New Secretariat Inaguration: తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభం, కీలక ఫైల్స్‌పై కేసీఆర్ తొలి సంతకం
బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున కేసీఆర్ కు పుష్పగుచ్ఛాలు సమర్పించారు. చాలా మంది కేసీఆర్ కు పాదాభివందనం చేశారు.
తెలంగాణ సచివాలయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. నేడు (ఏప్రిల్ 30) మధ్యాహ్నం 1.30కు ముందుగా అనుకున్న ముహూర్తం ప్రకారం సచివాలయ శిలాఫలకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. అనంతరం తనర ఛాంబర్ లోకి వెళ్లి కీలకమైన 6 ఫైల్స్ పైన సంతకాలు చేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున కేసీఆర్ కు పుష్పగుచ్ఛాలు సమర్పించారు. తన ఛాంబర్‌లో ఆసీనులైన సీఎంకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్‌కు మంత్రి హరీశ్‌రావు పాదాభివందనం చేశారు. మరోవైపు మంత్రులు కూడా సుముహూర్త సమయంలో తమ ఛాంబర్లలోకి ప్రవేశించారు. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్ తదితరులు నిర్ణయించిన సమయానికి తమ సీట్లలో ఆసీనులయ్యారు.
తొలుత మేయిన్ గేట్ వద్ద సీఎం కేసీఆర్‌కు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అక్కడినుంచి నడుచుకుంటూ వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్ యాగశాలను సందర్శించారు. యాగశాలలో చేసిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వాస్తుపూజ నిర్వహించారు. ఆ తర్వాత రిబ్బన్ కట్ చేసి కొత్త సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమ నిర్వహణకు పెద్ద సంఖ్యలో వేదపండితులు హాజరయ్యారు. ప్రధాన గేటు వద్ద ముఖ్యమంత్రిని వేద మంత్రోచ్ఛారణలతో స్వాగతించి ఆశీర్వచనాలు పలికారు.
సచివాలయంలో అంతస్తుల వారీగా విభాగాల వివరాలు
గ్రౌండ్ ఫ్లోర్ : ఎస్సీ మైనార్టీ, లేబర్, రెవెన్యూ శాఖలు
1వ అంతస్తు: ఎడ్యుకేషన్, పంచాయతీ రాజ్, హోంశాఖ
2వ అంతస్తు: ఫైనాన్స్, హెల్త్, ఎనర్జీ, పశు సంవర్థక శాఖ
3వ అంతస్తు: ఇండస్ట్రియల్ అండ్ కామర్స్ డిపార్ట్ మెంట్, ప్లానింగ్ డిపార్ట్ మెంట్
4వ అంతస్తు : ఫారెస్ట్, కల్చరల్ డిపార్ట్ మెంట్, నీటి పారుదల శాఖ, లా డిపార్ట్ మెంట్
5వ అంతస్తు: ఆర్ అండ్ బి, సాధారణ పరిపాలన శాఖలు
6వ అంతస్తు: సీఎం, సీఎస్, సిఎంవో ఉన్నతాధికారులు, పీఆర్వో, సిబ్బంది కార్యాలయాలు
ముఖ్యమంత్రి కార్యాలయం వివరాలు
ఆరో అంతస్తులో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ముఖ్యమంత్రి కార్యాలయం ఏర్పాటైంది. పూర్తిగా తెల్లటి మార్బుల్‌తో సీఎంకార్యాలయం, ఆయన సిబ్బందికి ప్రత్యేక విభాగాలు ఏర్పాటుచేశారు. ముఖ్యమంత్రి ప్రజలను కలిసేందుకు, ప్రజాదర్బారు నిర్వహించేందుకు 'జనహిత' పేరిట కనీసం 250 మంది కూర్చునేలా ఒక హాలును ఏర్పాటు చేశారు. 25 మంది మంత్రులు, 30 మందికి పైగా అధికారులు కూర్చునేందుకు వీలుగా కేబినెట్ హాలును సిద్ధం చేశారు. కలెక్టర్లతో సమావేశాల నిర్వహణ కోసం 60 మంది కూర్చునేలా ఒక హాలు, 50 మంది సమావేశమయ్యేందుకు మరో హాలును నిర్మించారు. ఈ నాలుగు మందిరాలతో పాటు ముఖ్యమంత్రి విశిష్ట అతిథులతో కలిసి భోజనం చేసేందుకు.. సుమారు 25 మంది ఆసీనులయ్యేలా అత్యాధునిక డైనింగ్ హాలును ఏర్పాటు చేశారు.