Panchayat Elections: తెలంగాణలో మళ్లీ ఎన్నికల హడావుడి, వచ్చే నెలలోనే - చకచకా ఈసీ ఏర్పాట్లు
Telangana Election Commission: 2024 జనవరి లేదా ఫిబ్రవరిలో సర్పంచ్ ఎన్నికలను నిర్వహించనున్నట్లుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయో లేదో గ్రామ పంచాయతీ ఎన్నికలకు ప్రక్రియ మొదలైంది. ప్రస్తుతం ఉన్న సర్పంచ్ ల పదవీ కాలం వచ్చే ఏడాది జనవరి నెలాఖరుతో ముగియనుండగా, ఈలోపే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. 2024 జనవరి లేదా ఫిబ్రవరిలో సర్పంచ్ ఎన్నికలను నిర్వహించనున్నట్లుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. అందులో భాగంగా సర్పంచ్, వార్డు మెంబర్ల రిజర్వేషన్లపై వివరాలు పంపించాలని అధికారులను ఎన్నికల కమిషన్ కోరింది. సర్పంచ్, వార్డు మెంబర్ల రిజర్వేషన్లపై వివరాలను గ్రామ కార్యదర్శులు ఎలక్షన్ కమిషన్ కు పంపించారు. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం సర్పంచ్ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది.
తెలంగాణలో మొత్తం 12 వేలకు పైగా గ్రామ పంచాయతీలు ఉన్నాయి. లక్షా 13 వేలకు పైగా వార్డులకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఆర్టికల్ 243E(3)(a) ప్రకారం గ్రామ పంచాయతీల పదవీకాలం ఐదేళ్లు కాగా.. ఆ గడువు ముగుస్తుండడంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రక్రియను మొదలుపెట్టింది.