Telangana Elections 2023: మందుబాబులకు షాక్ - 3 రోజులు వైన్స్ బంద్, ఇప్పటివరకూ పట్టుకున్న నగదు ఎంతంటే?
Telangana News: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 28 నుంచి 30 వరకూ రాష్ట్రంలో వైన్స్ బంద్ చేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. కౌంటింగ్ రోజు కూడా వైన్స్ బంద్ చేయాలని పేర్కొంది.
Wine Shops Closed in Telangana: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly Elections 2023) నేపథ్యంలో ఎన్నికల కమిషన్ (Elections Commission) తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 28 (మంగళవారం) సాయంత్రం 5 గంటల నుంచి 30న (గురువారం) సాయంత్రం 5 గంటల వరకూ మద్యం షాపులు, బార్లు, బార్ అండ్ రెస్టారెంట్లను మూసివేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ (Excise Department) అధికారులకు ఆదేశాలిచ్చింది. ఆదేశాలను ఉల్లంఘిస్తే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అదే విధంగా అక్రమ మద్యం రవాణాపై నిఘా పెట్టాలని ఎక్సైజ్ అధికారులకు సూచించింది. ఈసీ ఆదేశాలతో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల కమిషనర్లు అధికారులు, సిబ్బందికి తగు ఆదేశాలిచ్చారు. అదే విధంగా ఓట్ల లెక్కింపు నేపథ్యంలో డిసెంబర్ 3న ఉదయం 6 గంటల నుంచి లెక్కింపు పూర్తయ్యే వరకూ ట్రై కమిషనరేట్ల పరిధిలో మద్యం దుకాణాలు, బార్లను మూసెయ్యాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. స్టార్ హోటల్స్, పబ్బులు, క్లబ్బుల్లోనూ మద్యం సరఫరా నిలిపి వేయనున్నారు.
ముమ్మర తనిఖీలు
మరోవైపు, అక్రమ నగదు రవాణా, మద్యం తరలింపుపై ఎక్సైజ్ శాఖ, పోలీస్ సమన్వయంతో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీ చేస్తూ సరైన పత్రాలు లేని నగదును సీజ్ చేస్తున్నారు. మద్యంను సైతం స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇప్పటికే 236 కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
రూ.14 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల తనిఖీల్లో భాగంగా గడిచిన 24 గంటల్లో దాదాపు రూ.14 కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు తెలంగాణ ఎన్నికల అధికారి కార్యాలయం శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు రూ.6,51,03,561 నగదు, రూ.2,13,60,112 విలువైన మద్యం, రూ.1,79,69,125 విలువైన డ్రగ్స్, రూ.2,53,97,322 విలువైన గోల్డ్, రూ.1,25,05,500 విలువైన చీరలు, ఇతర ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఇప్పటివరకూ పట్టుబడ్డ నగదు మొత్తం రూ.698,89,84,122కు చేరినట్లు ఈసీ అధికారులు వెల్లడించారు.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply
Also Read: Gangula Kamalakar: కరీంనగర్‌లో మంత్రి గంగుల గట్టెక్కుతారా? ఈసారి పరిస్థితి అంత ఈజీ కాదు!