Road Accident: మిర్యాలగూడలో నెత్తురోడిన రోడ్డు... ఆగివున్న లారీని ఢీ కొట్టిన ట్రావెల్స్ బస్సు... ముగ్గురు మృతి, 15 మందికి గాయాలు
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.
తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మిర్యాలగూడలోని చింతపల్లి హైవే వద్ద ఆగి ఉన్న లారీని ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో 15 మంది గాయపడ్డారు. ఈ బస్సు ఏపీలోని ఒంగోలు నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని మిర్యాలగూడలోని ఆసుపత్రికి తరలించారు.
15 మందికి గాయాలు
నల్గొండ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మిర్యాలగూడ హైవేపై ఆగివున్న లారీని వేగంగా వచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. తెల్లవారుజాము 2 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు సంఘటనా స్థలంలో దుర్మరణం పాలయ్యారు. మరొకరు ఆసుపత్రిలో ప్రాణాలు వదిలారు. ఈ ప్రమాదంలో సుమారు 15 మందికి గాయాలయ్యాయి. స్థానికుల సహాయంతో క్షతగాత్రులను పోలీసులు మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఐదుగురిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. లారీని బస్సు బలంగా ఢీకొట్టడంతో సీట్ల మధ్యలో ప్రయాణికులు ఇరుక్కుపోయారు. వారిని పోలీసులు అతి కష్టం మీద బయటకు తీయగలిగారు.
దాచేపల్లి వద్ద తృటిలో తప్పిన ప్రమాదం
ఈ ప్రమాదంలో మృతులను మల్లికార్జున్, నాగేశ్వరరావు, జయరావుగా పోలీసులు గుర్తించారు. శ్రీకృష్ణ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఒంగోలు నుంచి హైదరాబాద్ వస్తున్న సమయంలో ప్రమాదానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే లారీని ఢీకొట్టినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదానికి ముందు దాచేపల్లి వద్ద ఓ ఆటోను ఢీకొట్టబోయి తృటిలో ప్రమాదం తప్పిందని ప్రయాణికులు అంటున్నారు. ఈ బస్సులో మొత్తం 30 మంది ప్రయాణిస్తున్నారు. నిద్రమత్తుతో ఉన్న డ్రైవర్‌ను పదే పదే అప్రమత్తం చేసినా అతడు డ్రైవింగ్ కొనసాగించాడని ప్రయాణికులు అంటున్నారు. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.