(Source: ECI/ABP News/ABP Majha)
Telangana Rains: తెలంగాణ భారీ వర్షాలపై సీఎస్ అత్యవసర సమావేశం, అధికారులకు కీలక ఆదేశాలు - సిద్ధంగా NDRF టీమ్‌లు
తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో తెలంగాణ సీఎస్ శాంత కుమారి అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు.
తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో తెలంగాణ సీఎస్ శాంతి కుమారి అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అధికారులతో చర్చించారు.
రానున్న 48 గంటల్లో ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా స్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాతావరణ అధికారులు హెచ్చరికల నేపథ్యంలో జిల్లా స్థాయి ఉన్నతాధికారులు ఆయా జిల్లాల్లోని వివిధ అధికారులతో సమన్వయం చేసుకొని పరిస్థితులను ఎదుర్కొని ఎందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.
ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధం
ఉమ్మడి మెదక్ ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని దానితోపాటు దక్షిణ తెలంగాణలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని సీఎస్ తెలిపారు. వరంగల్, ములుగు, కొత్తగూడెం జిల్లాలో ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మొహరించినట్లు చెప్పారు. అత్యవసర సమయంలో వారికి సహాయం అందించడానికి మరో 40 మందితో బృందాలను హైదరాబాదులో సిద్ధం చేసినట్లు చెప్పారు.
ఎలాంటి నష్టం లేదు
వర్షాలు కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు ఎలాంటి నష్టం జరగలేదని రోడ్లు, చెరువులు, కుంటలకు ఎటువంటి నష్టం జరగలేదని గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి మెరుగ్గా ఉందని సీఎస్ వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లలో 50% నీరు ఉందని భారీ వర్షాలు వరదలతో ఇప్పటివరకు ఎటువంటి సమస్య లేదని సిఎస్ పేర్కొన్నారు.
ప్రమాదకరంగా గోదావరి ఉధృతి
విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చెరువులు, నదులు, కుంటల వద్ద ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. భద్రాచలం వద్ద ప్రస్తుతం 41.3 అడుగుల వద్ద గోదావరి ప్రవాహం ఉందని, ఈరోజు రాత్రికి ప్రమాద స్థాయికి చేరుకునే అవకాశం ఉందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు వ్యవసాయానికి ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్‌తో వరదల గురించి సీఎస్ ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు.
హైదరాబాద్ కోసం 426 బృందాలు
హైదరాబాద్‌లో వర్షాలను ఎదుర్కొనేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు GHMC కమిషనర్ రోనాల్డ్ రాస్ సీఎస్‌కు వివరించారు. గ్రేటర్ హైదరాబాద్ లో 339 వాటర్ లాగిన్ పాయింట్లు ఉన్నాయని వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించేలా 426 అత్యవసర బృందాలు, 157 స్టాటిక్ బృందాలు సిద్ధం చేసినట్లు కమిషనర్ వివరించారు.
సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ అధర్ సింహ, రజత్ కుమార్, సునీల్ శర్మ, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్, సింగరేణి CMD శ్రీధర్, డిజాస్టర్ మేనేజ్మెంట్ సెక్రటరీ రాహుల్ బొజ్జ, అగ్రికల్చర్ సెక్రటరీ రఘునందన్ రావు, డిజాస్టర్ మేనేజ్మెంట్ DG నాగిరెడ్డి, GAD సెక్రెటరీ శేషాద్రి, GHMC కమిషనర్ రొనాల్డ్ రాస్, పంచాయతీరాజ్, ట్రాన్స్‌కో, ఇరిగేషన్, రోడ్ల నిర్మాణ శాఖ అధికారులు పాల్గొన్నారు.