IT Raids on BRS MLA Nallamothu Bhaskararao Houses: రాష్ట్రంలో ఐటీ సోదాలు - ఈసారి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంట్లో తనిఖీలు
IT Raids in Tealangana: తెలంగాణలో వరుస ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటివరకూ కాంగ్రెస్ నేతల ఇళ్లల్లో సోదాలు జరగ్గా, తాజాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంట్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు.
IT Raids on BRS MLA Nallamothu Bhaskararao: తెలంగాణలో మరోసారి ఐటీ సోదాలు (IT Raids) కలకలం రేపాయి. ఈసారి మిర్యాలగూడ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు (Nallamothu Bhaskarrao) ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు గురువారం తెల్లవారుజాము నుంచే తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో, నల్గొండ, మిర్యాలగూడల్లోని (Miryalaguda) ఆయన బంధువులు నివాసాల్లో ఏకకాలంలో 40 బృందాలు దాడి చేసి సోదాలు చేస్తున్నారు. 30 బృందాలు ఒక్క నల్గొండలోనే దాడికి దిగాయి. నల్లమోతు భాస్కరరావుకు దేశవ్యాప్తంగా పలు వ్యాపారాలున్నట్లు తెలుస్తోంది. పలు పవర్ ప్లాంట్లలో ఆయన పెట్టుబడులు కూడా పెట్టినట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు ఆయన భారీగా డబ్బులు నిల్వ చేశారనే ఆరోపణలున్నాయి. ఈ మేరకు సమాచారం అందుకున్న అధికారులు సోదాలు చేపట్టారు.
బంధువుల ఇళ్లల్లోనూ తనిఖీలు
నల్లమోతు బంధువుల ఇళ్లల్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయన బావమరిది రంగా శ్రీధర్ తో పాటు రంగా రంజిత్, బండారు కుశలయ్య ఇళ్లల్లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. అలాగే, నల్గొండలోని రవీందర్ నగర్, పాతబస్తీ, మహేంద్ర ఆయిల్ మిల్ యజమానికి కందుకూరు మహేందర్ ఇంటితో ఆయనకు చెందిన రైస్ మిల్, మరో 7 చోట్లు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఎన్నికల నేపథ్యంలో ముమ్మర తనిఖీలు
తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఐటీ అధికారుల సోదాలు ముమ్మరం చేశారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు సహా అధికార బీఆర్ఎస్ నేతల ఇళ్లల్లోనూ తనిఖీలు చేస్తున్నారు. ఇటీవల మహేశ్వరం (Maheswaram) కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డితో (KLR) పాటు బడంగ్ పేట్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి (Parijatha) ఇళ్లల్లో దాడులు నిర్వహించి వారికి నోటీసులిచ్చారు. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే బాలాపూర్ కే చెందిన కాంగ్రెస్ నేత వంగేట లక్ష్మారెడ్డి ఇంట్లోనూ సోదాలు జరిగాయి.
మాజీ ఎంపీ ఇంట్లో
తాజాగా మాజీ ఎంపీ, పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) ఇంట్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఖమ్మం జిల్లాతో పాటు హైదరాబాద్ లోని మొత్తం 30 ప్రాంతాల్లో, అనుచరుల ఇళ్లల్లోనూ తనిఖీలు చేశారు. ఆయన అనుచరుల ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహించారు. ఈ దాడులపై కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల నేతల ఇళ్లల్లోనే ఐటీ దాడులు చేస్తున్నారని ఆరోపించారు.
మంత్రి సబిత అనుచరుల ఇళ్లల్లోనూ
మంత్రి సబిత అనుచరుల (Minister Sabitha) ఇళ్లల్లోనూ ఇటీవల ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సబిత అనుచరులుగా ప్రచారం జరుగుతోన్న నరేందర్ రెడ్డి ఇంట్లో రూ.7.50 కోట్లు, ప్రదీప్ రెడ్డి ఇంట్లో రూ.5 కోట్లకు పైగా నగదు సీజ్ చేసినట్లు తెలుస్తోంది. వీరికి మంత్రి సబిత కుమారుడితో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు అధికారుల విచారణలో తేలింది. ఇప్పటివరకూ కాంగ్రెస్ నేతలనే టార్గెట్ చేశారనే ఆరోపణల నేపథ్యంలో తాజాగా, అధికార పార్టీ నేతల అనుచరుల ఇళ్లల్లోనూ సోదాలు చేస్తుండడంతో గందరగోళం నెలకొంది.