Telangana News: ఏటీఎంలను దోచేస్తూ విమానాల్లో ప్రయాణం - ఎట్టకేలకు చిక్కిన మేవాఠ్ గ్యాంగ్
Telangana News: విమానాల్లో ప్రయాణిస్తూ.. తెలుగు రాష్ట్రాల్లోని ఏటీఎంలను కొల్లగొడుతున్న మేవాఠ్ ముఠా సభ్యులను రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
Telangana News: తెలుగు రాష్ట్రాలైన ఏపీ తెలంగాణలోని ఏటీఎంలను దోచేస్తున్న ఓ ముఠాను రాజస్థాన్ పోలీసులు పట్టుకున్నారు. రెండు రోజుల క్రితం అక్కడి పోలీసులు జైపూర్ విమానాశ్రయంలో ఐదుగురు దొంగలను అరెస్ట్ చేశారు. అయితే నిందితులు రాజస్థాన్ లోని భరత్ పూర్ జిల్లా డీగ్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. 32 ఏళ్ల జుబేర్, 37 ఏళ్ల లుక్మాన్ డీన్, 35 ఏళ్లు సద్దాం, 28 ఏళ్ల ముస్తాక్, 29 ఏళ్ల ఇద్రిస్ లు ఓ ముఠాగా ఏర్పడి.. ఏడేళ్లుగా తెలంగాణ, ఏపీ సహా వివిధ రాష్ట్రాల్లోని ఏటీఎంలను కొల్లగొడుతూ కోట్లు దోచేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. తెలంగాణలోని భద్రాద్రి అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్ ఏటీఎంలో డబ్బును దోచేసి దొంగలు వీరేనని పోలీసుల దర్యాప్తులో తెలిసింది. ‘మేవాఠ్ గ్యాంగ్’గా పిలిచే ఈ ముఠాలో 100 మంది వరకు మోసగాళ్లు ఉన్నారు. అయితే వీరిలో కేవలం ఐదుగురు మాత్రమే పోలీసులకు చిక్కారు.
ఈ మేవాఠ్ గ్యాంగ్ చేసేది ఏంటంటే..?
మేవాఠ్ గ్యాంగ్ సభ్యులు రాజస్థాన్‌లోని భరత్ పూర్, అల్వార్ ప్రాంతాలకు చెందిన పలువురి ఏటీఎం కార్డులు తీసుకుని పది రోజులకోసారి తాము ఎంచుకున్న రాష్ట్రాలకు విమానాల్లో వెళ్తారు. అక్కడి పోలీసులకు ఏమాత్రం అనుమానం రాకుండా స్టైల్ గా రెడీ అయి అక్కడ దిగుతారు. ఆపై గ్రామీణ ప్రాంతాల్లోని ఏటీఎంలను గుర్తించి రాత్రుళ్లు చోరీలకు పాల్పడతారు. ఇద్దరు చొప్పున జట్టుగా ఏర్పడి ఒకరు ఏటీఎం లోపల, మరొకరు ఏటీఎం బయట నిలబడి విద్యుత్ సరఫరా జరిగే ప్రాంతంలో ఉంటారు. అయితే ఏటీఎం నుంచి వచ్చిన డబ్బు తీసుకునే చివరి క్షణంలోనే ఏటీఎంలోకి విద్యుత్ సరఫరా నిలిపివేస్తారు. ఇలా చేయడం వల్ల యంత్రంలో నుంచి నగదు బయటకు వస్తుంది కానీ సంబంధిత ఖాతాదారుడి ఖాతాలో మాత్రం ఉపసంహరణ జరగదు. ఇలా వచ్చిన సొమ్మును ముఠా సభ్యులు, ఏటీఎం కార్డుదారులు సగం వాటాగా పంచుకుంటారని పోలీసులు గుర్తించారు.
ఇలా మోసాలకు పాల్పడుతున్న ముఠా సభ్యులు హైదరాబాద్ నుంచి విమానంలో రాజస్థాన్ బయలుదేరారని పక్కా సమాచారం అందుకున్న ఆ రాష్ట్ర పోలీసులు జైపుర్ విమానాశ్రయంలో నిందితులను పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి 75 ఏటీఎం కార్డులతో పాటు రూ.2.31 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఇటీవలే నేపాలీ ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు
సికింద్రాబాద్ లోని సింధీ కాలనీలో ఈ నెల 9వ తేదీన జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు చేధించారు. రాహుల్ గోయల్ అనే వ్యాపారి ఇంట్లో దుండగులు రూ. 5 కోట్ల సొత్తు చోరీ చేశారు. ఈ కేసులో తాజాగా పోలీసులు 9 మందిని అరెస్టు చేశారు. నేపాల్ కు చెందిన నేరగాళ్లు వ్యాపారి ఇంట్లో నమ్మకంగా పని చేస్తూ తన ముఠాతో కలిసి ఈ భారీ దోపిడీకి పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. వ్యాపారి అపార్ట్‌మెంట్‌లో గత ఐదేళ్లుగా వాచ్‌మెన్ గా పని చేస్తున్న నేపాల్ కు చెందిన శంకర్ మాన్ సింక్ అలియాస్ కమల్.. మరో 12 మందితో కలిసి ఈ దోపిడీకి పాల్పడ్డట్లు పోలీసులు వెల్లడించారు. 41 లక్షల నగదు, 2.8 కిలోల బంగారం, 18 ఖరీదైన వాచీలు స్వాధీనం చేసుకున్నట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. మొత్తం 13 మంది కలిసి ఈ దోపిడీ చేయగా.. అందులో 9 మందిని అరెస్టు చేశారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉండగా వారి కోసం గాలింపు చేపట్టారు. ముంబైకి చెందిన ఓ ఏజెన్సీ నేపాలీలకు ఉపాధి కల్పిస్తున్నట్లు గుర్తించినట్లు చెప్పారు.