్పనిసరి అని, నగదు లావాదేవీలు, మద్యం సరఫరాలపై పూర్తి పర్యవేక్షణ ఉంటుందని వికాస్ రాజ్ పేర్కొన్నారు.
అక్టోబర్ 31 వరకు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వికాజ్ రాజ్ సూచించారు. ఓటు వేయడంలో వయోవృద్దులకు సాయం చేయడానికి వాలంటీర్లను పెడుతున్నామని, ఎన్నికల అక్రమాలపై సీ విజిల్ యాప్‌లో ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన క్రమంలో సోమవారం సాయంత్రం వికాస్ రాజ్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా పార్టీలు, ఓటర్లకు పలు కీలక విషయాలు వివరించారు. ఓటర్ల అడ్రెస్ మార్పు అప్లికేషన్లను నేటి నుంచి వాయిదా వేస్తున్నామన్నారు. ఓటర్ గుర్తింపు కార్డుకు ప్రత్యామ్నాయంగా 12 రకాల గుర్తింపు కార్డులను ఓటర్లు వినియోగించుకోవచ్చన్నారు. అభ్యర్థులు నామినేషన్ వేసే సమయంలో అన్ని వివరాలను నింపాలని, లేకపోతే తిరస్కరిస్తామని తెలిపారు.
అభ్యర్థుల దగ్గన నగదు ఉంటే వాటికి సంబంధించిన వివరాలను చూపించాల్సి ఉంటుందని వికాస్ రాజ్ తెలిపారు. బ్యాలెట్ పత్రాలపై గుర్తులతో పాటు అభ్యర్థుల ఫొటోలు కూడా ఉంటాయని వికాస్ రాజ్ స్పష్టం చేశారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా సమస్మాత్మక ప్రాంతాలు, పోలింగ్ కేంద్రాలను గుర్తిస్తున్నామని, దీనిపై కసరత్తు జరుగుతోందని అన్నారు. ఇక్కడ భారీ భద్రత ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రత్యేక ఓటర్లకు రవాణాతో పాటు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల ఖర్చు మానిటరింగ్ కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ఉపయోగిస్తామని, నిబంధనలను ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు ఉంటాయని వికాస్ రాజ్ హెచ్చరించారు. నగదును ఎవరైనా తీసుకెళ్లే సమయంలో దానికి సంబంధించి పత్రాలు, వివరాలు వారి దగ్గర ఉంచుకోవాలని వికాస్ రాజ్ సూచించారు.
మధ్యప్రదేశ్, రాజస్ధాన్, మిజోరం, ఛత్తీస్‌గడ్‌తో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ను ఇవాళ సీఈసీ విడుదల చేసింది. ఒకే విడతలో తెలంగాణ ఎన్నికల పోలింగ్ జరగనుంది. నవంబర్ 30 పోలింగ్ జరగనుండగా.. డిసెంబర్ 3న తెలంగాణ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఎన్నికల షెడ్యూల్ రావడంతో పార్టీలన్నీ సన్నద్దమవుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి ప్రచారాన్ని కూడా ముమ్మరం చేయగా.. కాంగ్రెస్, బీజేపీ ఇంకా అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తవ్వగా.. బీజేపీ కూడా తొలి అభ్యర్థుల జాబితాను త్వరలో విడుదల చేయనుంది. ఇక కాంగ్రెస్‌తో వామపక్షాల పొత్తు ఉంటుందనే ప్రచారం జరుగుతుండగా.. వైఎస్సార్‌టీపీ ఒంటరిగా పోటీలోకి దిగనుంది. త్వరలో షర్మిల కూడా దీనిపై ప్రకటన చేయనున్నారు.