BJP Vs TRS Political Heat : ఎంపీ అర్వింద్ పై దాడి- బీజేపీకి గుణపాఠమా? టీఆర్ఎస్ కు హెచ్చరికా?
BJP Vs TRS Political Heat : ఎంపీ ధర్మపురి అర్వింద్ పై దాడితో తెలంగాణలో మళ్లీ రాజకీయ హీట్ మొదలైంది. అయితే ఈ దాడి బీజేపీకే గుణపాఠం, అధికారపార్టీకి హెచ్చరిక లాంటిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
BJP Vs TRS Political Heat : నిజామాబాద్ ఎంపీ అర్వింద్ పై దాడి ఘటన మరోసారి తెలంగాణలో రాజకీయ హీట్ పెంచాయి. అధికార-విపక్షాల మధ్య మరోసారి చిచ్చురేపాయి. ఇందుకు కారణం మీరంటే మీరని ఇరు పార్టీలు ఆరోపణలు చేసుకుంటున్నాయి. అసలు ఎంపీపై దాడి చేసింది ఎవరు. ఎందుకు చేశారన్న ప్రశ్నలపై రాజకీయ విశ్లేషకులు రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి.
ఎంపీ అర్వింద్ పై దాడి
ప్రజా సమస్యలపై స్పందించాల్సిన రాజకీయ నాయకులు ఆ విషయాలను అడ్డు పెట్టుకొని తిట్టుకోవడమే సరిపోతోంది కానీ ఎన్నుకున్న ప్రజలను పట్టించుకున్న దాఖలాలు లేకుండా పోతుందని రాజకీయ విశ్లేషకులు ఉంటున్నారు. అందుకే నేతల మాటల్లోని ఫైర్ ని ఫాలో అవుతున్న బాధితులు అదే రూట్లో వారికి చేతల్లో చూపిస్తున్నారంటూ ధర్మపురి ఎంపీ అర్వింద్ పై దాడిని ప్రస్తావించారు. వాన, వరదలతో ఇబ్బంది పడుతున్న జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్ధండి గ్రామానికి వెళ్లారు ఎంపీ అర్వింద్. ఆయనపై దాడికి దిగారు కొందరు. చెప్పుల దండని వేయడానికి ప్రయత్నించారు. కాన్వాయ్ ని అడ్డుకొని అద్దాలు పగలకొట్టారు. క్షణంలో అంతా జరిగిపోయింది. పోలీసుల అడ్డుకోవడంతో ఎంపీ అక్కడి నుంచి క్షేమంగా బయటపడ్డారు. అసలు గ్రామస్తులకు ఎందుకంత కోపం వచ్చింది అన్నదానిపై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి.
మల్లన్నగట్టు భూ పరిష్కారంపై
మల్లన్నగట్టు భూపరిష్కారం విషయంపై గతంలో గ్రామస్తులు కొందరు ఎంపీని కలిశారట. అప్పుడు పట్టించుకోలేదట. అందుకే ఇప్పుడు ఇలా దాడికి పాల్పడ్డారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా ఎంపీపై దాడి జరగడం ఇది మొదటిసారి కాదు గతంలో కూడా జరిగాయి. పసుపు బోర్డు విషయంలో ఎంపీ కనిపించడం లేదని, ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర వైఖరిని తప్పుబడుతూ ఇంటి ఎదుటే నిరసనలు తెలిపారు. అయితే ఎంపీపై జరిగిన దాడి వెనక టీఆర్‌ఎస్ కుట్ర ఉందని బీజేపీ ఆరోపిస్తోంది. అధికారపార్టీ చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి దాడులకు దిగుతోందని ఆపార్టీ నేతలు విమర్శిస్తున్నారు.
అధికార పార్టీకి కూడా హెచ్చరికా?
ఈ ఆరోపణలపై అధికారపార్టీ కస్సుమంది. ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం మా పార్టీకి లేదని చెబుతూ మీ పార్టీ , మీ నేతలకు ప్రజల్లో ఎలాంటి ఆదరణ ఉందో ఈ దాడులను చూసి తెలుసుకోమంటూ సలహా ఇస్తోంది. నిజంగా ఎంపీ అర్వింద్ పై ప్రజల్లో వ్యతిరేకత ఉందా? రానున్న ఎన్నికల్లో బీజేపీదే అధికారమంటున్న ఆ పార్టీ ఈ దాడులను ఎలా సమర్థించుకుంటుంది? ఈ దాడి బీజేపీకే గుణపాఠమా లేదంటే అధికారపార్టీకి కూడా హెచ్చరిక లాంటిదా? ఇప్పటికే రెండు దఫాలుగా అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ ఆశించిన స్థాయిలో ప్రజలకు పాలన అందించలేకపోయిందన్న వాదనలైతే ఉన్నాయి. ప్రశాంత్ కిషోర్ సర్వేలో మంత్రులు, ఎమ్మెల్యేల్లో చాలామందిపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారన్న వార్తలు వచ్చాయి. ఇది ప్రజా వ్యతిరేకత ఓట్ల రూపంలో ఉంటుందా? అనేది రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది.